Begin typing your search above and press return to search.

టీమిండియా తదుపరి హెడ్ కోచ్ మన హైదరాబాదీ దిగ్గజమేనా?

వన్డే ప్రపంచ కప్ ముగిసింది. భారత్ ఫైనల్లో ఓడింది. ఇది మినహా మన జట్టు ఆటకు వంక పెట్టేందుకు లేదు.

By:  Tupaki Desk   |   22 Nov 2023 11:44 AM GMT
టీమిండియా తదుపరి హెడ్ కోచ్ మన హైదరాబాదీ దిగ్గజమేనా?
X

వన్డే ప్రపంచ కప్ ముగిసింది. భారత్ ఫైనల్లో ఓడింది. ఇది మినహా మన జట్టు ఆటకు వంక పెట్టేందుకు లేదు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ మరొక ఏడాదైనా కొనసాగుతాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మరో రెండేళ్లుంటాడు. వచ్చే ప్రపంచ కప్ నాటికి మాత్రం కొత్త నాయకత్వం కొత్త జట్టుతో బరిలో దిగాల్సి ఉంటుంది. అయితే నాలుగేళ్ల సమయం ఉంది కాబట్టి ఈ వ్యవధిలో ఎవరైనా దూసుకొస్తారేమో చూడాలి. ఆటగాళ్ల పరంగా మరో ముగ్గురు నలుగురైనా కొత్తవారు వచ్చే చాన్సుంది. కానీ, హెడ్ కోచ్ ఎవరనేది మాత్రం తెలియాల్సి ఉంది.

ద్రవిడ్ ను కొనసాగిస్తారా?

భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాట్స్ మన్ అయిన రాహుల్ ద్రవిడ్ కెరీర్ వన్డే ప్రపంచ కప్ లేకుండానే ముగిసింది. కోచ్ గా అయినా దానిని సాధిద్దామంటే ఫైనల్ పరాజయం దెబ్బకొట్టింది. ఇక ఆయన కాంట్రాక్టు ఈ ప్రపంచ కప్ తోనే ముగిసింది. ఆసియా కప్ సాధించినపెట్టినా, టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ చేర్చినా అదంతా గతం. ప్రపంచ కప్ అందలేదు కాబట్టి ద్రవిడ్ ను తప్పిస్తారని కూడా చెప్పలేం.. కాకపోతే ఆయనే స్వచ్ఛదంగా వైదొలగ అవకాశం ఉంది. మరోవైపు ద్రవిడ్ ను వచ్చే ఏడాది టి20 ప్రపంచ కప్ వరకు కొనసాగిస్తారని చెబుతున్నారు. కుర్రాళ్లకు మార్గనిర్దేశం చేసేందుకు ద్రవిడ్ సేవలను వాడుకుంటారని అంచనా

మరి ఆ తర్వాత..?

టీమిండియా హెడ్ కోచ్ గా ద్రవిడ్ ను పట్టుబట్టి మరీ ఎంపిక చేశాడు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ. అప్పటికి ద్రవిడ్ ఇండియా ఎ జట్టు కోచ్. అంతకుముందు అండర్ 19 కోచ్. జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్ బాధ్యతలనూ నిర్వర్తించాడు. ఇప్పుడు ద్రవిడ్ టీమిండియా హెడ్ కోచ్ గా తప్పుకొన్నా, వచ్చే ఏడాది తప్పుకొన్నా.. ఆ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరనే ప్రశ్నలు వస్తున్నాయి. గతంలోలా విదేశీ కోచ్ ను తీసుకొచ్చే పరిస్థితి లేదు. అందుకని టీమిండియా తదుపరి హెడ్ కోచ్ కు తగిన వ్యక్తి హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్ పేరే వినిపిస్తోంది. ఇండియా ఎ, అండర్ 19, ఎన్సీఏ ఈ మూడు బాధ్యతలనూ అతడు నిర్వర్తించాడు. ప్రపంచ కప్ ముంగిట ఐర్లాండ్ టూర్ కూ కోచ్ గా ఉన్నాడు. ఇప్పుడు గురువారం నుంచి ఆస్ట్రేలియాతో అయిదు టీ20ల సిరీస్‌ లో తలపడే భారత జట్టుకు లక్ష్మణ్‌ తాత్కాలిక కోచ్‌ గా వ్యవహరించనున్నాడు. ద్రవిడ్ కొనసాగేది లేనిది స్పష్టత రాకున్నా.. లక్ష్మణ్ ను ఆ బాధ్యతల్లో తాత్కాలికంగా నియమించారు. చూస్తుంటే.. మున్ముందు అతడే టీమిండియా హెడ్ కోచ్ అవుతాడు.