Begin typing your search above and press return to search.

ఐపీఎల్ 18.. ఈ రోజు భారత క్రికెట్ కు కొత్త నాయకుడు పుట్టనున్నాడా?

మరికొన్ని గంటలే.. ఎన్నడూ లేని విధంగా సాగిన.. అభిమానులను మురిపించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ ముగిసిపోనుంది.. కొత్త చాంపియన్ పుట్టనుంది.

By:  Tupaki Desk   |   3 Jun 2025 1:59 PM IST
ఐపీఎల్ 18.. ఈ రోజు భారత క్రికెట్ కు కొత్త నాయకుడు పుట్టనున్నాడా?
X

మరికొన్ని గంటలే.. ఎన్నడూ లేని విధంగా సాగిన.. అభిమానులను మురిపించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ ముగిసిపోనుంది.. కొత్త చాంపియన్ పుట్టనుంది. అదే సమయంలో భారత క్రికెట్ భవిష్యత్ కెప్టెన్ కూడా పుట్టనున్నాడా? అది ఎవరు? రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సారథి రజత్ పటీదారా? లేక పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యరా?

ఐపీఎల్ 18లో తొలిసారి కప్ కొట్టే అవకాశం ఉన్న బెంగళూరు, పంజాబ్ లు ఈసారి కొత్త కెప్టెన్లతో బరిలో దిగాయి. వీటిలో టైటిల్ ఎవరు అందిస్తే వారికి భారత క్రికెట్ లో మంచి పేరు వస్తుందనడంలో సందేహం లేదు. అయితే, చాంపియన్ గా నిలిస్తే పటీదార్ కంటే శ్రేయస్ కే ఎక్కువ పేరు అనడంలో సందేహం లేదు.

ఇప్పటికే టీమ్ ఇండియా వన్డే ఫార్మాట్ లో శాశ్వత సభ్యుడైన శ్రేయస్.. టెస్టుల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి ఐపీఎల్ ఓ ప్లాట్ ఫామ్ కానుంది. ఇంగ్లండ్ లో పర్యటించనున్న టీమ్ ఇండియాలోకి శ్రేయస్ ను ఎంపిక చేయనందుకే అభిమానులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో అతడు పంజాబ్ కు గనుక టైటిల్ అందిస్తే టెస్టుల్లోకి తీసుకోవాలనే డిమాండ్ మరింత పెరగడం ఖాయం.

గత ఐదు సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ ను ఐపీఎల్ ఫైనల్స్ కు చేర్చిన అయ్యర్ నాయకత్వ లక్షణాలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. భవిష్యత్ టీమ్ ఇండియా కెప్టెన్ గానూ పేర్కొంటున్నారు. టెస్టుల్లో ప్రస్తుతానికి శుబ్ మన్ గిల్ ను ఎంపిక చేసినా.. అతడి కంటే శ్రేయస్ బెటర్ అనేది కొందరి వాదన.

టి20ల్లో కుర్రాళ్ల కారణంగా శ్రేయస్ కు ప్రస్తుతానికి చోటు లేదు. అయితే, మళ్లీ రాలేడని మాత్రం చెప్పలేం. వన్డేల్లో రోహిత్ శర్మ గనుక రిటైర్ అయితే వెంటనే అయ్యర్ కే కెప్టెన్సీ ఇవ్వడం ఖాయం.

ముంబై ఇండియన్స్ కు సారథ్యం వహించి.. టైటిల్స్ అందించి.. రోహిత్ శర్మ టీమ్ ఇండియా కెప్టెన్ అయిన సంగతిని గుర్తు చేస్తూ.. దానిని అయ్యర్ కు ఆపాదిస్తున్నారు.

ఇక బెంగళూరు టైటిల్ గెలిస్తే రజత్ పటీదార్ కు కూడా మేలు జరగనుంది. అయితే, గతంలో అతడు టీమ్ ఇండియాలోకి ఎంపికైనా అవకాశాలను సద్వినియోగం చేసుకోలేదు. ఇప్పుడు ఐపీఎల్ గెలిస్తే మంచి పేరుతో పాటు అవకాశాల ద్వారాలు తెరుచుకుని ఉంటాయి.