Begin typing your search above and press return to search.

ఐపీఎల్ 18: గుజరాత్-ముంబై.. ఇవాళ ‘ఎలిమినేట్’ ఎవరు? ఒకవేళ వాన పడితే?

లీగ్ దశలో మొదటినుంచి టాప్ లో ఉండి.. చివర్లో అనూహ్యంగా వెనుకబడి మూడో స్థానానికి పడిపోయిన జట్టు ఒకటి.

By:  Tupaki Desk   |   30 May 2025 1:28 PM IST
ఐపీఎల్ 18: గుజరాత్-ముంబై.. ఇవాళ ‘ఎలిమినేట్’ ఎవరు? ఒకవేళ వాన పడితే?
X

లీగ్ దశలో మొదటినుంచి టాప్ లో ఉండి.. చివర్లో అనూహ్యంగా వెనుకబడి మూడో స్థానానికి పడిపోయిన జట్టు ఒకటి. లీగ్ దశలో తొలి మ్యాచ్ లలో వరుసగా ఓటములు చవిచూసినా.. తేరుకుని విజయాల బాట పట్టిన జట్టు ఒకటి. ఇలాంటి జట్లు అనుకోకుండా.. ఐపీఎల్ ’ఎలిమినేటర్’లో ఎదురుపడితే..? శుక్రవారం జరగనున్న మ్యాచ్ లో వీటిలో ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?

పంజాబ్ కింగ్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య గురువారం నాటి క్వాలిఫయర్-1 అభిమానులకు ఏమాత్రం మజా పంచలేదు. పంజాబ్ పేపర్ పై కనిపించినంత బలంగా మైదానంలో ఆడలేదు. దీంతో మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. అయితే, ఓడిన పంజాబ్ కు మరో చాన్స్ క్వాలిఫయర్ 2 రూపంలో ఉంది.

శుక్రవారం జరిగే ఎలిమినేటర్ లో ఓడితే మాత్రం గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ లో ఒక జట్టు ఇంటికి వెళ్లాల్సిందే. గెలిచిన జట్టు పంజాబ్ తో క్వాలిఫయర్ 2 ఆడుతుంది. వాస్తవానికి లీగ్ చివరి వరకు గుజరాత్ టేబుల్ టాపర్ గానే ఉంది. చివరి రెండు మ్యాచ్ లలో ఓడడంతో మూడో స్థానానికి పడిపోయి ఎలిమినేటర్ ఆడాల్సి వస్తోంది. ఆ జట్టుకు మరో ప్రధాన దెబ్బ.. స్టార్ బ్యాట్స్ మన్ జాస్ బట్లర్ ఇంగ్లండ్ వెళ్లిపోవడం. దీంతో భారం అంతా ఓపెనర్లు కెప్టెన్ శుబ్ మన్ గిల్, సాయి సుదర్శన్ మీద పడుతోంది.

పంజాబ్-బెంగళూరు క్వాలిఫయర్ మ్యాచ్ జరిగిన ముల్లాన్ పూర్ లోనే ఎలిమినేటర్ మ్యాచ్ కూడా జరగనుంది.

గుజరాత్ లాగానే ముంబై కూడా లీగ్ చివరి మ్యాచ్ లలో ఓడింది. గత మూడు మ్యాచ్ లలో రెండు ఓడిపోవడంతో నాలుగో స్థానానికి పరిమితమైంది.

గురువారం పంజాబ్-బెంగళూరు మ్యాచ్ కు వర్షం అంతరాయం లేదు. మరి ఎలిమినేటర్ కు అడ్డంకి ఏర్పడితే..? మ్యాచ్ రద్ద కూడా అయితే?

వర్షం కారణంగా మ్యాచ్ సాగలేని పరిస్థితుల్లో గుజరాత్ టైటాన్స్ క్వాలిఫయర్ 2కు అర్హత సాధిస్తుంది. ఎలిమినేటర్ కు రిజర్వ్ డే కూడా లేదు కాబట్టి.. ముంబై ఇండియన్స్ ఇంటికి వెళ్లిపోతుంది. ఇక వాతావరణ శాఖ మాత్రం మ్యాచ్ ను ఆస్వాదించవచ్చని చెబుతోంది. వాన ముప్పు లేదని.. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలు.. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 25 డిగ్రీలు ఉంటాయని పేర్కొంటోంది.