ఐపీఎల్-19 మినీ వేలం.. కోల్ కతా-చెన్నై మధ్య మనీ పర్స్ యుద్ధమే!
వచ్చే నెలలో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ కు సంబంధించి రిలీజింగ్ (విడుదల) ఆటగాళ్ల పేర్లు బయటకు వచ్చాయి.
By: Tupaki Desk | 16 Nov 2025 12:20 PM ISTవచ్చే నెలలో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ కు సంబంధించి రిలీజింగ్ (విడుదల) ఆటగాళ్ల పేర్లు బయటకు వచ్చాయి. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) వంటి జట్టు తమ కీలక ఆల్ రౌండర్ రవీంద్ర జడేజానే వదిలేసుకుంది. కోల్ కతా నైట్ రైడర్స్ విజయాల్లో 11 సీజన్లుగా కీలకగా నిలిచిన వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రీ రసెల్ ను ఆ జట్టు వద్దనుకుంది. నిరుడు రూ.23.75 కోట్లు వెచ్చించి మరీ తీసుకున్న వెంకటేష్ అయ్యర్ కనీస న్యాయం చేయకపోవడంతో అతడినీ కోల్ కతా వదిలేసింది. ఇలాంటి ఆసక్తికర రిలీజింగ్ లు చాలా ఉన్నాయి. ఇక ఆ ప్రక్రియ ముగిసినందున ఫ్రాంచైజీల వారీగా ఎంత డబ్బు మిగిలింది? అనేది కీలకం కానుంది. ఎందుకంటే.. వచ్చే నెలలో జరిగే మినీ వేలంలో ఈ డబ్బుతోనే ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఎంత ఎక్కువ డబ్బు ఉంటే అంతగా వేలంలో ఖర్చు పెట్టేందుకు అవకాశం ఉంటుంది.
కోల్ కతా ఎవరిని కొంటుందో..?
రసెల్, అయ్యర్ లను వదిలేసిన కోల్ కతా దగ్గర ప్రస్తుతం రూ.64.30 కోట్ల పర్స్ మనీ ఉంది. అత్యధికంగా ఈ ఫ్రాంచైజీ దగ్గరే డబ్బుంది. ఈ మొత్తంతో ఆ జట్టు ఎందరు ఆటగాళ్లను తీసుకుంటుందో చూడాలి. అయ్యర్ 23 కోట్లను ఈసారి ఎవరికి ఇస్తుంది? అంతకంటే పెద్దమొత్తం ఏమైనా ఖర్చు చేస్తుందా? అన్నది ఆసక్తికరం.
సంజూ సరే.. చెన్నై సంగతేంటి?
గత రెండు సీజన్లుగా లీగ్ లో పేలవ ప్రదర్శన చేస్తోంది చెన్నై సూపర్ కింగ్స్. రికార్డు స్థాయిలో ఐదుసార్లు చాంపియన్ అయిన చెన్నై ఈసారి రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ను రూ.16 కోట్లకు ట్రేడ్ చేసుకుంది. ఇంకా ఆ జట్టు వద్ద రూ.43.40 కోట్లు మిగిలి ఉన్నాయి. రూ. 16 కోట్ల విలువైన ఆటగాడు జడేజాను వదులుకున్నందున ఆ స్థాయి మొత్తం ఎవరి మీద ఖర్చు పెడుతుంది? కరన్ ను కూడా రిలీజ్ చేశారు కాబట్టి ఇక కొత్తగా తీసుకునేది ఎవరిని అనేది ఆసక్తికరంగా మారింది.
సన్ రైజర్స్ కు కొత్త రక్తం..
రూ.10 కోట్లకు నిరుడు తెచ్చుకున్న సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ తీవ్రంగా నిరాశపరచడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ అతడిని వదిలేసింది. రాహుల్ చహర్ (స్పిన్నర్)నూ వద్దనుకుంది. ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపానూ రిలీజ్ చేసింది. ఈ ముగ్గురూ బౌలర్లే. ఇప్పుడు సన్ రైజర్స్ వద్ద రూ.25.50 కోట్ల నగదు ఉంది. ఈ మొత్తాన్ని బౌలర్లపైనే ఖర్చు పెడుతుంది.
-ఇక లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) వద్ద రూ.22.95 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద రూ.21.80 కోట్లు, చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (రూ.16.40 కోట్లు), రాజస్థాన్ రాయల్స్ (రూ.16.05 కోట్లు), గుజరాత్ టైటాన్స్ (రూ.12.90 కోట్లు), పంజాబ్ కింగ్స్ (రూ.11.50 కోట్ల), ముంబై ఇండియన్స్ (రూ.2.75 కోట్లు) పర్స్ తో ఉన్నాయి.
ముంబైకే కఠిన వేలం
వచ్చే మినీ వేలం ముంబై ఇండియన్స్ కు చాలా కఠినం కానుంది. కేవలం రూ.2.75 కోట్లు పర్స్ మాత్రమే ఉండడం దీనికి కారణం. నాణ్యమైన ఆటగాళ్లను కొనేందుకు ఈ మొత్తం సరిపోదు. ఇక అసలు సమరం మాత్రం కోల్ కతా నైట్ రైడర్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్యనే అనడంలో సందేహం లేదు. వీటి వద్ద ఎక్కువ డబ్బు ఉండడమే దీనికి కారణం.
