Begin typing your search above and press return to search.

ఒకే టైమ్‌లో ఇంగ్లండ్‌లో నాలుగు టీమ్‌ ఇండియాలు... విచిత్రమే!

మీరు చదివింది నిజమే.. ఆ మైదానాలు ఇంగ్లండ్‌లోవి..అక్కడ ఆడుతున్న జట్లు ఇండియావి.

By:  Tupaki Desk   |   1 July 2025 9:15 AM IST
ఒకే టైమ్‌లో ఇంగ్లండ్‌లో నాలుగు టీమ్‌ ఇండియాలు... విచిత్రమే!
X

లీడ్స్‌లో ఒక టీమ్‌ ఇండియా..లార్డ్‌‍్సలో మరో టీమ్‌ ఇండియా...నార్తాంప్టన్‌లో ఒక టీమ్‌ ఇండియా.. బ్రిస్టల్‌లో మరో టీమ్‌ ఇండియా...! ఇదేంటి.. ఒకటే జట్టు వేర్వేరు వేదికల్లో ఎలా ఉంది..? అదికూడా విదేశంలో అనుకుంటున్నారా..? మీరు చదివింది నిజమే.. ఆ మైదానాలు ఇంగ్లండ్‌లోవి..అక్కడ ఆడుతున్న జట్లు ఇండియావి. ఇంగ్లండ్‌లో సీనియర్‌ పురుషుల జట్టు ప్రస్తుతం ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడుతోంది. ఇటీవల జరిగిన తొలి టెస్టులో చివరి నిమిషంలో ఓటమి పాలైంది. బుధవారం నుంచి రెండో టెస్టు మ్యాచ్‌ జరగనుంది. ఈ సిరీస్‌తోనే టీమ్‌ ఇండియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) సైకిల్‌ను ప్రారంభించింది. పైగా సీనియర్లు, స్టార్‌ క్రికెటర్లు అయిన రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, రవిచంద్రన్‌ అశ్విన్‌ ముగ్గురూ లేకుండా 15 ఏళ్లలో తొలిసారి ఓ టెస్టు సిరీస్‌లో పాల్గొంటోంది. దీనికి 25 ఏళ్ల యువ బ్యాట్స్‌మన్‌ శుబ్‌మన్‌ గిల్‌ సారథ్యం వహిస్తున్నాడు.

-ఇంగ్లండ్‌ పురుషుల క్రికెట్‌లోనే కాదు.. మహిళల క్రికెట్‌లోనూ బలమైన జట్టు. మంచి టెక్నిక్‌తో ఆడతారు ఆ జట్టు మహిళలు. దూకుడు సరేసరి. అలాంటి ఇంగ్లండ్‌ మహిళలతో భారత మహిళల క్రికెట్‌ జట్టు 5 టి20లు, మూడు వన్డేల సిరీస్‌లో పాల్గొంటోంది. తొలి టి20లో తెలుగమ్మాయి శ్రీచరణి (4/12) ధాటికి ఇంగ్లండ్‌ కుప్పకూలింది. మంగళవారం ఈ రెండు జట్ల మధ్య రెండో టీ20 జరగనుంది.

-అండర్‌ 19 భారత జట్టు కూడా ప్రస్తుతం ఇంగ్లండ్‌లోనే ఉంది. 5 యూత్‌ వన్డేలు, 2 యూత్‌ టెస్టుల సిరీస్‌ ఆడుతోంది. తొలి యూత్‌ వన్డేను నెగ్గి.. సోమవారం రెండో మ్యాచ్‌లో త్రుటిలో ఓడింది. ఈ జట్టుకు కెప్టెన్‌ ఎవరో కాదు.. ఈ ఏడాది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో ఆకట్టుకున్న 17 ఏళ్ల ముంబై కుర్రాడు ఆయుష్‌ మాత్రె. అంతేకాదు.. ఈ జట్టుకు ఓపెనర్‌ మరో యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ. 14 ఏళ్ల వైభవ్‌.. ఐపీఎల్‌లో సెంచరీ కొట్టిన అత్యంత చిన్న వయస్కుడిగా రికార్డులకు ఎక్కిన సంగతి తెలిసిందే.

-ఇక నాలుగో జట్టు ఇండియా-ఎ. అయితే, ఈ జట్టు టూర్‌ ఇప్పటికే ముగిసింది. రెండు అనధికార టెస్టుల్లో ఇంగ్లండ్‌ లయన్స్‌ (ఇంగ్లండ్‌-ఎ)తో ఇండియా-ఎ తలపడింది. సీనియర్‌ జట్టులోని ఆటగాళ్లను ఇండియా-ఎ తరఫున ఇంగ్లండ్‌ పంపించారు. ఈ సిరీస్‌ జూన్‌ 10తో ముగిసింది. ఆ వెంటనే జట్టులోని ఆటగాళ్లు సీనియర్స్‌తో కలిశారు.

-అండర్‌-19 జట్టు జూలై 23, మహిళల జట్టు జూలై 22 వరకు మ్యాచ్‌లు ఆడనున్నాయి. పురుషుల సీనియర్‌ జట్టు టూర్‌ ఆగస్టు 4తో ముగుస్తుంది. ఏది ఏమైనా భవిష్యత్‌ భారత క్రికెట్‌ ఒకే సమయంలో ఇంగ్లండ్‌లో ఉండడం విశేషమే కదా..?