Begin typing your search above and press return to search.

టి20 వరల్డ్ కప్.. మళ్లీ భారత్-పాక్ హై వోల్టేజీ మ్యాచ్.. ఇలా జరిగితేనే

టి20 ప్రపంచ కప్ లో తొలిసారి ఆడుతున్న అమెరికా.. మాజీ చాంపియన్ పాకిస్థాన్ ను మట్టికరిపించింది

By:  Tupaki Desk   |   11 Jun 2024 11:30 AM GMT
టి20 వరల్డ్ కప్.. మళ్లీ భారత్-పాక్ హై వోల్టేజీ మ్యాచ్.. ఇలా జరిగితేనే
X

భారత్-పాక్ మధ్య భౌగోళికంగా పెద్దగా దూరం లేకపోవచ్చు కానీ.. క్రీడా సంబంధాలు మాత్రం చాలా దూరం.. క్రికెట్ లో మేటి జట్లయిన ఈ రెండూ నేరుగా తలపడడం చాలా ఏళ్ల కిందటే ఆగిపోయింది. ఐసీసీ టోర్నీల్లో తప్ప ఇరు జట్లూ ముఖాముఖి ఆడడం లేదు. ఇలాంటి సమయంలో.. ప్రపంచ కప్ లలో మాత్రమే దాయాదుల హైవోల్టేజీ మ్యాచ్ చూడగలం.

ఎక్కడ జరిగినా.. ఉత్కంఠే

టి20 ప్రపంచ కప్ లో తొలిసారి ఆడుతున్న అమెరికా.. మాజీ చాంపియన్ పాకిస్థాన్ ను మట్టికరిపించింది. కానీ, రెండు రోజులకే జరిగిన మ్యాచ్ లో టీమిండియాను పాకిస్థాన్ దాదాపు ఓడించనంత పనిచేసింది. పొరుగు దేశంతో మ్యాచ్ అంటే.. ఎలా ఉంటుందో మరోసారి నిరూపితమైంది. గతంలో ఎన్నోసార్లు భారత్-పాక్ ఫామ్ ను మించి తలపడ్డాయి.

ఈసారి మళ్లీ తలపడతాయా?

ఆతిథ్య అమెరికా, దాయాది భారత్ తో మ్యాచ్ లలో ఓడిపోయిన పాక్.. ఈ టోర్నీ తదుపరి దశ సూపర్-8కు చేరడం కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కానీ, అభిమానులు మాత్రం ఈ టోర్నీలో భారత్-పాక్ మధ్య మరో మ్యాచ్ ను చూడాలని కోరుకుంటున్నారు. ఇది సాధ్యం కావాలంటే పాక్ కు కాలం కలిసిరావాలి.

ఈ టోర్నీలో గ్రూప్ దశ తర్వాత 8 జట్లు రెండో రౌండ్‌ కు వెళ్తాయి. ప్రతి గ్రూప్ నుంచి రెండు జట్లు ముందుకెళ్తే, మిగిలిన మూడు జట్లు ఇంటికెళ్తాయి. ఈ ప్రకారం.., కెనడా, ఐర్లాండ్‌ తో మ్యాచ్‌ లలో పాక్ భారీ విజయాలు సాధించాలి. దీంతో రన్ రేట్ మెరుగవుతుంది. భారత్, ఐర్లాండ్ లు అమెరికాను ఓడించాలి. అమెరికా కంటే పాకిస్థాన్ రన్ రేట్ మెరుగ్గా ఉంటే సూపర్-8లో ప్రవేశం లభిస్తుంది.

తలపడితే సెమీస్ లోనే?

సూపర్ 8లో 8 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఎ1, బి2, సి1, డి2లను సూపర్ 8లోని మొదటి గ్రూపులో, ఎ2, బి1, సి2, డి1లను గ్రూప్ 2లో ఉంచారు. భారత్‌-పాక్ మధ్య మ్యాచ్‌ సెమీఫైనల్‌ లోనే సాధ్యం కావొచ్చు. భారత్ సూపర్ 8 దశను గ్రూప్‌ లో టాప్ స్థానంలో ముగిస్తే, పాక్ రెండో స్థానంలో నిలవాల్సి ఉంటుంది.