Begin typing your search above and press return to search.

ప్రపంచ కప్ ఫైనల్స్ లో భారత్ మెడకు 'కంగారూ' తోక

ఎప్పుడైతే వెనుకబడ్డాము అని తేలిందో అప్పటినుంచే దిద్దుబాటు మొదలుపెట్టింది. మళ్లీ బలంగా ముందుకొచ్చింది. అయితే, ఇది చివరకు అన్ని జట్ల కంటే భారత్ కే ఎక్కువ చేటు చేస్తోంది.

By:  Tupaki Desk   |   12 Feb 2024 6:04 AM GMT
ప్రపంచ కప్ ఫైనల్స్ లో భారత్ మెడకు కంగారూ తోక
X

నాలుగైదేళ్ల కిందట ఆస్ట్రేలియా పనై పోయిందనిపించింది.. స్టార్ బ్యాటర్లు జట్టుకు దూరమయ్యారు.. జట్టులో ఉన్నవారు ఫామ్ కోల్పోయారు. బౌలింగ్ లో పదును తగ్గింది.. మెరుగైన ఆల్ రౌండర్లూ లేరు.. మొత్తంగా జట్టులో స్పూర్తి లోపించింది.. అందుకే వరుసగా ఓటముల పాలైంది.. కానీ, ఇలాగే ఉంటే అది ఆస్ట్రేలియా ఎందుకు అవుతుంది..? ఎప్పుడైతే వెనుకబడ్డాము అని తేలిందో అప్పటినుంచే దిద్దుబాటు మొదలుపెట్టింది. మళ్లీ బలంగా ముందుకొచ్చింది. అయితే, ఇది చివరకు అన్ని జట్ల కంటే భారత్ కే ఎక్కువ చేటు చేస్తోంది.

మనకు మూడు కప్ లు మిస్

క్రికెట్ లో భారత్ ప్రపంచ విజేతగా నిలిచి 13 ఏళ్లు అవుతోంది. 2013లో చాంపియన్స్ ట్రోఫీని పరిగణనలోకి తీసుకుంటే మాత్రం 11 ఏళ్లు. ధోనీ మొదలు రోహిత్ వరకు కెప్టెన్లు మారినా మన జట్టు ప్రపంచ చాంపియన్ కాలేకపోతోంది. 2015, 2019లో వన్డే ప్రపంచ కప్ లలో మన జట్టు సెమీస్ లోనే వెనుదిరగ్గా.. 2023లో సొంతగడ్డపై ఫైనల్లో భంగపడింది. ఇక టి20 ప్రపంచ కప్ లలోనూ సెమీస్ కే పరిమితం అయింది. టెస్టు చాంపియన్ షిప్ లో రెండుసార్లు ఫైనల్లో ఓడింది. అయితే, ఈ సందర్భాల్లో ఎక్కువసార్లు దెబ్బకొట్టింది ఆస్ట్రేలియానే కావడం గమనార్హం. లేదంటే ఇప్పటికి మన జట్టు కనీసం మూడుసార్లు ప్రపంచ చాంపియన్ గా నిలిచి ఉండేది.

ఫైనల్లో ఎదురైతే అంతే..

ఆసీస్ గనుక ఫైనల్ ప్రత్యర్థి అయితే టీమిండియా ముందే జావగారిపోతోంది. 2023 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్ లో ఇదే జరిగింది. నాడు ఫైనల్ ను మంచిగానే మొదలుపెట్టిన రోహిత్ శర్మ టీమ్.. క్రమంగా పట్టు సడలించింది. ఇక మూడు నెలల కిందట భారత్ లోనే జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్ ఫలితం అందరికీ గుర్తుండే ఉంటుంది. లీగ్ దశలో మొదట ఆస్ట్రేలియాను మట్టికరిపించిన మన జట్టు ఆపై ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా ఫైనల్ కు చేరింది. కానీ, తుది సమరంలో చేతులెత్తేసింది. తాజాగా అండర్ 19 ప్రపంచ కప్ లోనూ ఇదే జరిగింది. అంటే.. కేవలం ఏడాదిలోపే మూడు ఫైనల్స్ లో టీమిండియాను ఆసీస్ మట్టికరిపించింది.

అప్పుడు ఇప్పుడు అంతే..

సీనియర్ స్థాయిలో వన్డే ప్రపంచకప్ లో, జూనియర్ ప్రపంచకప్ లో భారత్ అజేయంగా ఫైనల్ చేరడం గమనార్హం. కానీ, ఫైనల్లో మాత్రం కంగారూ తోక మెడకు చుట్టుకుంది. వాస్తవానికి అండర్ 19లో రెండు సార్లు ఫైనల్స్ (2012, 2018)లో ఆసీస్ ను భారత్ మట్టికరిపించింది. కానీ, ఇప్పుడు మూడో సారి భంగపడింది. బౌలింగ్‌ లో కాస్త మెరుగ్గానే రాణించినా చివరి వరకూ పట్టు నిలుపుకోలేపోయింది. దీంతో ఆసీస్ టోర్నీ చరిత్రలోనే ఫైనల్లో అత్యధిక స్కోరును చేసింది. దక్షిణాఫ్రికా దాదాపు ఇంతే స్కోరును ఛేదించిన భారత్ కు ఆసీస్ పై మాత్రం చాన్స్ దొరకలేదు. అందులోనూ ఫైనల్‌ అంటే ఆస్ట్రేలియాకు పూనకాలే.. సీనియర్లే కాదు.. కుర్రాళ్లు కూడా తమ ఛాంపియన్‌ మనస్తత్వాన్ని చాటారు. బౌలింగ్‌లో విజృంభిస్తూ, మాటలతో కవ్విస్తూ.. ఎలాగైనా సరే ఆధిపత్యం ప్రదర్శించాలనే పట్టుదలతోనే సాగారు.