Begin typing your search above and press return to search.

భారత్ - పాక్ మ్యాచ్.. పిచ్.. ఇషాన్ కూర్పు.. వానే మెయిన్ విలన్

ఆస్ట్రేలియాతో ప్రపంచ కప్ ఫైనల్స్ ఆడినా.. ఇంగ్లండ్ తో బజ్ బాల్ తరహా దూకుడుతో టెస్టు మ్యాచ్ ఆడినా రాని మజా టీమిండియా - పాకిస్థాన్ లీగ్ మ్యాచ్ కు వస్తుంది.

By:  Tupaki Desk   |   2 Sep 2023 7:56 AM GMT
భారత్ - పాక్ మ్యాచ్.. పిచ్.. ఇషాన్ కూర్పు.. వానే మెయిన్ విలన్
X

ఆస్ట్రేలియాతో ప్రపంచ కప్ ఫైనల్స్ ఆడినా.. ఇంగ్లండ్ తో బజ్ బాల్ తరహా దూకుడుతో టెస్టు మ్యాచ్ ఆడినా రాని మజా టీమిండియా –పాకిస్థాన్ లీగ్ మ్యాచ్ కు వస్తుంది. అంతెందుకు.. ఆసియా కప్ వంటి సాధారణ టోర్నీల్లో తలపడినా దాయాదుల మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతాయి. వాస్తవానికి రెండు జట్లు వన్డేల్లో తలపడి నాలుగేళ్లు దాటిపోయింది. 2019 ప్రపంచ కప్ తర్వాత మళ్లీ ఈ ఫార్మాట్ లో ఇరు జట్లూ ముఖాముఖి ఎదురపడలేదు. అయితే, ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ లో మాత్రం రెండు లేదా మూడుసార్లు తలపడే చాన్సుంది.

అన్నీ బాగున్నా.. వానే ముంచుతుందా?

టీమిండియా బ్యాటింగ్ పాకిస్థాన్ బౌలింగ్ మధ్య సమరంగా భావిస్తున్న ఆసియా కప్ మ్యాచ్ మరికొద్ది సేపట్లో జరగాల్సి ఉంది. అయితే, మ్యాచ్ జరిగే క్యాండీలో వాన ముప్పు ఎక్కువగా ఉంది. శనివారం 90 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం పేర్కొంది. వాస్తవానికి ద్వీప దేశమైన శ్రీలంకలో ఇది వర్షాలు అధికంగా కురిసే సమయం. అందుకునే ఈ సమయంలో టోర్నీలు నిర్వహించరు. అయితే, ఇది ఆ దేశానికి అనుకోకుండా దక్కిన ఆతిథ్యం కాబట్టి లంకను తప్పుపట్టేందుకు ఏమీలేదు.

ఇషాన్.. గిల్ ఇన్నింగ్స్ తెరిచేదెవరు?

సరిగ్గా నెల రోజుల్లో భారత్ లో వన్డే ప్రపంచ కప్ జరగనుంది. దీనికి సన్నాహకంగా ఆసియా కప్ ను భావించవచ్చు. అంతేకాదు.. మిగతా ఏ దేశాలకూ దక్కని అవకాశం ఉప ఖండంలోని దేశాలకు దక్కిందని భావించాలి. ఎందుకంటే ఆసియా కప్ వన్డే ఫార్మాట్లో జరుగుతోంది. అయితే, ఆస్ట్రేలియా,ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ వంటి పెద్ద జట్లు ఇప్పుడు టి20 సిరీస్ లు ఆడుతున్నాయి. వాటికి లేని మ్యాచ్ ప్రాక్టీస్ మనకు దక్కుతోంది. కాగా శనివారం నాటి మ్యాచ్ లో టీమిండియా తరఫున ఓపెనింగ్ దిగేది ఎవరు? అనేది సందిగ్ధంగా మారింది. కెప్టెన్ రోహిత్ శర్మకు తోడుగా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ఇషాన్ కిషన్ ను పంపాలా? లేక శుబ్ మన్ గిల్ నే ఆడించాలా? అన్నది తేల్చుకోవాల్సి ఉంది. గిల్, ఇషాన్ ఇద్దరినీ ఓపెనర్లుగా పంపి రోహిత్ ను మిడిలార్డర్ లో ఆడించాలన్న ప్రతిపాదన కూడా ఉంది. కాగా,రోహిత్ గైర్హాజరీలో వెస్టిండీస్ తో సిరీస్ లో ఇషాన్ వరుసగా మూడు హాఫ్ సెంచరీలు కొట్టాడు. గిల్ మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. ఇషాన్ బంగ్లాదేశ్ పై డబుల్‌ సెంచరీ కూడా నమోదు చేశాడు. కాగా, అతడు ఓపెనింగ్ కే బాగా సరిపోతున్నాడు. మిడిలార్డర్ లో రాణించడం లేదు.

బ్యాటింగ్ ఆర్డర్ పూర్తిగా మారుతుందా?

టీమిండియా సంధి దశకు దగ్గరగా ఉంది. కోహ్లి, రోహిత్ వయసు పైబడింది. వీరికి బ్యాకప్ గా గిల్, కిషన్, జైశ్వాల్ వంటి కుర్రాళ్లు వచ్చారు. ఇప్పటికే టి20 జట్టుకు దూరమైన రోహిత్, కోహ్లి వన్డే ప్రపంచ కప్ తర్వాత రోహిత్, కోహ్లి వన్డేలనూ తగ్గించుకునే చాన్సుంది. కాబట్టి ఆసియా కప్ లోనూ బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు చూడొచ్చు. గిల్ కిషన్ ఓపెనర్లుగా, వన్ డౌన్ లో రోహిత్ లేదా కోహ్లి తర్వాత అయ్యర్ రావొచ్చు. అదీ కాదంటే రోహిత్ నేరుగా నంబర్ 5లో దిగినా ఆశ్చర్యం లేదు. మొత్తానికి ఆసియా కప్ లో టీమిండియాలో కొంత మార్పును చూడొచ్చు.