Begin typing your search above and press return to search.

కరెంటు లేని స్టేడియంలో భారత్-ఆసీస్ మ్యాచ్

23 ఏళ్ల కిందట ఏర్పడిన ఛత్తీస్ గఢ్ కు రాయ్ పూర్ రాజధాని. ఇక్కడి షాహీద్‌ వీర్‌ నారాయణ్‌ సింగ్‌ స్టేడియంలో శుక్రవారం రాత్రి 7 గంటల నుంచి మ్యాచ్ మొదలుకానుంది.

By:  Tupaki Desk   |   1 Dec 2023 10:16 AM GMT
కరెంటు లేని స్టేడియంలో భారత్-ఆసీస్ మ్యాచ్
X

భారత్ విశాలమైన దేశం.. అత్యంత ఆదరణ ఉన్న క్రికెట్ కు ఎన్నో అంతర్జాతీయ స్టేడియాలు.. ఎంతగా అంటే.. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న టి20 సిరీస్ నే తీసుకుంటే.. రెండో టి20 తిరువనంతపురంలో జరగ్గా.. మూడో మ్యాచ్ అసోంలోని గువాహటి లో నిర్వహించారు. ఆరేబియా సముద్రం తీరంలోని తిరువనంతపురానికి.. హిమాలయాల వద్ద ఉన్న గువాహటికి వేల కిలోమీటర్ల దూరం. ఇక నాలుగో మ్యాచ్ శుక్రవారం ఛత్తీస్ గడ్ లోని రాయ్ పూర్ లో జరగనుంది.

ఛత్తీస్ గఢ్ లోని ఏకైక స్టేడియం..

23 ఏళ్ల కిందట ఏర్పడిన ఛత్తీస్ గఢ్ కు రాయ్ పూర్ రాజధాని. ఇక్కడి షాహీద్‌ వీర్‌ నారాయణ్‌ సింగ్‌ స్టేడియంలో శుక్రవారం రాత్రి 7 గంటల నుంచి మ్యాచ్ మొదలుకానుంది. కాగా, ఈ స్టేడియం సామర్థ్యం 60 వేలు. అయితే.. డై –నైట్ మ్యాచ్ కు మైదానంలో కొన్నిచోట్ల విద్యుత్‌ వెలుగులు ఉండకపోవచ్చు. ఈ స్టేడియంను కొంత కాలం నుంచి కరెంట్‌ కష్టాలు వెంటాడుతుండటమే కారణం. కొన్నేళ్లుగా విద్యుత్తు బిల్లులు చెల్లించకపోవడంతో మైదానానికి కరెంట్‌ సరఫరా లేదు. దీంతో శుక్రవారం మ్యాచ్‌ ను జనరేటర్లతో నడిపించనున్నారు. 2008లో ఈ స్టేడియాన్ని నిర్మించారు. నిర్వహణను ప్రజా పనుల శాఖ (పీడబ్ల్యూడీ)కు అప్పగించారు. మిగతా ఖర్చులను క్రీడా శాఖ భరిస్తోంది. నిర్మించిన ఏడాదికే అంటే 2009 నుంచి ఈ స్టేడియం విద్యత్తు బిల్లులను చెల్లించట్లేదు. ఆ బకాయిలు పెరిగి రూ.3.16 కోట్లకు చేరాయి. బకాయిల గురించి పీడబ్ల్యూడీ, క్రీడా శాఖకు పలుసార్లు నోటీసులు పంపినా.. స్పందనా రాలేదని విద్యుత్తు అధికారులు చెబుతున్నారు.

ఐదేళ్ల కిందట హెచ్చరిక..

వీర్‌ నారాయణ్‌ సింగ్‌ స్టేడియానికి 2018లో ఈ మైదానానికి విద్యుత్తును సరఫరా నిలిపివేశారు. ఆ సమయంలో హాఫ్‌ -మారథాన్‌ ను నిర్వహించారు. మైదానంలో కరెంట్‌ సరఫరా లేకపోవడంతో అథ్లెట్లు ఆందోళన వ్యక్తం చేశారు. అప్పుడే విద్యుత్తు లేని సంగతిని వెలుగులోకి వచ్చింది. కాగా, ఛత్తీస్‌ గఢ్‌ రాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ అభ్యర్థన మేరకు స్టేడియంలో తాత్కాలిక కనెక్షన్‌ ఇచ్చారు.

ఫ్లడ్ లైట్లకు ప్రత్యేక జనరేటర్లు

వీర్‌ నారాయణ్‌ సింగ్‌ స్టేడియం లో విద్యుత్తు కనెక్షన్ కేవలం స్టేడియంలోని గదులు, గ్యాలరీ, బాక్సుల్లో లైట్లకు మాత్రమే సరిపోతుంది. మైదానంలో ఫ్లడ్‌ లైట్ల కోసం ప్రత్యేకంగా జనరేటర్లు ఉపయోగిస్తున్నారు. ఐదేళ్లలో ఇక్కడ మూడు అంతర్జాతీయ మ్యాచ్ లు నిర్వహించారు. అయితే అది తాత్కాలిక కనెక్షన్‌, జనరేటర్లతోనే నడిపించారు. శుక్రవారం నాటి మ్యాచ్ కు ఈ తాత్కాలిక కనెక్షన్ సామర్థ్యాన్ని పెంచాలని క్రికెట్ అసోసియేషన్‌ సంబంధిత అధికారులను కోరింది. అనుమతులు లభించినా.. పనులు చేపట్టలేదు. భారత్‌, ఆసీస్‌ మ్యాచ్‌ కూ జనరేటర్లతోనే ఫ్లడ్‌ లైట్లను వెలిగించనున్నారు.