Begin typing your search above and press return to search.

జూన్ 20: ఆ ముగ్గురు క్రికెట్ దిగ్గజాలకు ప్రత్యేకం..కొత్త కుర్రాడికీ?

ఆ ముగ్గురు భారత దిగ్గజ క్రికెటర్లు.. ముగ్గురూ కెప్టెన్లుగా పనిచేశారు.. ముగ్గురూ ఏదో ఒక ఫార్మాట్ లో పదివేలకు పైగా పరుగులు చేశారు..

By:  Tupaki Desk   |   20 Jun 2025 5:35 PM IST
జూన్ 20: ఆ ముగ్గురు క్రికెట్ దిగ్గజాలకు ప్రత్యేకం..కొత్త కుర్రాడికీ?
X

ఆ ముగ్గురు భారత దిగ్గజ క్రికెటర్లు.. ముగ్గురూ కెప్టెన్లుగా పనిచేశారు.. ముగ్గురూ ఏదో ఒక ఫార్మాట్ లో పదివేలకు పైగా పరుగులు చేశారు.. ముగ్గురూ ఒకే రోజు అంతర్జాతీయ టెస్టు క్రికెట్ లో అడుగుపెట్టారు.. అది కూడా జూన్ 20నే కావడం విశేషం. మరి ఇదే రోజు టీమ్ ఇండియా తరఫున మరో క్రికెటర్ కూడా టెస్టు ఎంట్రీ ఇచ్చాడు. మరి ఆ దిగ్గజాల స్థాయిలోనే ఇతడూ ఎదుగుతాడని అభిమానులు భావిస్తున్నారు.

అది 1996.. అప్పటికి టి20లు పుట్టలేదు. టీమ్ ఇండియా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఆ సమయంలో ఇద్దరు కుర్రాళ్లు టెస్టు జట్టులోకి వచ్చారు. జూన్ 20న ఇంగ్లండ్ తో ప్రఖ్యాత లార్డ్స్ లో తొలి టెస్టు ఆడారు. వారే కోల్ కతా ప్రిన్స్ సౌరభ్ గంగూలీ, కర్ణాటక ది గ్రేట్ వాల్ రాహుల్ ద్రవిడ్. విచిత్రం ఏమంటే ఈ మ్యాచ్ లో వన్ డౌన్ లో వచ్చిన సౌరభ్ గంగూలీ 131 పరుగులు చేశాడు. తొలి టెస్టులోనే, అదీ లార్డ్స్ లో సెంచరీ కొట్టాడు. ఏడో స్థానంలో దిగిన రాహుల్ ద్రవిడ్ 95 పరుగుల వద్ద ఔటై సెంచరీని చేజార్చుకున్నాడు. ఆ తర్వాతి కాలంలో వీరిద్దరూ తిరుగులేని క్రికెటర్లు అయ్యారు. కెప్టెన్లుగానూ వ్యహరించారు. వన్డేల్లో 10 వేల పరుగులు సాధించారు. టెస్టుల్లో ద్రవిడ్ 13,288 పరుగులతో దిగ్గజంగా ఎదిగాడు. గంగూలీ 7,212 పరుగులు సాధించాడు.

జూన్ 20నే అంతర్జాతీయ టెస్టు క్రికెట్ లోకి వచ్చాడు మరో దిగ్గజ విరాట్ కోహ్లి. వన్డేల్లోకి 2008లోనే ఎంట్రీ ఇచ్చినా.. టెస్టుల్లోకి రావడానికి మూడేళ్ల పట్టింది. 2011లో జరిగిన వెస్టిండీస్ టూర్ లో తొలి టెస్టు ఆడాడు. తొలి ఇన్నింగ్స్ లో 4, రెండో ఇన్నింగ్స్ లో 15 పరుగులు మాత్రమే చేశాడు. కానీ, ఆ తర్వాత గొప్ప బ్యాట్స్ మన్ గా ఎదిగాడు. టెస్టుల్లో 9,230 పరుగులు సాధించాడు. ఇటీవలే రిటైర్మెంట్ ఇచ్చాడు.

పైన చెప్పుకొన్న ముగ్గురిలాగానే జూన్ 20న అంతర్జాతీయ టెస్టు క్రికెట్ లోకి అడుగుపెట్టాడు తమిళనాడుకు చెందిన సాయి సుదర్శన్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అదరగొట్టిన ఎడమ చేతివాటం బ్యాటర్ సాయి.. ఇంగ్లండ్ పై టెస్టు అరంగేట్రం చేశాడు. మంచి టెక్నిక్, ఓపికగా ఆడే సాయి సుదర్శన్.. భవిష్యత్ లో గొప్ప బ్యాటర్ గా ఎదుగుతాడని భావిస్తున్నారు. అదీ.. జూన్ 20కి.. నలుగురు టీమ్ ఇండియా క్రికెటర్లకు ఉన్న సంబంధం.