Begin typing your search above and press return to search.

టికెట్ అర కోటి.. దాయాదితో మ్యాచ్ కు ఆస్తులు అమ్ముకోవాల్సిందే

వన్డే ప్రపంచ కప్ అయినా.. టి20 ప్రపంచ కప్ అయినా.. ఆఖరికి ఆ రెండు జట్లు సాధారణ లీగ్ మ్యాచ్ లో తలపడినా.. టికెట్ హాట్ కేక్.

By:  Tupaki Desk   |   5 Sep 2023 9:55 AM GMT
టికెట్ అర కోటి.. దాయాదితో మ్యాచ్ కు ఆస్తులు అమ్ముకోవాల్సిందే
X

వన్డే ప్రపంచ కప్ అయినా.. టి20 ప్రపంచ కప్ అయినా.. ఆఖరికి ఆ రెండు జట్లు సాధారణ లీగ్ మ్యాచ్ లో తలపడినా.. టికెట్ హాట్ కేక్. అర్థరాత్రి అయినా అపరాత్రి అయినా ఆ టికెట్ కోసం పడిగాపులు కాయాల్సిందే.. ఆ జట్ల మధ్య మ్యాచ్ అంటే సిటీల్లో ట్రాఫిక్ క్లియర్ అయిపోతుంది.. ఊళ్లలో టీవీలన్నీ ఆన్ అవుతాయి. ఇక మైదానాలన్నీ నిండిపోతాయి. మ్యాచ్ టికెట్లయితే క్షణాల్లో అమ్ముడవుతాయి.

తలపడి నాలుగేళ్లు

దశాబ్దాలుగా భారత్ –పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే అభిమానులకు ఓ యుద్ధంతో సమానం. అయితే, కొన్నేళ్లుగా పరిస్థితి మారింది. అభిమానుల ఆలోచనా కూడా మారింది. ఇదివరకటి స్థాయిలో కసిగా కాకుండా స్పోర్టివ్ గా చూస్తున్నారు. దీనినే పరిణతి అని అంటారు. కాగా, వన్డేల్లో భారత్ –పాక్ తలపడి నాలుగేళ్లు దాటిపోయింది. అది కూడా చివరిసారిగా వరల్డ్ కప్ లోనే. రోహిత్ శర్మ అద్భుత సెంచరీతో.. 2019లో ఇంగ్లండ్ లో జరిగిన కప్ లో మన జట్టు పాకిస్థాన్ ను ఓడించిన సంగతి తెలిసిందే. పరిస్థితుల నేపథ్యంలో ద్వైపాక్షిక సిరీస్ లు జరగడం లేదు. దీంతో టెస్టుల సంగతి అటుంచి కనీసం వన్డేలు ఆడే చాన్స్ కూడా లేదు.

ఆడితే ప్రపంచ కప్ లోనే...

భారత్-పాక్ మ్యాచ్ చూసే భాగ్యం రావాలంటే ప్రపంచ కప్ లు జరగాల్సిందే. గత ఏడాది టి20 ప్రపంచ కప్ లో మన జట్టు కోహ్లి అద్భుత ఇన్నింగ్స్ తో పాక్ ను ఓడించింది. తాజాగా గత శనివారం రెండు జట్లు ఆసియా కప్ లో తలపడినప్పటికీ.. వర్షం అంతరాయం కారణంగా భారత ఇన్నింగ్స్ మాత్రమే జరిగింది. అయితే, వన్డే ప్రపంచ కప్ లో అక్టోబర్‌ 14న అహ్మదాబాద్‌ వేదికగా తలపడనున్నాయి. ఇది హైఓల్టేజీ పోరనే విషయం అందరికీ తెలిసిందే. ఈ మ్యాచ్ కు సంబంధించి ఆగస్టు 29, సెప్టెంబరు 3న అధికారికంగా టికెట్ల విక్రయాలు నిర్వహించగా.. గంట వ్యవధిలోనే ‘సోల్డ్‌ ఔట్‌’ బోర్డులు కనిపించాయి. దీంతో సెకండరీ మార్కెట్‌లో టికెట్లకు విపరీతమైన డిమాండ్ వచ్చింది. ప్రపంచంలోనే అతి పెద్దమైన గుజరాత్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో.. సౌత్‌ ప్రీమియమ్‌ వెస్ట్ బే టికెట్‌ రేటు రూ.19.5 లక్షలు కాగా.. అప్పర్‌ టైర్‌లోని రెండు టికెట్లు మాత్రమే మిగిలాయట. ఈ విషయాన్ని స్పోర్ట్స్‌ టికెట్ల ఎక్ఛ్సేంజ్, రీ సేల్‌ వెబ్‌సైట్‌ ‘వయాగోగో’ చూపిస్తోంది. అయితే, ఒక్కో టికెట్‌ రూ.57 లక్షలు ఉండటం గమనార్హం. భారత్- పాకిస్థాన్ మ్యాచ్‌కే కాకుండా.. మన జట్టు ఆడే మిగతా మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్ ధరలు కూడా సెకండరీ మార్కెట్‌లో భారీగా ఉన్నాయి. భారత్ - ఆస్ట్రేలియా మ్యాచ్‌ టికెట్ల రేంజ్‌ రూ.41 వేలు నుంచి రూ. 3 లక్షల వరకు పెరిగింది. భారత్ - ఇంగ్లాండ్ మ్యాచ్‌కు రూ. 2.3 లక్షల వరకూ టికెట్లను విక్రయించారు.

బీసీసీఐ.. మా ఆస్తులు అమ్ముకోవాలా?

ప్రపంచ కప్ మ్యాచ్ ల టికెట్ ధరలు చూసి అభిమానులు.. సోషల్ మీడియాలో ఐసీసీ, బీసీసీఐలను ట్రోల్‌ చేస్తున్నారు. దాయాదుల పోరును చూడాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందేనా? అని ప్రశ్నిస్తున్నారు.