Begin typing your search above and press return to search.

తొలి టెస్టు: నల్ల రిబ్బన్ల టీమ్ ఇండియా-ఇంగ్లండ్ ఆటగాళ్లు

గత గురువారం భారత విమానయాన చరిత్రలో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి బయల్దేరిన ఎయిరిండియా విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   20 Jun 2025 5:03 PM IST
తొలి టెస్టు: నల్ల రిబ్బన్ల టీమ్ ఇండియా-ఇంగ్లండ్ ఆటగాళ్లు
X

అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్న టీమ్ ఇండియా-ఇంగ్లండ్ ఐదు టెస్టుల సిరీస్ మొదలైంది. లీడ్స్ లో శుక్రవారం నుంచి తొలి టెస్టు ప్రారంభమైంది. ఇది కొత్త కెప్టెన్ శుబ్ మన్ గిల్ సారథ్యంలో టీమ్ ఇండియాకు కొత్త ప్రారంభం అని చెప్పాలి. దీనికితోడు సీనియర్లు, స్టార్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ లేకుండా గత 15 ఏళ్లలో భారత్ కు ఇదే తొలి టెస్టు.

కాగా, రోహిత్ శర్మ స్థానంలో ఈ టెస్టులో టీమ్ ఇండియా తరఫున ఐపీఎల్ సంచలనం ఎడమచేతి వాటం బ్యాట్స్ మన్ సాయి సుదర్శన్ అరంగేట్రం చేశాడు. విరాట్ కోహ్లి స్థానాన్ని సీనియర్ కరుణ్ నాయర్ తో భర్తీ చేశారు. ఇక కూర్పు ప్రకారం చూస్తే ఎడమ-కుడి కాంబినేషన్ పక్కాగా చూసుకున్నట్లు తెలుస్తోంది. ఎడమ చేతి యశస్వికి తోడుగా.. రోహిత్ స్థానంలో ఓపెనర్ గా కేఎల్ రాహుల్ వచ్చాడు. సాయి వన్ డౌన్ లో, కెప్టెన్ గిల్ నాలుగో నంబరు (కోహ్లి ప్లేస్)లో వస్తున్నాడు. ఐదో స్థానంలో ఎడమచేతి వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్, ఆరులో కరుణ్, ఏడులో జడేజా, ఎనిమిదిలో పేస్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ వస్తుండడం గమనార్హం. బుమ్రాకు తోడుగా హైదరాబాదీ పేసర్ సిరాజ్ కొత్త బంతిని పంచుకుంటాడు. మరో పేసర్ గా ప్రసిద్ధ్ క్రిష్ణకు చాన్స్ దక్కింది.

నల్ల రిబ్బన్లతో..

గత గురువారం భారత విమానయాన చరిత్రలో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి బయల్దేరిన ఎయిరిండియా విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 270 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానంలోని ఒక్కరు తప్ప అందరూ ప్రాణాలు కోల్పోయారు. వీరిలో భారతీయుల తర్వాత అత్యధిక బ్రిటన్ పౌరులే. మన దేశానికి టూర్ కు వచ్చి ఆనందంగా తిరిగి వెళ్తున్న వారూ చనిపోయారు. దీంతో టీమ్ ఇండియా-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టుకు ముందు వీరికి నివాళులు అర్పించారు. ఆపై చేతికి నల్ల రిబ్బన్లతో మైదానంలోకి దిగారు.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. 19 ఓవర్లు ముగిసేసరికి టీమ్ ఇండియా వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. జైశ్వాల్ (30), రాహుల్ (25) పరుగులతో ఆడుతున్నారు.