Begin typing your search above and press return to search.

దాయాది పోరు వర్షార్పణమేనా?

క్రికెట్ ప్రియులకు విందు లాంటి ఆసియా కప్ మొదలుకానుంది. ఈ టోర్నీలో పాల్గొనేందుకు టీమిండియా శ్రీలంకలో అడుగు పెట్టింది.

By:  Tupaki Desk   |   31 Aug 2023 4:20 AM GMT
దాయాది పోరు వర్షార్పణమేనా?
X

క్రికెట్ ప్రియులకు విందు లాంటి ఆసియా కప్ మొదలుకానుంది. ఈ టోర్నీలో పాల్గొనేందుకు టీమిండియా శ్రీలంకలో అడుగు పెట్టింది. రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లీతో సహా క్రికెటర్లంతా ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక బస్సులో తమకు కేటాయించిన హోటల్ కు చేరుకున్నారు. ఇదిలా ఉంటే.. ఈ టోర్నీలో భాగంగా దాయాదుల మధ్య మూడు మ్యాచుల్లో పోరు జరగనుండటం ఆసక్తికరంగా మారింది.

ఆట ఏదైనా భారత్ - పాకిస్థాన్ మధ్య పోరు అంటే ప్రత్యేక ఆసక్తి నెలకొంటుంది. అందునా క్రికెట్ మ్యాచ్ లో ఇరు దేశాల జట్ల మధ్య మ్యాచ్ ను ప్రపంచ క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే.. గడిచిన నాలుగేళ్లుగా ఈ రెండు జట్ల మధ్య పోరు జరిగింది లేదు. గత వన్డే ప్రపంచ కప్ సందర్భంగా దాయాది జట్ల మధ్య పోరు జరగ్గా.. ఆ తర్వాత ఆడే అవకాశం దక్కలేదు. టీ 20ల్లో కూడా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగి దాదాపు పది నెలలకు పైనే కావొస్తోంది.

ఇలాంటి వేళ.. ఆసియా కప్ లో ఈ రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్ లు జరుగుతాయన్న మాట క్రికెట్ అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. అయితే.. ఈ ఉత్సాహం మీద వరుణుడు వాన పోసే ప్రమాదం పొంచి ఉందంటున్నారు. కాండీలో శనివారం దాయాది పోరు జరగాల్సి ఉంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. ఈ మ్యాచ్ కు వరుణుడు అడ్డంకిగా నిలుస్తారన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

శనివారం వర్షం పడే అవకాశం పెద్ద ఎత్తున ఉందని లెక్కలు వేస్తున్న అధికారులు.. వాతావరణంలో తేమ 84 శాతం ఉందన్నారు. వాతావరణ శాఖ అధికారుల అంచనాలకు తగ్గట్లే వానదేవుడు తన సత్తా చాటితే.. ఆసియా టోర్నీ మీద ఉన్న ఆసక్తి మొత్తం వర్షంపాలు కావటం ఖాయమంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.