Begin typing your search above and press return to search.

'డ్యూక్స్‌'..బంతితో ఆట కాదు..బంతే ఆటగాళ్లతో ఆడుకుంటోంది...

మూడో టెస్టులో శుక్రవారం భారత్‌ బౌలింగ్‌లో 63 బంతులకే బంతిని మార్చాల్సి వచ్చంది. ఆ తర్వాత 40 బంతులు పడ్డాయో లేదో మరోసారి ఫిర్యాదు.

By:  Tupaki Desk   |   12 July 2025 5:00 AM IST
డ్యూక్స్‌..బంతితో ఆట కాదు..బంతే ఆటగాళ్లతో ఆడుకుంటోంది...
X

లీడ్స్‌ మైదానంలో ఇంగ్లండ్‌తో తొలి టెస్టు.. హైదరాబాదీ పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ బంతి షేప్‌ దెబ్బతినడంపై అంపైర్‌ను సంప్రదించాడు. టీమ్‌ఇండియా వైస్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ కూడా అదే సమయంలో అంపైర్‌ దగ్గరకు వెళ్లాడు. అంపైర్‌ గేజ్‌ మీటర్‌తో చూసి బంతి బాగానే ఉందని చెప్పాడు..దీంతో పంత్‌కు కోపమొచ్చింది.. బంతిని అసహనంతో విసిరేశాడు. దీనిపై మందలింపునకు కూడా గురయ్యాడు.

ఎడ్జ్‌బాస్టన్‌లో రెండో టెస్టు.. బంతి ఎంత త్వరగా మార్చితే అంత త్వరగా బౌలర్లకు వికెట్లు..! ఇప్పుడు ప్రఖ్యాత లార్డ్స్‌లో మూడో టెస్టు.. ఈ మ్యాచ్ లోనూ బంతి త్వరగా దెబ్బతింటూ ఉండడంతో బౌలర్లు తరచూ అంపైర్ల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో అంపైర్లు గేజ్‌ మీటర్ తో బంతి పరిస్థితి ఎలా ఉందో చూడాల్సి వస్తోంది. వారికి అంపైరింగ్‌ కంటే ఈ పనే ఎక్కువైంది.

కూకాబుర్రా.. ఆస్ట్రేలియాలో టెస్టులకు వాడే బంతి..! అదే ఇంగ్లండ్‌లో అయితే ‘డ్యూక్స్‌’ బంతిని వాడుతుంటారు. అయితే, ఈ బంతి త్వరగా షేప్‌ ఔట్‌ అవుతోంది. అసలే పేస్‌ పిచ్‌లు. బంతి సాఫ్ట్‌ అయిపోతే బ్యాట్స్‌మెన్‌ ఆడేసుకుంటారు. అందుకనే బౌలర్లు బంతిని అంపైర్ల వద్దకు తీసుకెళ్లి చెకింగ్‌ చేయమని అడుగుతున్నారు. ఇదో పెద్ద పంచాయితీ అయిపోయింది.

మూడో టెస్టులో శుక్రవారం భారత్‌ బౌలింగ్‌లో 63 బంతులకే బంతిని మార్చాల్సి వచ్చంది. ఆ తర్వాత 40 బంతులు పడ్డాయో లేదో మరోసారి ఫిర్యాదు. దీంతో మార్చాల్సి వచ్చింది. ఈ సమస్య తొలి రెండు టెస్టుల కంటే లార్డ్స్‌ టెస్టులో ఎక్కువగా ఉంది. టెస్టులకు ఈ డ్యూక్స్‌ బంతి సరైనదేనా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. బంతి షేప్‌ త్వరగా మారుతోందని, బౌలర్లకు కష్టం అవుతోందని టీమ్‌ ఇండియా కెప్టెన్‌ గిల్‌, డ్యూక్స్‌ బంతిపై ఈ స్థాయిలో విమర్శలు సరికాదని ఇంగ్లండ్‌ కెప్టెన్‌ స్టోక్స్‌ వ్యాఖ్యానించాడు. పరిష్కారం చూడాలని కోరాడు. మరి అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ఏం చేస్తుందో?

డ్యూక్స్‌ బంతితో 80 ఓవర్లు కాదు.. 50-60 ఓవర్లు వేయించాలని, అదొక మధ్యే మార్గం అని మాజీలు సలహా ఇస్తుండగా, బంతిని తప్పుబట్టడం కాదు.. కొత్త నిబంధనలు తీసుకురావాలని డ్యూక్స్‌ ప్రతినిధి దిలీప్‌ పేర్కొన్నాడు.