పాక్ ను నమ్మలేం టీమ్ ఇండియా.. 2017 చాంపియన్స్ ట్రోఫీనే ఉదాహరణ
సరిహద్దుల్లో అయినా... క్రికెట్ మైదానంలోనే అయినా పాకిస్థాన్ నమ్మలేం..! మొదటి విషయంలో దొంగ బుద్ధి చూపే దాయాది.. రెండో విషయంలో ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియదు..!
By: Tupaki Desk | 27 Sept 2025 9:15 AM ISTసరిహద్దుల్లో అయినా... క్రికెట్ మైదానంలోనే అయినా పాకిస్థాన్ నమ్మలేం..! మొదటి విషయంలో దొంగ బుద్ధి చూపే దాయాది.. రెండో విషయంలో ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియదు..! దీనికి గతంలోనూ చాలా ఉదాహరణలు ఉన్నాయి. అందుకే, ఆసియా కప్ లో ఆదివారం టీమ్ ఇండియా బహుపరాక్ అనాల్సి వస్తోంది. 2017లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీని ఈ సందర్భంగా ఉదాహరణగా చెప్పుకోవాల్సి ఉంటుంది.
ఆనాడు ఏం జరిగింది అంటే...
2017లో ఇంగ్లండ్ లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియా గ్రూప్ బిలో పాకిస్థాన్ తో తలపడింది. ఆ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన మన జట్టు 48 (కుదించారు) ఓవర్లలో 319 పరుగుల భారీ స్కోరు సాధించింది. నాటి జట్టులో రోహిత్, ధావన్, కోహ్లి, ధోనీ, యువరాజ్ వంటి దిగ్గజాలు ఉన్నారు. ఛేదనలో పాక్ ను కేవలం 164 పరుగులకే ఆలౌట్ చేసి 124 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ లో గెలుపు కంటే పాక్ పై భారత ఆటగాళ్ల ఆధిపత్యం, ఆత్మవిశ్వాసం చాలా ఉన్నతంగా కనిపించింది.
-ఇదే రెండు జట్లు ఫైనల్ కు వచ్చాయి. కానీ, ఫలితం మాత్రం తిరగబడింది. టాస్ గెలిచి భారత్ బౌలింగ్ ఎంచుకుంది. పాక్ 338 పరుగులు చేసింది. భారత్ కేవలం 158 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ లో పాక్ ఓపెనర్ ఫఖర్ జమాన్ 114 అద్భుతమైన సెంచరీ కొట్టాడు. పేసర్ మొహమ్మద్ అమీర్ (3/16) సూపర్ స్పెల్ తో టాప్ ఆర్డర్ లోని ధవన్, రోహిత్, కోహ్లిలను ఔట్ చేశాడు. మరో పేసర్ హసన్ అలీ (3/19) మిగతా పని పూర్తి చేశాడు. ఈ ఓటమి కొన్నాళ్లపాటు భారత అభిమానులను బాధించింది.
ఆ పరిస్థితి ఇప్పుడు రావొద్దు..
టీమ్ ఇండియా ప్రస్తుతం ఆసియా కప్ లో అద్భుతంగా ఆడుతోంది. గ్రూప్ దశలో, సూపర్ 4 లో మొత్తం ఆరు మ్యాచ్ లలోనూ గెలిచింది. ఫైనల్లో ఆదివారం పాకిస్ధాన్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ 2017 నాటి చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఓటమికి ప్రతీకారం అనుకోవాలి.
-కాగా, 2017లో లాగానే టీమ్ ఇండియా అత్యంత బలీయంగా కనిపిస్తోంది. కానీ, అప్పటిలాగే పాక్ మెరుపు ప్రదర్శనతో దెబ్బకొట్టే చాన్స్ లేకపోలేదు. గ్రూప్, సూపర్ 4 లో ఓడించినప్పటికీ భారత్ ఏమాత్రం చాన్స్ ఇచ్చినా పాకిస్థాన్ పుంజుకొంటుంది. అందుకని టీమ్ ఇండియా చాలా జాగ్రత్తగా ఉండాలి.
కొసమెరుపుః 2017 నాటి చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాక్ ఓపెనర్ ఫఖర్ జమన్ ను భారత స్టార్ పేసర్ బుమ్రా త్వరగానే ఔట్ చేశాడు. కానీ, అది నోబాల్. ఈ అవకాశాన్ని వాడుకుని జమాన్ సెంచరీ కొట్టాడు. అప్పట్లో బుమ్రాపై అభిమానులు తీవ్రంగా మండిపడ్డారు. మరి ఈ ఆసియా కప్ లోనూ జమాన్ ఆడుతున్నాడు. బుమ్రా ఈసారి ప్రతీకారం తీర్చుకుంటాడేమో చూడాలి.
