Begin typing your search above and press return to search.

టీమిండియా సీనియర్ల ఓటమికి జూనియర్లు బదులు తీర్చుకుంటారా?

భారత్ వేదికగా ఇటీవల వన్డే ప్రపంచ కప్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా అజేయంగా ఫైనల్ చేరింది.

By:  Tupaki Desk   |   9 Feb 2024 1:30 PM GMT
టీమిండియా సీనియర్ల ఓటమికి జూనియర్లు బదులు తీర్చుకుంటారా?
X

సీనియర్లను ఓడించినవారే జూనియర్లకూ తగిలితే.. అది కూడా కేవలం మూడు నెలల్లోనే ఎదురైతే.. అందులోనూ ఇద్దరూ మంచి జోరుమీదుంటే.. కసికసిగా ఆడుతూంటే.. ఇప్పుడలాంటి సందర్భమే.. అండర్19 ప్రపంచ కప్ లో భారత్ కు వచ్చింది. దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో ఉదయ్ సహారన్ సారథ్యంలోని భారత జట్టు అద్భుత ప్రతిభతో ఫైనల్ కు చేరింది. వచ్చే ఆదివారం జరగనున్న తుది సమరంలో ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది.

అప్పుడు చేజారింది..

భారత్ వేదికగా ఇటీవల వన్డే ప్రపంచ కప్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా అజేయంగా ఫైనల్ చేరింది. కానీ, నవంబరు 19న జరిగిన తుది సమరంలో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. వాస్తవానికి ఈ టోర్నీలో ఆసీస్ వరుసగా తొలి రెండు మ్యాచ్ లు ఆడింది. మధ్యలో ఓ దశలో సెమీస్ కు చేరడం కష్టమే అనిపించింది. అలాంటిది ఏకంగా ఫైనల్లో భారత్ ను ఓడించి కప్ కొట్టేసింది. ఈ పరిణామంతో భారత అభిమానులు తీవ్ర నిరాశ చెందారు.

మరిప్పుడు?

దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్ -19 ప్రపంచ కప్ లో ఉదయ్ సారథ్యంలోని భారత్ ఫైనల్ కు వచ్చింది. ఆదివారం ఫైనల్ లో ఆస్ట్రేలియాతో బెనోనిలోని విల్లోమూర్ పార్క్ మైదానంలో తలపడనుంది. ఐసీసీ టోర్నీల్లో భారత్, ఆస్ట్రేలియా ఫైనల్ లో తలపడటం ఆర్నెళ్లలో ఇది మూడోసారి. పురుషుల ప్రపంచ కప్ 2023లో, అంతకుముందు ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ లో ఇరు జట్లు ఢీకొన్నాయి. కాగా, భారత్ నుంచి కెప్టెన్ ఉదయ్ తో పాటు ముషీర్ ఖాన్, సచిన్ దాస్, సౌమీ పాండే వంటి ఆటగాళ్లు అద్బుత ఫామ్ లో ఉన్నారు.

చరిత్ర మనవైపే...

అండర్ -19 ప్రపంచ కప్ ఫైనల్ లో భారత్, ఆస్ట్రేలియా ఇప్పటివరకు రెండుసార్లు తలపడ్డాయి. ఆ సందర్భాల్లో మన జట్టే గెలవడం విశేషం. కాగా, ఉన్ముక్త్ చంద్ సారథ్యంలో 2012లో, ప్రథ్వీషా కెప్టెన్సీలో 2018లో ఇరు జట్లు ప్రపంచ కప్ ఫైనల్స్ లో పోటీ పడ్డాయి. ఇక కుర్ర టీమిండియా అండర్ -19 వరల్డ్ కప్ లో మొత్తం ఎనిమిది సార్లు ఫైనల్స్ కు చేరింది. ఐదు సార్లు విజేతగా నిలిచింది. 2000 శ్రీలంకపై, 2008 దక్షిణాఫ్రికాపై, 2012, 18లో ఆస్ట్రేలియాపై, 2022లో ఇంగ్లాండ్ మీద నెగ్గింది. ప్రస్తుతం తొమ్మిదోసారి ఫైనల్స్ కు చేరింది. కాగా, ఆస్ట్రేలియా జట్టు మూడుసార్లు అండర్ -19 వరల్డ్ కప్ సాధించింది. అది 1998, 2002, 2010లో కావడం గమనార్హం. రెండు సార్లు ఓడిపోయింది. ఈఅ రెండు సార్లుకూడా కంగూరూలను కొట్టింది భారత్ జట్టే కావడం విశేషం. అందుకనే అభిమానులంతా కుర్ర భారత్ ను జయహో అని కీర్తిస్తున్నారు.