Begin typing your search above and press return to search.

ఆసీస్ తో సిరీస్.. టీమిండియా లో మార్పులే మార్పులు

ప్రపంచ కప్‌ ముందు ఈ మూడు వన్డేల సిరీస్‌ ఇరుజట్లకు మంచి ప్రాక్టీస్‌ అనడంలో సందేహం లేదు

By:  Tupaki Desk   |   19 Sep 2023 2:30 PM GMT
ఆసీస్ తో సిరీస్.. టీమిండియా లో మార్పులే మార్పులు
X

ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచ కప్ ముంగిట టీమిండియా మరో వన్డే సిరీస్ ఆడనుంది. ఆసియా కప్ లో అద్భుత విజయం సాధించిన రోహిత్ సేన.. గట్టి జట్టయిన ఆసీస్ ను ఎదుర్కొనడం ప్రపంచ కప్ ముంగిట మంచి పరిణామమే. ఎందుకంటే కంగారూలు సైతం పూర్తిస్థాయి బలగంతో భారత్ తో వన్డే సిరీస్ బరిలో దిగుతున్నారు.

అశ్విన్ వచ్చాడు..

ఆసీస్ తో భారత్ ఈ నెల 22 నుంచి మూడు వన్డేల సిరీస్ లో తలపడనుంది. ప్రపంచ కప్‌ ముందు ఈ మూడు వన్డేల సిరీస్‌ ఇరుజట్లకు మంచి ప్రాక్టీస్‌ అనడంలో సందేహం లేదు. ఆ నెల22న మొహాలీలో తొలి వన్డే, 24న ఇందౌర్‌ లో రెండో వన్డే, 27న రాజ్‌ కోట్‌ లో మూడో వన్డే జరుగుతాయి. కాగా, సోమవారం ఆసీస్ తో సిరీస్ కు టీమిండియాను ప్రకటించారు. బంగ్లాదేశ్ తో సూపర్ 4 మ్యాచ్ లో గాయపడిన ఆల్‌ రౌండర్‌ అక్షర్ పటేల్‌ ను తొలి రెండు వన్డేలకు పక్కనపెట్టారు. అతడి స్థానంలో సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ ను తీసుకున్నారు. హైదరాబాదీ తిలక్ వర్మకు మరో చాన్సు దక్కింది.

రోహిత్, విరాట్, పాండ్యా లేకుండానే..

కంగారూలతో మొదటి రెండు వన్డేలకు కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ హార్దిక్‌ పాండ్యాకు రెస్ట్ ఇచ్చారు. విశేషం ఏమంటే.. గాయాలతో సతమతం అయి.. ఇటీవల పునరాగమనం చేసిన కేఎల్ రాహుల్ ను ఆసీస్ తో రెండు వన్డేలకు కెప్టెన్ గా ప్రకటించారు. అయితే, మూడో వన్డేకు రోహిత్ కోహ్లీ, పాండ్య అందుబాటులో ఉంటారు.

అశ్విన్ అనుకోకుండానే..

ఇప్పుడు లక్ కాస్త అశ్విన్ పక్షాన ఉన్నట్లు కనిపిస్తోంది. అసలు పరిమిత ఓవర్ల క్రికెట్ ప్రతిపాదనల్లోనే లేని అతడు ఏకంగా ప్రపంచ కప్ జట్టులోకి వచ్చేలా కనిపిస్తున్నాడు. అక్షర్ పటేల్ గాయం అశ్విన్ కు వరంగా మారిందా? అనిపిస్తోంది. అక్షర్ ఆసీస్ తో మూడో వన్డే నాటికి కోలుకుంటే సరి.. లేదంటే ప్రపంచ కప్ నకూ అతడు కష్టమే అనుకోవాలి. అలాంటప్పుడు అశ్విన్ కు బెర్తు దక్కొచ్చు. ఎందుకంటే సొంతగడ్డపై ప్రపంచ కప్ జరుగుతున్నందున ఇక్కడి పిచ్ లు అతడికి కొట్టిన పిండి. ఎలాగూ జట్టులో ఆఫ్ స్పిన్నర్ లేడు కాబట్టి అది అశ్విన్ కు చాన్స్ గా మారనుంది.

కొసమెరుపు : ఇటు ఆసీస్ తో సిరీస్ జరుగుతుండగానే అటు ఆసియా క్రీడలు జరగనున్నాయి. ఆసియా క్రీడలు ఈ నెల 23 నుంచి 28 వరకు సాగుతాయి. సుదీర్ఘ విరామం తర్వాత ఈసారి క్రికెట్ ను సైతం చేర్చారు. కాగా, భారత జట్టుకు ఆసియా క్రీడల్లో రుతురాజ్ గైక్వాడ్ సారథ్యం వహిస్తాడు. ప్రధాన జట్టంతా ప్రపంచ కప్ లో ఉంటుంది కాబట్టి రుతురాజ్ సారథ్యంలో ద్వితీయ శ్రేణి జట్టును పంపుతున్నారు. ఇదే రుతురాజ్.. ఆసీస్ తో తొలి రెండు వన్డేలకు ఎంపికవడం గమనార్హం.