9 వికెట్లు.. 324 పరుగులు... ఇంగ్లండ్ గడ్డపై టీమ్ఇండియా *సమ*రోత్సాహం
ప్రస్తుతం చివరి, ఐదఓ టెస్టు నాలుగో రోజు. టీమ్ఇండియా ఇంగ్లండ్ కు 374 పరుగుల టార్గెట్ విధించింది.
By: Tupaki Desk | 3 Aug 2025 4:28 PM ISTదాదాపు రెండు నెలలుగా సాగుతున్న ఇంగ్లండ్ పర్యటన ముగింపునకు వచ్చింది.. ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్ చివరకు వచ్చింది.. కేవలం ఈ ఒక్క రోజు...! దీంతో టీమ్ఇండియా గెలిచిందంటే ఒక చరిత్ర.. ఐదు టెస్టుల సిరీస్ 2-2తో సమం అవుతుంది. ఓడితే మాత్రం 3-1తో ఇంటిముఖం పడుతుంది. ఈ సిరీస్ తొలి టెస్టు గుర్తుందిగా..! భారత్ విసిరిన 371 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ అలవోకగా కొట్టేసింది. ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి గెలిచింది. ఆ రోజు భారత్ ను దెబ్బతీసింది ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్. ఏకంగా 149 పరుగుల భారీ సెంచరీ చేశాడు.
ఇప్పుడూ అతడే..?
ప్రస్తుతం చివరి, ఐదఓ టెస్టు నాలుగో రోజు. టీమ్ఇండియా ఇంగ్లండ్ కు 374 పరుగుల టార్గెట్ విధించింది. మూడో రోజు అద్భుతంగా బ్యాటింగ్ చేసిన భారత్ రెండో ఇన్నింగ్స్ లో 396 పరుగుల భారీ స్కోరు చేసింది. ప్రత్యర్థి 13.5 ఓవర్లలోనే 50 పరుగులు చేసింది. అయితే, ఓపెనర్ క్రాలీ (14)ని ఔట్ చేసిన హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ టీమ్ఇండియాకు గెలుపుపై ఆశలు చిగురింపజేశాడు. కానీ, మరో ఎండ్ లో ఓపెనర్ డకెట్ 48 బంతుల్లోనే 4 ఫోర్లతో 34 పరుగులు చేసి దూకుడు చూపుతున్నాడు.
90 ఓవర్లు 9 వికెట్లు..
ఈ సిరీస్ లో నాలుగు టెస్టులు ఐదో రోజు వరకు సాగడం విశేషం. ప్రస్తుత ఐదో టెస్టు మాత్రం ఐదో రోజు వరకు సాగే అవకాశాలు తక్కువ. ఎందుకంటే, ఇంగ్లండ్ కొట్టాల్సింది ఇంకా 324 పరుగులు. 90 ఓవర్ల ఆట సాధ్యం అవుతుందని అనుకున్నా..బజ్ బాల్ ఆటతో ఆ జట్టు ఈ లక్ష్యాన్ని ఛేదిస్తుందా? అన్నది చూడాలి. మరోవైపు భారత్ కు గెలుపు కావాలంటే 9 వికెట్లు తీయాలి. భారత తొలి ఇన్నింగ్స్ స్కోరు 224కు బదులుగా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో ఓపెనర్లు దూకుడుగా ఆడి చకచకా 90 పరుగులు చేసింది. అయినా భారత పేసర్లు మరీ ముఖ్యంగా హైదరాబాదీ సిరాజ్, ప్రసిద్ధ్ క్రిష్ణ చెలరేగి 247 పరుగులకే ఆలౌట్ చేశారు. మరిప్పుడు ఈ ఇద్దరూ ఏం చేస్తారో చూడాలి.
రెండేళ్ల కిందట టీమ్ఇండియా ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో ఇదే ఓవల్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో ఆడింది. ఆసీస్ 209 పరుగుల తేడాతో భారత్ ను ఓడించింది. రెండో ఇన్నింగ్స్ లో 444 పరుగుల టార్గెట్ ను ఛేదించలేక 234 పరుగులకే ఆలౌటైంది.
ఇంగ్లండ్ తో మూడేళ్ల కిందటి సిరీస్ ను భారత్ 2-2తో సమంగా ముగించింది. మళ్లీ ఇప్పుడు కూడా అదే ఫలితం వస్తే... కుర్రాడు శుబ్ మన్ గిల్ సారథ్యంలోని టీమ్ఇండియా నైతికంగా గెలిచినట్లే..!
