వెస్టిండీస్ తో టెస్టు సిరీస్.. జడేజాకు ప్రమోషన్.. కరుణ్ ఔట్..
ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ ను 2-2 అద్భుతంగా డ్రా చేసిన టీమ్ ఇండియా ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ)లో భాగంగా స్వదేశంలో తొలి టెస్టు సిరీస్ ఆడబోతోంది.
By: Tupaki Desk | 25 Sept 2025 8:00 PM ISTదేశవాళీ క్రికెట్ లో వందల పరుగులు సాధించిన టీమ్ ఇండియా మిడిలార్డర్ బ్యాట్స్ మన్ కరుణ్ నాయర్ కథ ఒక్క సిరీస్ కే ముగిసింది. దాదాపు 8 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చినా.. నేరుగా స్వదేశంలో కాకుండా ఇంగ్లండ్ టూర్ లో ఆడించడం అతడి పాలిట శాపమైంది. మోస్తరుగా రాణించినా సరే... వెస్టిండీస్ తో వచ్చే నెల 2 నుంచి మొదలయ్యే రెండు టెస్టుల సిరీస్ కు ఎంపిక చేయలేదు.
వైస్ కెప్టెన్ జడేజా...
ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ ను 2-2 అద్భుతంగా డ్రా చేసిన టీమ్ ఇండియా ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ)లో భాగంగా స్వదేశంలో తొలి టెస్టు సిరీస్ ఆడబోతోంది. వెస్టిండీస్ తో అక్టోబరు 2 నుంచి అహ్మదాబాద్ లో తొలి టెస్టు మొదలుకానుంది. దీనికోసం గురువారం టెస్టు జట్టును ప్రకటించారు. ఇంగ్లండ్ తో సిరీస్ లో రాణించిన సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు టెస్టు వైస్ కెప్టెన్ గా ప్రమోషన్ లభించింది.
-ఆసియా కప్ లో భాగంగా ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న టీమ్ ఇండియా టెస్టు కెప్టెన్ శుబ్ మన్ గిల్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ భేటీ అయి జట్టును ప్రకటించారు. గిల్ కెప్టెన్సీలోని ఈ జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ కు చోటు దక్కలేదు. ఇంగ్లండ్ తో మ్యాచ్ లో పాదం గాయపడినందున పంత్ కు విశ్రాంతి ఇచ్చారు. అతడి స్థానంలో దేశవాళీల్లో అదరగొడుతున్న వికెట్ కీపర్ బ్యాటర్ నారాయణ్ జగదీశన్ కు చాన్స్ లభించింది. ధ్రువ్ జురెల్ కు ఇతడు బ్యాకప్.
కరుణ్ తో పాటు అతడూ ఔట్...
మిడిలార్డర్ బ్యాటర్ కరుణ్ నాయర్ ను తప్పించి.. దేవదత్ పడిక్కల్ కు చోటిచ్చారు. ఇంగ్లండ్ లో విఫలమైన శార్దూల్ ఠాకూర్ ను కూడా పక్కనపెట్టారు. తెలుగు ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిపై అగార్కర్ ప్రశంసలు కురిపించాడు. అతడు గత సిరీస్ లలో అద్భుతంగా ఆడాడాని, మరిన్ని చాన్స్ లు ఇస్తామని తెలిపాడు. నితీశ్ పై భారీ అంచనాలు పెట్టుకున్నామని చెప్పాడు. స్టార్ పేసర్ షమీ ఫిట్ నెస్ పై తమకు సమాచారం లేదన్నాడు. కరుణ్ అంచనాలను అందుకోనందున పడిక్కల్ ను ఎంపిక చేశామన్నాడు. బుమ్రా రెండు టెస్టులకు అందుబాటులో ఉంటాడని తెలిపాడు.
వీరికి నిరాశే...
టీమ్ ఇండియా తరఫున గత ఏడాది న్యూజిలాండ్ పై ఆడిన సర్ఫరాజ్ ఖాన్ ఫిట్ నెస్ కోసం బాగా శ్రమించాడు. బరువు కూడా తగ్గాడు. కానీ, అతడికి చోటు దక్కలేదు. గత కొన్ని సిరీస్ ల నుంచి జట్టులో ఉంటున్నా.. తుది జట్టులో చోటు దక్కని ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ నూ తీసుకోలేదు.
వెస్టిండీస్ తో 2 టెస్టుల సిరీస్ కు టీమ్ ఇండియా...
శుబ్ మన్ గిల్ (కెప్టెన్), జైశ్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, పడిక్కల్, ధ్రువ్ జురెల్, జడేజా, సుందర్, బుమ్రా, సిరాజ్, అక్షర్ పటేల్, కుల్దీప్, నితీశ్ రెడ్డి, జగదీశన్, ప్రసిద్ధ్ కృష్ణ.
