ఐపీఎల్.. బంతికి కాదు.. బ్యాట్ కు పరీక్ష.. ప్రతి మ్యాచ్ లోనూ
టి20 క్రికెట్ అంటేనే ధనాధన్.. బంతిని చితక్కొట్టడమే.. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ వంటి భారీ లీగ్ లో బ్యాట్స్ మెన్ వీర బాదుడులో అయ్యో పాపం బంతి అనుకునే పరిస్థితులు.. 300 కొట్టేసేలా కనిపించిన నిరుడు సన్ రైజర్స్ ఆట ప్రకారమే చూస్తే.. బంతి బలి అని అనుకోవాల్సిందే.. అందుకే ప్రతి మ్యాచ్ లో బంతికి పరీక్షే.
By: Tupaki Desk | 18 April 2025 5:30 PMటి20 క్రికెట్ అంటేనే ధనాధన్.. బంతిని చితక్కొట్టడమే.. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ వంటి భారీ లీగ్ లో బ్యాట్స్ మెన్ వీర బాదుడులో అయ్యో పాపం బంతి అనుకునే పరిస్థితులు.. 300 కొట్టేసేలా కనిపించిన నిరుడు సన్ రైజర్స్ ఆట ప్రకారమే చూస్తే.. బంతి బలి అని అనుకోవాల్సిందే.. అందుకే ప్రతి మ్యాచ్ లో బంతికి పరీక్షే.
కానీ, పరిస్థితి ఇప్పుడు తిరగబడింది.. ఐపీఎల్ లో బంతికి కాదు బ్యాట్ కు పరీక్ష ఎదురవుతోంది.. అది కూడా ప్రతి బ్యాట్ కూ.. దీనికి కారణం భారీ బ్యాట్లు అని చెబుతున్నారు. వాస్తవానికి ఎంత టి20 క్రికెట్ అయినా.. బంతికి కాస్తంత న్యాయం అయినా జరగాలి. కానీ, భారీ బ్యాట్లతో అది కూడా దక్కని పరిస్థితి. అంటే.. ప్రతిభావంతుడైన బౌలర్ కూడా బ్యాట్స్ మెన్ బారిన పడి ధారాళంగా పరుగులు ఇచ్చుకోవాల్సిందే అన్నమాట.
ఈ నేపథ్యంలో ఐపీఎల్ 18లో భారీ బ్యాట్లు ఎవరి దగ్గర ఉన్నాయా? అని మ్యాచ్ అఫీషియల్స్ భూతద్దం వేసి మరీ వెదుకుతున్నారు. ఎక్కడైనా బ్యాట్ తేడాగా కనిపిస్తే మాత్రం వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. బ్యాటర్లు అదనపు ప్రయోజనం పొందకుడా ఐపీఎల్ పాలక మండలి ఈ చర్యలు చేపడుతోందట. దీంతో నిర్ణీత కొలతలకు మించి ఉన్న బ్యాట్లను అంపైర్లు అనుమతించడం లేదు.
ఇటీవల కోల్ కతా నైట్ రైడర్స్ ఓపెనర్ సునీల్ నరైన్ బ్యాట్ ను అంపైర్లు అదే పనిగా పరీక్షించడంతో అభిమానులు ఏం జరిగిందా? అని ఆశ్చర్యపోయారు. ఇదే కాదు.. ప్రతి మ్యాచ్ లోనూ అంపైర్లు బ్యాట్స్ మెన్ బ్యాట్లను పరీక్షిస్తున్నారు. ప్రత్యేక గేజ్ తో కొలతలు చూస్తున్నారు.
వాస్తవానికి నిరుడు కూడా బ్యాట్స్ సైజులను చూడడం మొదలుపెట్టారు. అయితే, అందరివీ కాదు. మ్యాచ్ ముందు రోజు ఫోర్త్ అంపైర్ మాత్రమే ఒక ఆటగాడి బ్యాట్ ను పరిశీలించేవాడు. ఇది ర్యాండమ్ చెక్ మాత్రమే. అంటే.. ఫోర్త్ అంపైర్ పరిశీలించిన బ్యాట్ తోనే ఆటగాడు మ్యాచ్ లోకి దిగాడా? వేరేదాంతో వెళ్లాడా? అనేది చూసేవారు కాదు. ఇలాగైతే ఎలాగని లీగ్ ప్రారంభానికి ముందు మ్యాచ్ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ జరుగుతుండగా బ్యాట్ల పరిశీలనకు ఏప్రిల్ 13న ఐపీఎల్ పాలక మండలి ఆమోద ముద్ర వేసింది. అలా మ్యాచ్ లో ప్రతి ఒక్క బ్యాట్ ను పరిశీలిస్తున్నారు.