Begin typing your search above and press return to search.

ఒక్క గెలుపు... న్యూజిలాండ్ పై దారుణ‌ ప‌రాజ‌యాల‌కు దీటైన‌ జ‌వాబు

అయితే, ఆ త‌ర్వాత న్యూజిలాండ్ భార‌త్ కు వ‌చ్చి వ‌న్డే సిరీస్ కొట్టేసింది. కాబ‌ట్టి, ఆదివారం జ‌ర‌గ‌బోయే టి20 ప్ర‌పంచ క‌ప్ ఫైన‌ల్లో గెలిచి బ‌దులు తీర్చుకోవాల్సిందే.

By:  Tupaki Political Desk   |   7 March 2026 12:00 AM IST
ఒక్క గెలుపు... న్యూజిలాండ్ పై దారుణ‌ ప‌రాజ‌యాల‌కు దీటైన‌ జ‌వాబు
X

2000 చాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్... కెప్టెన్ సౌర‌భ్ గంగూలీ...! 2019 వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ సెమీస్.. 2019-21 తొలి ప్ర‌పంచ టెస్టు చాంపియ‌న్ షిప్ (డ‌బ్ల్యూటీసీ) ఫైన‌ల్.. కెప్టెన్ విరాట్ కోహ్లి..! 2024 చివ‌ర్లో స్వ‌దేశంలో చ‌రిత్ర‌లో తొలిసారిగా 0-3తో టెస్టు సిరీస్ ఓట‌మి...! ఈ ఏడాది ప్రారంభంలో మొద‌టిసారిగా 1-2తో వ‌న్డే సిరీస్ ఓట‌మి...! ఇదీ టీమ్ ఇండియాకు న్యూజిలాండ్ ఇచ్చిన షాక్ లు. మ‌రీ 2019 వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ నుంచి అయితే ఒక‌టికి రెండు షాక్ ల మీద షాక్ లు. తేనె పూసిన క‌త్తిలాంటి ప్ర‌త్య‌ర్థిలాంటి కివీస్ మ‌ళ్లీ ఇప్పుడు టి20 ప్ర‌పంచ క‌ప్ లో ప్ర‌త్య‌ర్థిగా నిలిచింది. ఇది అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టోర్నీల్లో రెండు జ‌ట్ల మ‌ధ్య నాలుగో ఫైన‌ల్. దీనికిముందు 2021 డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్, 2000 సంవ‌త్స‌రంతో పాటు 2025లో చాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్లో త‌ల‌ప‌డ్డాయి. నిరుడు జ‌రిగిన చాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్లో మ‌న జ‌ట్టే విజేత‌గా నిలిచింది. అయితే, ఆ త‌ర్వాత న్యూజిలాండ్ భార‌త్ కు వ‌చ్చి వ‌న్డే సిరీస్ కొట్టేసింది. కాబ‌ట్టి, ఆదివారం జ‌ర‌గ‌బోయే టి20 ప్ర‌పంచ క‌ప్ ఫైన‌ల్లో గెలిచి బ‌దులు తీర్చుకోవాల్సిందే.

ప్ర‌పంచ క‌ప్ ల‌లో ఇదే తొలిసారి...

డ‌బ్ల్యూటీసీ, చాంపియ‌న్స్ ట్రోఫీలు కాక ప్ర‌పంచ క‌ప్ ఫైన‌ల్స్ లో భార‌త్-న్యూజిలాండ్ త‌ల‌ప‌డ‌డం ఇదే తొలిసారి. టి20 ప్ర‌పంచ‌క‌ప్ ను భార‌త్ (2007, 2024), ఇంగ్లండ్ (2010, 2022), వెస్టిండీస్ (2012, 2016) రెండేసి సార్లు గెలిచాయి. పాక్ (2009), శ్రీలంక (2014), ఆస్ట్రేలియా (2021) ఒక‌సారి గెలిచాయి. వీటిలో ఆస్ట్రేలియా 2021లో విజేత‌గా నిలిచింది. ఆ ఏడాది ఫైన‌ల్లో ఓడించింది ఎవ‌రినో కాదు.. న్యూజిలాండ్ నే.

తొలిసారి వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ అవుతుందా?

న్యూజిలాండ్ ఇంత‌వ‌ర‌కు ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్ లో ప్ర‌పంచ చాంపియ‌న్ కాలేదు. 2015, 2019లో వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ ఫైన‌ల్స్ చేరినా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ల చేతిలో ప‌రాజ‌యం పాలైంది. ఐదేళ్ల త‌ర్వాత టి20 ప్రపంచ క‌ప్ లో (రెండోసారి) తుది స‌మ‌రానికి వ‌చ్చింది. కాబ‌ట్టి, టీమ్ ఇండియా త‌న గ‌త ప‌రాజ‌యాల‌కు జ‌వాబివ్వ‌డానికి ఇదే త‌గిన స‌మ‌యం.

బౌల‌ర్లు బాగా రాణిస్తేనే..

మెత్త‌గా ఉంటూనే చాప‌కింద నీరులా ప్ర‌త్య‌ర్థిని ఓడిస్తుంది కివీస్. అలాంటి జ‌ట్టుతో జాగ్ర‌త్త‌గా ఆడ‌క‌పోతే ఇటీవ‌లి ప‌రాభ‌వాలు మ‌రోసారి ఖాయం. ముఖ్యంగా టీమ్ఇండియా బౌలింగ్ ద‌ళం మ‌రీ బ‌ల‌హీనంగా ఉంది. మిస్ట‌రీ స్పిన్న‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌రి ప్ర‌త్య‌ర్థుల పాలిట ర‌న్ మెషీన్ గా మారిపోయాడు. ఎడ‌మ‌చేతి వాటం పేస‌ర్ అర్ష‌దీప్ స్వింగ్ గాడి త‌ప్పంది. మేటి పేస‌ర్ బుమ్రా త‌న ప్ర‌తిభ‌కు న్యాయం చేస్తుండ‌గా, అత‌డికి పేస్ ఆల్ రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా స‌హ‌కారం అందిస్తున్నాడు. గురువారం ఇంగ్లండ్ తో సెమీస్ లో హార్దిక్ మాత్ర‌మే బుమ్రాకు అండ‌గా నిలిచాడు. కాబ‌ట్టి ఫైన‌ల్లో న్యూజిలాండ్ బ్యాట‌ర్లు సీఫెర్ట్, ర‌చిన్ ర‌వీంద్ర‌, చాప్ మ‌న్, గ్లెన్ ఫిలిప్స్ ల‌ను అడ్డుకోవాలంటే అంద‌రు బౌల‌ర్లూ త‌లో చేయి వేయాల్సి ఉంటుంది. భార‌త బ్యాటింగ్ లో ఏకైక బెంగ ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ మాత్ర‌మే. అత‌డు గ‌నుక ఫైన‌ల్లో జోరందుకుంటే ఈ విభాగంలో ఢోకా లేన‌ట్లే. అప్పుడు డిఫెండింగ్ చాంపియ‌న్ టి20 ప్ర‌పంచ క‌ప్ గెలిచి చ‌రిత్ర తిర‌గ‌రాసిన‌ట్లే.