Begin typing your search above and press return to search.

టీమిండియా చరిత్రలో తొలిసారి!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తర్వాత భారత క్రికెట్ లో బలం ఊహించనంతగా పెరిగింది.

By:  Tupaki Desk   |   1 Dec 2023 7:51 AM GMT
టీమిండియా చరిత్రలో తొలిసారి!
X

బహుశా గతంలో ఎన్నడూ ఊహించి కూడా ఉండరు.. కనీసం అంచనా కూడా వేసి ఉండరు.. టీమిండియాకు మూడు ఫార్మాట్లలో ముగ్గురు కెప్టెన్లు ఉంటారని.. అది కూడా విదేశీ టూర్ కు ముగ్గురు కెప్టెన్లతో వెళ్తారని భావించి కూడా ఉండరు. కానీ, అనూహ్యంగా సాధ్యమైంది. అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ తొలి విదేశీ టూర్ ఎంపికలోనే తన ముద్ర చూపింది. దక్షిణాఫ్రికా వంటి కీలక పర్యటనకు టి20లు, వన్డేలు, టెస్టులకు ముగ్గురు కెప్టెన్లను నియమించింది.

అందరికీ చోటు.. ఇదేనా ఉద్దేశం..?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తర్వాత భారత క్రికెట్ లో బలం ఊహించనంతగా పెరిగింది. అది ఎంతలా అంటే.. కనీసం మూడు, నాలుగు అంతర్జాతీయ జట్లను తయారు చేయగల సంఖ్యలో ఆటగాళ్లున్నారంటే అతిశయోక్తి కాదేమో..? ఈ మాటను ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు చెప్పారు కూడా. దీనికితగ్గట్లే.. దక్షిణాఫ్రికా పర్యటనకు మూడు ఫార్మాట్లకు మూడు వేర్వేరు

జట్లను ప్రకటించారు. టీ20ల్లో సూర్యకుమార్‌ యాదవ్, వన్డేల్లో కేఎల్‌ రాహుల్‌, టెస్టుల్లో రోహిత్ శర్మ కెప్టెన్సీ వహించనున్నారు. రోహిత్‌.. ఈ పర్యటనలో టి20లు, వన్డేలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. స్టార్ బ్యాటర్ కోహ్లి కూడా టెస్టులు మాత్రమే ఆడనున్నాడు. వన్డేలు, టి20ల నుంచి అతడు విశ్రాంతి కోరాడు. కాగా, ఆల్ రౌండర్ హార్దిక్‌ పాండ్యా గాయం కారణంగా అందుబాటులో లేడు. దీంతో టి20 కెప్టెన్‌ గా సూర్య ఎంపికయ్యాడు. ఇక రోహిత్‌ కు రెస్ట్ ఇచ్చిన నేపథ్యంలో వన్డే కెప్టెన్సీ రాహుల్‌ కు లభించింది.

వన్డేల్లకు స్పెషల్..

దక్షిణాఫ్రికా టూర్ వన్డే సిరీస్ కు ఎంపికైన ఆటగాళ్లలో చాలామంది టెస్టులు లేదా టి20ల్లో లేకపోవడం గమనార్హం. కేవలం ముగ్గురంటే ముగ్గురు.. శ్రేయస్‌ అయ్యర్‌, ముకేశ్‌ కుమార్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ మాత్రమే మూడు జట్లలో ఉన్నారు. కాగా, సఫారీ టూర్ లో టీమిండియా మూడు వన్డేలు, మూడు టి20లు, రెండు టెస్టులు ఆడనుంది. ఈ నెల 10న తొలి టీ20 జరగనుంది. ప్రస్తుతానికి వన్డేలకు ప్రాధాన్యం తక్కువే అయినా.. రాహుల్‌ సారథ్యంలోని వన్డే జట్టు కొత్తగా కనిపిస్తోంది.

ఈ ముగ్గరికీ చోటు.. సంజూపై కరుణ

రంజీల్లో అదరగొడుతున్న రజత్‌ పటీదార్‌, సాయి సుదర్శన్‌, టి20 ఫినిషర్ రింకూ సింగ్‌ లకు వన్డే జట్టులో తొలిసారి చోటుదక్కింది. టెస్టుల్లో లేని కుల్‌దీప్‌ యాదవ్‌ వన్డే, టి20ల్లోకి వచ్చాడు.

సీనియర్ స్పిన్నర్, ప్రపంచ కప్‌లో ఆడలేకపోయిన యుజ్వేంద్ర చాహల్‌ తిరిగి వన్డే జట్టులోకి వచ్చాడు. లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ టి20ల్లో అవకాశం దక్కించుకున్నాడు. అయితే, అనూహ్యంగా ఈ ఫార్మాట్లో అక్షర్‌ పటేల్‌ పై వేటు పడింది. సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టి20 జట్టు వైస్‌ కెప్టెన్‌ గా నియమితుడయ్యాడు. ఆస్ట్రేలియాతో టి20 సిరీస్ కు చోటు దక్కని సంజూ శాంసన్‌ ను దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కు తీసుకున్నారు.