భారత్-పాక్ మ్యాచ్.. స్పిన్ వికెట్.. బీసీసీఐ బాయ్ కాట్.. ఏమవునో?
ఆసియా కప్ లో భాగంగా ఆదివారం భారత్-పాక్ మధ్య దుబాయ్ లో జరగనున్న మ్యాచ్ కు అసలు బీసీసీఐ నుంచి ప్రతినిధులు హాజరవుతారా? అనే అనుమానం నెలకొంది.
By: Tupaki Desk | 13 Sept 2025 11:00 PM ISTసహజంగా అయితే ఈ పాటికి అభిమానులంతా ఆవురావురని వెంపర్లాడుతుండాలి.. టికెట్లన్నీ అమ్ముడయి ఉండాలి... ఇంకా క్రికెట్ స్టేడియం దగ్గర వెర్రెక్కిపోతుండాలి..! ప్రపంచ క్రికెట్ కే ఒక బజ్ వచ్చి ఉండాలి... ఇళ్లలోని అభిమానులైతే టీవీ డిష్ కనెక్షన్ సరిగా ఉందో లేదో చూసుకుంటుండాలి...! కానీ, అవేమీ లేవు. జరగబోయేది టి20 మ్యాచ్ అయినా అసలు ఆసక్తే లేదు..!
భారత్ -పాక్ మ్యాచేనా?
ఆసియా కప్ లో భాగంగా ఆదివారం భారత్-పాక్ మధ్య దుబాయ్ లో జరగనున్న మ్యాచ్ కు అసలు బీసీసీఐ నుంచి ప్రతినిధులు హాజరవుతారా? అనే అనుమానం నెలకొంది. సంప్రదాయం ప్రకారం బీసీసీఐ నుంచి ఒక్కరినే ప్రతినిధిగా పంపే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. పెహల్గాం దాడి తర్వాత పాక్ తో క్రికెట్ వద్దని అభిమానుల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. అయితే, అంతర్జాతీయ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ పేరు చెప్పి పాకిస్థాన్ తో మ్యాచ్ ఆడబోతుండడం అభిమానులను ఆగ్రహానికి గురిచేస్తోంది. దీంతో వారు బాయ్ కాట్ పిలుపు ఇచ్చారు. ఈ ఏడాది దుబాయ్ లోనే జరిగిన చాంపియన్స్ ట్రోఫీకి భారత్-పాక్ మ్యాచ్ కు బీసీసీఐ నుంచి పెద్ద సంఖ్యలో అధికారులు వెళ్లారు. రాష్ట్ర సంఘాల ప్రతినిధులూ పాల్గొన్నారు. ఇప్పుడు మాత్రం ఒక్కరంటే ఒక్కరే వెళ్లారని సమాచారం.
ఎవరి బంతి తిరుగుతుందో..??
దుబాయ్ పిచ్ లు స్పిన్ కు కాస్త అనుకూలం. ఈ నేపథ్యంలో భారత్-పాక్ మ్యాచ్ లో ఎవరి బంతి ఎక్కువ తిరిగితే వారిదే గెలుపు. భారత్ కు వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ వంటి నాణ్యమైన మిస్టరీ స్పిన్నర్లున్నారు. అక్షర్ పటేల్ తన స్లో స్పిన్ తో మాయ చేయగలడు. వరుణ్ టి20 ర్యాంకింగ్స్ లో నంబర్ 2. కుల్దీప్ చైనామన్ బంతులను అర్థం చేసుకోవడం ఎవరికైనా కష్టమే. తొలి మ్యాచ్ లో యూఏఈని అతడు చుట్టేశాడు. మరీ ముఖ్యంగా బాబర్ అజామ్, రిజ్వాన్ వంటి నాణ్యమైన బ్యాటర్లు లేని పాక్ కు వీరిని ఎదుర్కొనడం సవాలే.
పాక్ కూ బలం ఉంది...
పాకిస్థాన్ జట్టులోనూ మంచి స్పిన్నర్లు ఉన్నారు. దాయాది ఏకంగా నలుగురు స్పిన్నర్లతో ఆడనున్నట్లు తెలుస్తోంది. మొహమ్మద్ నవాజ్ వీరిలో కీలకం. అతడు అఫ్ఘాన్ పై హ్యాట్రిక్ తీశాడు. వివాదాస్పదుడైనా... అబ్రార్ ను తక్కువ చేయలేం. సయీమ్ ఆయుబ్, సుఫియాన్ ముకీమ్ ఉపయుక్తమైన పార్ట్ టైమర్లు. వీరిని కాచుకోవడం భారత బ్యాటర్లకు సవాలే. అభిషేక్ శర్మ-శుబ్ మన్ గిల్ నుంచి అక్షర్ పటేల్ వరకు ఉన్న భారీ బ్యాటింగ్ లైనప్ వీరిని సమర్థంగా ఎదుర్కొనగలరని చెప్పొచ్చు.
