Begin typing your search above and press return to search.

టీమ్ ఇండియా ఒక టి20 క‌ప్పు... నాలుగు రికార్డులు

టీమ్ఇంటియా టి20 ప్ర‌పంచ‌క‌ప్ గెల‌వ‌డం కొత్త కాదు.. ఇప్ప‌టికే రెండుసార్లు ఈ ఘ‌నత సాధించింది... ఇప్పుడు మూడోసారి కూడా అందుకుంది.

By:  Tupaki Political Desk   |   9 March 2026 9:09 AM IST
టీమ్ ఇండియా ఒక టి20 క‌ప్పు... నాలుగు రికార్డులు
X

టీమ్ఇంటియా టి20 ప్ర‌పంచ‌క‌ప్ గెల‌వ‌డం కొత్త కాదు.. ఇప్ప‌టికే రెండుసార్లు ఈ ఘ‌నత సాధించింది... ఇప్పుడు మూడోసారి కూడా అందుకుంది. ప్ర‌పంచ క‌ప్ లు గెల‌వ‌డం అంటే అంత ఈజీ కాదు..! అంద‌రి క‌ళ్లూ ఇటే ఉండ‌డంతో ఎంతో ఒత్తిడి.. ఒక్క ప‌రాజ‌యం ఎదురైనా తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు.. ఒక్క చెత్త ఇన్నింగ్స్, ఒక చెత్త బౌలింగ్ స్పెల్ వేసినా ఆట‌గాళ్ల‌పై మండిపాటు.. చివ‌ర‌కు క‌ప్ సాధించ‌కుండా వెనుదిరిగితే ఇంకా ఆగ్ర‌హం.. అస‌లు విష‌యం ఏమంటే సొంత గ‌డ్డ‌పై మెగా టోర్నీ జ‌రుగుతూ.. ఒత్తి చేతుల‌తో వ‌స్తే మ‌రింత మండిప‌డ‌తారు అభిమానులు, విశ్లేష‌కులు. కానీ, సూర్య‌కుమార్ యాద‌వ్ సార‌థ్యంలోని టీమ్ఇండియా ఈసారి అలాంటి ప‌రిస్థితి త‌ప్పించింది. వ‌రుస‌గా రెండోసారి టి20 ప్ర‌పంచ‌క‌ప్ సాధించింది. మొత్తం మీద మూడో టి20 ప్ర‌పంచ క‌ప్ ను భ‌ర‌త మాత మెడ‌లో వేసింది. ఈ క్ర‌మంలో నాలుగు రికార్డులను కూడా దేశానికి కానుక‌గా అందించింది. అవేంటో చూద్దామా?

రికార్డు 1: వ‌రుస‌గా రెండో ప్ర‌పంచ క‌ప్

ప‌ది టి20 ప్ర‌పంచ క‌ప్ ల‌లో రెండుసార్లు టైటిల్ కొట్టిన జ‌ట్లు ఉన్నాయి కానీ... 2007 నుంచి ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన ప్ర‌పంచ క‌ప్ ల‌లో ఏ జ‌ట్టు కూడా వ‌రుస‌గా రెండుసార్లు టైటిల్ సాధించ‌లేదు. అంటే, డిఫెండింగ్ చాంపియ‌న్ గా అడుగుపెట్టిన జ‌ట్టు క‌ప్ గెల‌వ‌లేదు. టీమ్ఇండియా మాత్రం సాధించింది. 2024లో అమెరికా, క‌రీబియ‌న్ దీవుల్లో జ‌రిగిన టి20 ప్ర‌పంచ క‌ప్ ను కెప్టెన్ రోహిత్ శ‌ర్మ సార‌థ్యంలో నెగ్గింది. మ‌ళ్లీ ఇప్పుడు సూర్య నాయ‌క‌త్వంలో అందుకుంది. వెస్టిండీస్ 2012, 2016లో, ఇంగ్లండ్ 2010, 2022లో టి20 ప్ర‌పంచ క‌ప్ ల‌ను గెలుచుకున్నాయి.

రికార్డు 2: మూడుసార్లు జ‌గ్గ‌జేత‌

టి20 ప్ర‌పంచ క‌ప్ ను మూడుసార్లు గెలుచుకున్న జ‌ట్టుగా టీమ్ ఇండియా అరుదైన ఘ‌న‌త‌ను ఖాతాలో వేసుకుంది. 2007లో మ‌హేంద్ర సింగ్ ధోనీ, 2024లో రోహిత్ శ‌ర్మ‌లు దేశాన్ని జ‌గ‌జ్జేత‌గా నిల‌ప‌గా.. ఇప్పుడు సూర్య మ‌రో టైటిల్ అందించాడు. వెస్టిండీస్, ఇంగ్లండ్ రెండుసార్లు క‌ప్ లు గెలిచి భార‌త్ త‌ర్వాత ఉన్నాయి.

రికార్డు 3: సొంత‌గ‌డ్డ‌పై విశ్వ‌విజేత‌

గ‌తంలో జ‌రిగిన 9 టి20 ప్ర‌పంచ క‌ప్ ల‌లో ఏ జ‌ట్టు కూడా సొంత దేశంలో విజేగ‌తా నిల‌వ‌లేదు. 2007లో ద‌క్షిణాఫ్రికా, 2009లో ఇంగ్లండ్ (పాకిస్థాన్ విజేత‌), 2010లో వెస్టిండీస్ (ఇంగ్లండ్ విజేత‌), 2012లో శ్రీలంక (వెస్టిండీస్ విక్ట‌రీ), 2014 లో బంగ్లాదేశ్ (శ్రీలంక గెలుపు), 2016లో భార‌త్ (వెస్టిండీస్ విజ‌యం), 2021లో యూఈఏ (ఆస్ట్రేలియా చాంపియ‌న్), 2022లో ఆస్ట్రేలియా (ఇంగ్లండ్ జ‌గ‌జ్జేత‌), 2024లో అమెరికా-క‌రీబియ‌న్ దీవులు (భార‌త్ చాంపియ‌న్) ఆతిథ్యం ఇచ్చాయి. కానీ, ఈ ఆతిథ్య జ‌ట్లేవీ టైటిల్ కొట్ట‌లేదు. ఈసారి శ్రీలంక‌తో క‌లిసి సంయుక్త ఆతిథ్యం ఇచ్చిన భార‌త్ విశ్వ విజేత‌గా ఆవిర్భ‌వించింది.

రికార్డు 4: డిఫెండింగ్ చాంపియ‌న్ ప్ల‌స్ ఆతిథ్య దేశం

డిఫెండింగ్ చాంపియ‌న్ గా బ‌రిలో దిగి టైటిల్ నిల‌బెట్టుకున్న తొలి జ‌ట్టుగా టీమ్ఇండియా రికార్డుల‌కు ఎక్క‌డ‌మే కాదు.. తొలిసారి టైటిల్ కొట్టిన ఆతిథ్య జ‌ట్టుగానూ అరుదైన రెండు ఘ‌న‌త‌ల‌ను త‌న ఖాతాలో వేసుకుంది. అంటే, ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌లు అన్న‌మాట‌. భ‌విష్య‌త్ లో మ‌రే జ‌ట్టుకైనా ఇది సాధ్యం కావాలంటే అద్భుతం జ‌ర‌గాల్సిందే.