Begin typing your search above and press return to search.

దాయాదుల పోరులో కొత్త కోణం.. ఆసుపత్రుల్లో బెడ్ బుకింగ్!

క్రికెట్ మ్యాచ్ చూసేందుకు అహ్మదాబాద్ కు వస్తున్న వారికి తగినట్లుగా హోటల్ గదులు లేకపోవటంతో.. పలువురు ఆసుపత్రుల్లో బెడ్లు బుక్ చేసుకోవటం గమనార్హం.

By:  Tupaki Desk   |   13 Oct 2023 4:10 AM GMT
దాయాదుల పోరులో కొత్త కోణం.. ఆసుపత్రుల్లో బెడ్ బుకింగ్!
X

వినేందుకు విచిత్రంగా ఉన్నప్పటికీ ఇది నిజంగా నిజమని చెబుతున్నారు. అహ్మదాబాద్ లో భారత్ - పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ ను చూసేందుకు క్రికెట్ అభిమానులు పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కావు. దాయాదుల మధ్య పోరు అన్నంతనే ఆ మ్యాచ్ మీద ఉండే అంచనాలు అన్ని ఇన్ని కావు. కొన్ని సందర్భాల్లో అయితే.. ఈ జట్ల మధ్య జరిగే మ్యాచ్ లో గెలిస్తే చాలు.. టోర్నీ ఓడినా ఫర్లేదన్నట్లుగా వాదనలు జరుగుతుంటాయి.

ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా భారత్ - పాక్ మధ్య జరిగే మ్యాచ్ కు అహ్మదాబాద్ వేదికగా మారనుంది. ఈ మ్యాచ్ చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున అహ్మదాబాద్ బాట పడుతున్నారు. బయట ప్రాంతాలనుంచి పోటెత్తుతున్న వారంతా బస చేసే హోటల్ గదులన్ని ఫుల్ గా బుక్ అయిపోయాయి. దీంతో.. మామూలు ధరల కంటే 20 రెట్లు అదనంగా హోటల్ గదుల ధరలు పెరిగినట్లుగా చెబుతున్నారు.

ఈ మ్యాచ్ ను స్వయంగా చూసేందుకు అహ్మదాబాద్ కు వస్తున్న వారు.. హోటల్ గదుల ధరల్ని చూసి బిత్తరపోతున్నారు. దీంతో.. వారిలో పలువురు కొంగొత్త ప్లాన్లు వేస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది. క్రికెట్ మ్యాచ్ చూసేందుకు అహ్మదాబాద్ కు వస్తున్న వారికి తగినట్లుగా హోటల్ గదులు లేకపోవటంతో.. పలువురు ఆసుపత్రుల్లో బెడ్లు బుక్ చేసుకోవటం గమనార్హం.

హెల్త్ చెకప్ పేరుతో ప్యాకేజీలు తీసుకోవటం ద్వారా.. ఓవైపు ఆసుపత్రిలోనే ఉంటూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవటం.. మరోవైపు హోటల్ గదులకున్న డిమాండ్ ను ఈ తీరులో తప్పించుకుంటున్నట్లు చెబుతున్నారు. ఆసుపత్రుల్లో హెల్త్ చెకప్ లకు బుక్ చేసుకొని.. మ్యచ్ సమయానికి బయటకు వెళ్లేలా ప్లాన్ చేసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే.. పేషెంట్లకు అందించాల్సిన వైద్య సేవల్ని.. మ్యాచ్ కోసం ఇలాంటి బుకింగ్ లను అంగీకరించటానికి కొన్ని ఆసుపత్రులు నో చెప్పేస్తున్నాయి. ఏమైనా.. కీలక క్రికెట్ మ్యాచ్ ను చూసేందుకు వీలుగా ఆసుపత్రుల్లో చేరే వరకు విషయం వెళ్లటమంటే.. అహ్మదాబాద్ లో పరిస్థితి ఎలా ఉందో ఇట్టే చెప్పొచ్చని చెబుతున్నారు.