Begin typing your search above and press return to search.

ఈ ఇద్దరు భారతీయ మహిళల్లో ఎవరో తొలి చదరంగ ‘రాణి’?

కోనేరు హంపి.. భారత చెస్‌ చరిత్రలో చెరిగిపోని పేరు.. తెలుగువారు అందరికీ గర్వకారణమైన అమ్మాయి.. దాదాపు 25 ఏళ్లుగా చదరంగంలో తనదైన ముద్ర వేస్తున్న గ్రాండ్‌ మాస్టర్‌.

By:  Tupaki Desk   |   25 July 2025 9:20 AM IST
ఈ ఇద్దరు భారతీయ మహిళల్లో ఎవరో తొలి చదరంగ ‘రాణి’?
X

కోనేరు హంపి.. భారత చెస్‌ చరిత్రలో చెరిగిపోని పేరు.. తెలుగువారు అందరికీ గర్వకారణమైన అమ్మాయి.. దాదాపు 25 ఏళ్లుగా చదరంగంలో తనదైన ముద్ర వేస్తున్న గ్రాండ్‌ మాస్టర్‌. అయితే, ఫామ్‌ తగ్గడంతోనో, పోటీ పెరగడంతోనో ఇటీవల చెస్‌లో ఒకప్పటి స్థాయిలో మెరుపులు మెరిపించలేకపోతోంది ఈ అచ్చ తెలుగు అమ్మాయి. ఇప్పుడు మాత్రం హంపి మళ్లీ దూసుకొచ్చింది. ఫిడే మహిళల చెస్‌ ప్రపంచకప్‌లో సూపర్‌ ఫామ్‌తో అదరగొడుతోంది. ఈ క్రమంలో ప్రపంచ కప్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది.

అయితే, హంపి ప్రపంచ కప్‌ ఫైనల్లో తలపడేది ఎవరితోనో కాదు.. భారత్‌కే చెందిన దివ్య దేశ్‌ముఖ్‌తో. ఫిడే మహిళల ప్రపంచ చెస్‌లో ఫైనల్‌ చేరిన తొలి భారత ప్లేయర్ గా ఈమె రికార్డు సృష్టించడం విశేషం. ఇంతకూ దివ్య వయసు 19ఏళ్లే. సూపర్‌ ఫామ్‌లో ఉన్న ఆమె సెమీస్‌లో 1.5-0.5తో చైనా ప్లేయర్‌, మాచీ ప్రపంచ చాంపియన్‌ తాన్‌ జోంగ్యిని మట్టికరిపించింది. ఫైనల్‌ చేరి అందరినీ ఒ‍క్కసారి హర్ట్‌ ఎటాక్‌కు గురయ్యేలా చేశానంటూ ఇన్‌స్టాలో దివ్య రాసుకొచ్చింది. చాలా తేలిగ్గా నెగ్గాల్సిన మ్యాచ్‌లో కష్టపడాల్సి వచ్చిందని వివరించింది.

ఇక దివ్య విజయం తర్వాత కాసేపటికి హంపి సెమీస్‌లో టైబ్రేక్‌లో చైనా ప్లేయర్‌ను ఓడించింది. ఆ దేశానికి చెందిన లీ టింగ్‌జీపై 5-3 పాయింట్ల తేడాతో నెగ్గింది. తాజా ఘన విజయాలతో హంపి, దివ్య ఇద్దరూ వచ్చే ఏడాది జరిగే మహిళా క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నమెంట్‌కు అర్హత సాధించారు.

దివ్య.. తొలి గ్రాండ్‌మాస్టర్‌ నార్మ్‌ను కూడా సాధించింది. ఇక హంపి కూడా ఫిడే మహిళల చెస్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌ చేరడం తొలిసారి. ఈ క్రమంలో ఇద్దరు భారత మహిళల మధ్య ప్రపంచ చాంపియన్‌ కిరీటం కోసం పోరాటం జరగనుంది. ఎవరు గెలిచినా భారత్ ఖాతాలో తొలి ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్ చేరనుండడం విశేషం.