అద్భుతం... అమోఘం.. మనమ్మాయిలే ప్రపంచ చాంపియన్లు
By: Tupaki Desk | 3 Nov 2025 12:03 AM ISTమన దేశంలో దాదాపు నెల కిందట మహిళల వన్డే ప్రపంచ కప్ మొదలైనప్పుడు ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు.. టోర్నీ జరుగుతున్న కొద్దీ ఆసక్తి పెరిగినా.. మధ్యలో టీమ్ ఇండియా ఓటముల పాలైనప్పుడు మళ్లీ పాత కథే కదా అనుకున్నారు..! కానీ, ఇప్పుడు మాత్రం అద్బుతం అని.. అమోఘం అని కొనియాడుతున్నారు. కారణం.. ఎన్నేళ్లో వేచిన కప్... రెండుసార్లు అందినట్లే అంది చేజారిన టైటిల్... ఈసారి మాత్రం భారత మహిళల వశమైంది..! మన అమ్మాయిలు పట్టు విడవలేదు.. ఒత్తిడిలోనూ నిలదొక్కుకుని సత్తా చాటారు.. తామేంటో ప్రపంచానికి చాటి చెప్పారు. మహిళల క్రికెట్ చరిత్రలో చాంపియన్ గా అవతరించారు..! 52 ఏళ్ల మహిళల వన్డే చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించారు..! ఆదివారం వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను భారత మహిళలు ఓడించి జగజ్జేతగా నిలిచారు..! ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు ఏడు వికెట్లు కోల్పోయి 298 పరుగులు సాధించింది..! ప్రత్యర్థికి 299 పరుగుల టార్గెట్ ను విధించింది. ఛేదనలో దక్షిణాఫ్రికాను కట్టడి చేసింది.
షెఫాలీ అదరహో.. మంధాన మెరుపులు
వాన కారణంగా ఆలస్యంగా మొదలైన ఫైనల్లో టాస్ ఓడిన భారత జట్టు ముందుగా బ్యాటింగ్ కు దిగింది. రాత్రివేళ కురిసే మంచును ఆయుధంగా చేసుకుని భారత్ ను ఓడిద్దామని భావించిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. అయితే, భారత అమ్మాయిల ముందు వారి ఎత్తులు సాగలేదు. ఓపెనర్లు షెఫాలీ వర్మ (78 బంతుల్లో 87, 7 ఫోర్లు, 2 సిక్సులు), మంధాన (58 బంతుల్లో 45, 8 ఫోర్లు) ఏకంగా 104 పరుగులు జోడించి శుభారంభం అందించారు. సెమీస్ లో ఆస్ట్రేలియాపై అదిరే ఇన్నింగ్స్ ఆడిన జెమీమా (37 బంతుల్లో 24). కెప్టెన్ హర్మన్ ప్రీత్ (29 బంతుల్లో 20) మోస్తరుగానే ఆడారు. అయితే, ఆల్ రౌండర్ దీప్తి శర్మ (58 బంతుల్లో 58, 3 ఫోర్లు, సిక్స్) చివరి వరకు నిలిచి జట్టుకు భారీ స్కోరు అందించింది. ఆమెకు వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ (24 బంతుల్లో 34, 3 ఫోర్లు, 2 సిక్సులు) చక్కటి సహకారం అందించింది. దీంతో భారత జట్టు 298 పరుగులు సాధించించింది.
సఫారీలు పోరాడినా...
ప్రపంచ కప్ లో రెండో అత్యధిక టార్గెట్ (299)తో బరిలో దిగిన దక్షిణాఫ్రికాకు ఓపెనర్, కెప్టెన్ లారా ఓల్వార్ట్ (98 బంతుల్లో 101, 11 ఫోర్లు, సిక్స్), మరో ఓపెనర్ తజ్మిన్ బ్రిట్స్ (35 బంతుల్లో 23, 2 ఫోర్లు సిక్స్) తొలి వికెట్ కు 51 పరుగుల శుభారంభమే అందించారు. కానీ, ఏబీ కౌర్ వేసిన డైరెక్ట్ హిట్ కు బ్రిట్స్ రనౌట్ కావడం మ్యాచ్ ను మలుపు తిప్పింది. ఆ వెంటనే తెలుగమ్మాయి శ్రీ చరణి.. వన్ డౌన్ బ్యాటర్ అన్నెకె బాష్ (0)ను ఎల్బీ చేయడంతో భారత జట్టుకు పట్టు దొరికింది. తర్వాత సునె లజ్ (25), డెర్క్ సన్ (35), లారా పోరాడినా.. సరిపోలేదు. దీంతో దక్షిణాఫ్రికా 246 పరుగులకే ఆలౌటైంది. దీప్తి శర్మ (5/39) బౌలింగ్ లోనూ సత్తాచాటింది. శ్రీ చరణి (1/48) చక్కగా బౌలింగ్ చేసింది. షెఫాలీ కూడా (2/36) రెండు కీలక వికెట్లు పడగొట్టి జట్టు చారిత్రక విజయంలో తనవంతు పాత్ర పోషించింది.
