Begin typing your search above and press return to search.

టీ20 వరల్డ్ కప్‌లో నేడే ‘అగ్నిపరీక్ష’: సెమీస్ రేసులో భారత్ నిలుస్తుందా?

టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు ప్రయాణం ఇప్పుడు ఒక క్లిష్టమైన మలుపు వద్దకు చేరుకుంది.

By:  A.N.Kumar   |   26 Feb 2026 3:41 PM IST
టీ20 వరల్డ్ కప్‌లో నేడే ‘అగ్నిపరీక్ష’: సెమీస్ రేసులో భారత్ నిలుస్తుందా?
X

టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు ప్రయాణం ఇప్పుడు ఒక క్లిష్టమైన మలుపు వద్దకు చేరుకుంది. టోర్నీ ఆరంభంలో అంచనాలను భారీగా పెంచిన టీమ్ ఇండియా ఇప్పుడు సెమీఫైనల్ బెర్తు కోసం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన అగమ్యగోచర స్థితిలో పడింది. నేడు జరిగే మ్యాచ్‌లు కేవలం మైదానంలో జరిగే ఆట మాత్రమే కాదు భారత క్రికెట్ భవిష్యత్తును, అభిమానుల ఆశలను తేల్చే 'అగ్నిపరీక్ష'గా మారాయి.

పరాయి గెలుపుపై ఆశలు

క్రీడల్లో ఏ జట్టైనా తన సొంత ప్రతిభతో ముందడుగు వేయాలని కోరుకుంటుంది. కానీ ప్రస్తుతం భారత సమీకరణాలు అలా లేవు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే వెస్టిండీస్ – దక్షిణాఫ్రికా మ్యాచ్ ఫలితంపై భారత్ కళ్లు నిలిపి ఉంచింది. ఇక్కడ దక్షిణాఫ్రికా విజయం సాధిస్తేనే భారత్‌కు సెమీస్ ద్వారాలు తెరుచుకుంటాయి. వెస్టిండీస్ వంటి ప్రమాదకరమైన జట్టును దక్షిణాఫ్రికా కట్టడి చేయగలిగితే, పాయింట్ల పట్టికలో భారత్‌కు మార్గం సుగమం అవుతుంది. ఒకవేళ వెస్టిండీస్ గెలిస్తే మాత్రం భారత్ సెమీస్ ఆశలు దాదాపు నీటి మూటలైనట్లే.

సొంత పోరులో 'భారీ' విజయం అనివార్యం

మరోవైపు జింబాబ్వేతో జరిగే పోరులో భారత్ కేవలం గెలిస్తే సరిపోదు. రన్ రేట్ అనే భూతం వెంటాడకుండా ఉండాలంటే, ఆ గెలుపు 'భారీ' స్థాయిలో ఉండాలి. పసికూనగా భావించే జింబాబ్వేను తక్కువ అంచనా వేయడం గతంలో భారత్‌కు చేదు అనుభవాలను మిగిల్చింది. కాబట్టి బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించి, నెట్ రన్ రేట్‌ను గణనీయంగా పెంచుకోవాల్సిన బాధ్యత సూర్య సేనపై ఉంది. సెమీ ఫైనల్ రేసులో నిలవాలంటే రెండు అంశాలు కలవాలి. ఒకటి భారత్ తన సత్తా చాటడం, రెండు ప్రత్యర్థి వెస్టిండీస్ ఓటమి చెందడం. ఈ రెండూ జరిగితేనే భారత జట్టు సెమీస్ దిశగా ముందడుగు వేయగలదు.

క్రికెట్ అనేది అనిశ్చితికి మారుపేరు. ఇక్కడ గణాంకాలు, అంచనాలు ఎప్పుడైనా తలకిందులు కావచ్చు. అయితే ఒక అగ్రశ్రేణి జట్టుగా భారత్ సెమీస్ చేరాలంటే కేవలం అదృష్టం మీద మాత్రమే కాకుండా, మైదానంలో తిరుగులేని ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. ఒత్తిడిని అధిగమించి జింబాబ్వేపై వీరోచిత విజయం సాధించడంతో పాటు, ఇతర ఫలితాలు అనుకూలించాలని ఆశిద్దాం. నేటి ఫలితాలు భారత క్రికెట్ అభిమానులకు తీపి కబురు అందిస్తాయా లేక నిరాశ మిగులుస్తాయా అన్నది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.