కోహ్లీ నుంచి గిల్ దాకా: 2021 చరిత్ర మళ్ళీ పునరావృతమవుతుందా?
ఈ మాంచెస్టర్ టెస్ట్ కేవలం ఒక సాధారణ ఆట కాదు. ఇది భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త పేజీ తిరగేయే అవకాశం. చివరి టెస్ట్‌కు ముందు సిరీస్‌ను 2-2తో సమం చేసే సువర్ణావకాశం ఇది.
By: Tupaki Desk | 24 July 2025 7:00 AM ISTఇంగ్లాండ్ గడ్డపై భారత జట్టు చివరిసారిగా టెస్ట్ సిరీస్ గెలిచింది 2007లో. అప్పటి నుంచి ఇప్పటి దాకా దాదాపు 18 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ మధ్యలో కోహ్లీ, రోహిత్ శర్మ, హర్భజన్ సింగ్, అశ్విన్, గంభీర్ వంటి ఎందరో దిగ్గజ ఆటగాళ్లు వచ్చారు.. వెళ్లారు. ఎన్నో ఆశలు, ఎన్నో ప్రయత్నాలు... కానీ విజయం మాత్రం భారత్‌కు దగ్గరకు రాలేదు.
భారత్ గెలిచే అవకాశాన్ని అత్యంత సమీపంగా చేజార్చుకుంది 2021లో. అప్పుడు ఐదు టెస్టుల సిరీస్‌లో మొదటి నాలుగు మ్యాచ్‌ల తర్వాత భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. కానీ కరోనా కారణంగా చివరి టెస్టు వాయిదా పడింది. 2022లో ఆ టెస్ట్ జరగగా, ఇంగ్లాండ్ భారీ లక్ష్యాన్ని ఛేదించి మ్యాచ్ గెలిచింది. ఆ సిరీస్ డ్రా అయింది. చరిత్ర సృష్టించే మహత్తర అవకాశాన్ని భారత జట్టు చేజేతులా చేజార్చుకుంది.
ఇప్పుడు 2025. మళ్లీ ఇదే పరిస్థితి. ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ మళ్లీ 2-1తో వెనుకబడి ఉంది. ఈ సిరీస్‌ను గెలుచుకోవాలంటే చివరి రెండు టెస్టులే చివరి ఆశలు. నాల్గవ టెస్ట్ మాంచెస్టర్‌లో మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
ప్రస్తుతం భారత జట్టుకు శుభ్మన్ గిల్ నాయకత్వం వహిస్తున్నాడు. పాత ఆటగాళ్లను పక్కన పెట్టి, కొత్త రక్తానికి అవకాశం ఇచ్చారు. సాయి సుదర్శన్, శార్దూల్ ఠాకూర్, అన్‌శుల్ కంబోజ్ వంటి యువ ఆటగాళ్లు జట్టులోకి వచ్చారు. గాయాలు, ఫామ్ లోపం భారత్‌ను ఈ మార్పుల వైపుకు నెట్టేశాయి. అయితే, ఈ కొత్త మిశ్రమం చరిత్రను తిరగరాయగలదా? ఇది కోట్లాది మంది అభిమానుల ప్రశ్న. వరుస సెషన్లలో వికెట్లు పడడంతో ప్రస్తుతం 155/3 తో భారత్ పోరాడుతోంది.
2021లో చేజారిన అవకాశాన్ని భారత అభిమానులు ఇప్పటికీ మరిచిపోలేదు. కొంతమంది అప్పటి బాధను గుర్తు చేసుకుంటూ జట్టుపై ఒత్తిడి పెంచుతుంటే, మరికొంతమంది ఈ కొత్త తరం మీద ఆశలు పెట్టుకున్నారు. గిల్, రాహుల్ లాంటి ఆటగాళ్లు ఇప్పుడు ముందుకు వచ్చి చరిత్ర సృష్టించాలన్న ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉంది.
ఈ మాంచెస్టర్ టెస్ట్ కేవలం ఒక సాధారణ ఆట కాదు. ఇది భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త పేజీ తిరగేయే అవకాశం. చివరి టెస్ట్‌కు ముందు సిరీస్‌ను 2-2తో సమం చేసే సువర్ణావకాశం ఇది. అదే జరగాలంటే… ఇప్పుడు గిల్ సేన చేయాల్సింది ఒక్కటే గెలవాలి. ఈసారి భారత జట్టు విన్నర్ అవుతుందా? లేక మళ్లీ ఒక అవకాశాన్ని చేజార్చుకుంటుందా? సమాధానం మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది!
