మళ్లీ భారత్-పాక్ మ్యాచ్... అయినా షేక్ హ్యాండ్ లు ఉండవు అంతే
భారత్ తో జరిగిన మ్యాచ్ లో ఆటగాళ్ల షేక్ హ్యాండ్ లేకపోయినా ఏంకాదని రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ చెప్పినట్లు నిందలు వేసిన పాకిస్థాన్ బుధవారం యూఏఈతో మ్యాచ్ ను బాయ్ కాట్ చేస్తామని బెదిరింపులకు దిగింది.
By: Tupaki Desk | 18 Sept 2025 1:37 PM ISTమొన్నటి మ్యాచ్ కు సంబంధించిన ప్రకంపనలు ఇంకా సాగుతుండగానే.. మళ్లీ ఇంకో మ్యాచ్ వచ్చేసింది..! ఇప్పటికీ గత మ్యాచ్ తాలూకు వివాదాలు సంచలనం రేపుతుండగానే.. ఇంకో మ్యాచ్ కు రంగం సిద్ధమైంది..! చప్పగా సాగుతున్న ఆసియా కప్ లో భాగంగా వచ్చే ఆదివారం భారత్-పాకిస్థాన్ తలపడనున్నాయి. గత ఆదివారం ఇరు జట్ల మ్యాచ్ లో షేక్ హ్యాండ్ వివాదం.. చివరకు పాకిస్థాన్ జట్టు టోర్నీని బాయ్ కాట్ చేసేవరకు తెచ్చిన సంగతి తెలిసిందే.
పాక్ ఆడకుండా ఉండి ఉంటే..!
భారత్ తో జరిగిన మ్యాచ్ లో ఆటగాళ్ల షేక్ హ్యాండ్ లేకపోయినా ఏంకాదని రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ చెప్పినట్లు నిందలు వేసిన పాకిస్థాన్ బుధవారం యూఏఈతో మ్యాచ్ ను బాయ్ కాట్ చేస్తామని బెదిరింపులకు దిగింది. అదే జరిగి ఉంటే టోర్నీ నుంచి ఇంటికెళ్లేది. ఎందుకంటే తదుపరి దశ అయిన సూపర్ -4కు అర్హత సాధించాలంటే యూఏఈతో మ్యాచ్ లో కచ్చితంగా గెలవాలి. బాయ్ కాట్ గనుక చేసినట్లయితే పాక్ ఇంటికెళ్లేది. గెలవడంతో సూపర్-4కు చేరింది.
ఈ ఆదివారం మళ్లీ...
సూపర్ 4లో భాగంగా ఈ నెల 21న ఆదివారం మళ్లీ భారత్-పాక్ ఆడనున్నాయి. గ్రూప్ ఎ నుంచి ఈ రెండు జట్లే సూపర్ 4కు అర్హత సాధించాయి. గ్రూప్ బి నుంచి గురువారం జరిగే అఫ్ఘానిస్థాన్-శ్రీలంక మ్యాచ్ తర్వాత సూపర్ 4కు వెళ్లేది ఎవరో తెలుస్తుంది. కాగా, సెమీఫైనల్ గా భావించే సూపర్ 4లో టాప్ 2లో నిలిచిన జట్లు ఫైనల్ చేరతాయి.
ఫైనల్లోనూ పాక్ తో...
గ్రూప్ బిలో లంక, అఫ్ఘానిస్థాన్ మ్యాచ్ లో లంక గెలిస్తే 6 పాయింట్లతో టేబుల్ టాపర్ గా సూపర్-4కు వెళ్తుంది. బంగ్లాదేశ్ కూడా దాంతోపాటే వెళ్తుంది. ఒకవేళ లంక ఓడితే... అఫ్ఘాన్ కంటే తక్కువ రన్ రేట్ ఉన్నందున బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఇక సూపర్ లో భారత్ తన దూకుడును కొనసాగిస్తే ఫైనల్ చేరడం ఖాయం. అటునుంచి పాక్-లంక మధ్య ఎవరు తుదిపోరుకు వస్తారనేది చూడాలి. పాక్ గనుక ఫైనల్ కు వస్తే ఒకే టోర్నీలో మూడుసార్లు భారత్ తో తలపడినట్లు అవుతుంది.
ఏం చేసినా సరే.. పాకిస్థాన్ ఆటగాళ్తతో టీమ్ ఇండియా ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వరనేది మాత్రం మొదటి మ్యాచ్ లోనే స్పష్టమైంది.
