Begin typing your search above and press return to search.

ప్చ్.. 358 స‌రిపోలేదు.. వ‌న్డే సిరీస్ ఫ‌లితం ఇక మ‌న విశాఖ‌లోనే

ఈ సంవ‌త్స‌రం ప్రారంభంలో జ‌రిగిన చాంపియ‌న్స్ ట్రోఫీ నుంచి... ఏడాది ముగింపు వ‌ర‌కు ఆడిన 13 వ‌న్డేల్లో 10 గెలిచిన టీమ్ ఇండియాకు రాయ్ పూర్ లో అనూహ్య ప‌రాజ‌యం.. ఏకంగా 358 ప‌రుగులు కొట్టినా ప్ర‌త్య‌ర్థి ద‌క్షిణాఫ్రికాను నిలువ‌రించ‌లేక‌పోయింది.

By:  Tupaki Desk   |   4 Dec 2025 12:54 AM IST
ప్చ్.. 358 స‌రిపోలేదు.. వ‌న్డే సిరీస్ ఫ‌లితం ఇక మ‌న విశాఖ‌లోనే
X

ఈ సంవ‌త్స‌రం ప్రారంభంలో జ‌రిగిన చాంపియ‌న్స్ ట్రోఫీ నుంచి... ఏడాది ముగింపు వ‌ర‌కు ఆడిన 13 వ‌న్డేల్లో 10 గెలిచిన టీమ్ ఇండియాకు రాయ్ పూర్ లో అనూహ్య ప‌రాజ‌యం.. ఏకంగా 358 ప‌రుగులు కొట్టినా ప్ర‌త్య‌ర్థి ద‌క్షిణాఫ్రికాను నిలువ‌రించ‌లేక‌పోయింది. బుధ‌వారం ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన రెండో వ‌న్డేలో ద‌క్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో గెలిచింది. మొద‌ట బ్యాటింగ్ కు దిగిన భార‌త్ రుతురాజ్ గైక్వాడ్ (83 బంతుల్లో 105), విరాట్ కోహ్లి (93 బంతుల్లో 102) అద్భుత సెంచ‌రీల‌కు కెప్టెన్ కేఎల్ రాహుల్ (43 బంతుల్లో 66 నాటౌట్) మెరుపు హాఫ్ సెంచ‌రీ తోడ‌వ‌డంతో 358 ప‌రుగులు చేసింది. ఈ ల‌క్ష్యాన్ని స‌ఫారీలు 49.2 ఓవ‌ర్ల‌లో ఛేదించేశారు. గ‌తంలో ఆస్ట్రేలియా కూడా మ‌న జ‌ట్టుపై ఇదే స్కోరును అధిగ‌మించింది. దీంతో మూడు మ్యాచ్ ల వ‌న్డే సిరీస్ 1-1తో స‌మం అయింది. ఈ నెల 6వ తేదీన విశాఖ‌ప‌ట్నంలో మూడో వ‌న్డే జ‌ర‌గ‌నుంది. అందులో గెలిచిన జ‌ట్టు సిరీస్ అందుకుంటుంది. ఇక రెండో వ‌న్డేలో టీమ్ ఇండియా ప‌రాజ‌యం ఊహించ‌నిదే. వ‌రుస‌గా 20వ వ‌న్డేలోనూ టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన మ‌న జ‌ట్టు బ్యాటింగ్ లో రాణించినా బౌలింగ్ లో విఫ‌ల‌మైంది. బుమ్రా, సిరాజ్ లేని పేస్ బౌలింగ్ ను ద‌క్షిణాఫ్రికా సులువుగా ఎదుర్కొంది.

వారి బ్యాటింగ్.. వీరి బౌలింగ్..

టీమ్ ఇండియా బ్యాటింగ్ లో ఓపెన‌ర్ జైశ్వాల్ 38 బంతులు ఆడి 22, వాషింగ్ట‌న్ సుంద‌ర్ 8 బంతులు ఆడి 1, ర‌వీంద్ర జ‌డేజా 27 బంతుల్లో 24 ప‌రుగులు చేశారు. వీరు ముగ్గురూ 73 బంతుల్లో 47 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగారు. ఇక్క‌డే టీమ్ ఇండియా మ‌రో 20 ప‌రుగులు కోల్పోయింద‌ని చెప్ప‌వ‌చ్చు. దీంతో స్కోరు 358 వ‌ద్దనే ఆగింది. అప్ప‌టికీ పెద్ద స్కోరే సాధించినా.. బౌలింగ్ లో ప్రసిద్ధ్ క్రిష్ణ 8.2 ఓవ‌ర్ల‌లో 85 ప‌రుగులు ఇచ్చేశాడు. కుల్దీప్ యాద‌వ్ 10 ఓవ‌ర్ల‌లో 78, హ‌ర్షిత్ రాణా 10 ఓవ‌ర్ల‌లో 70 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నారు. అంటే.. 28.2 ఓవ‌ర్ల‌లో 223 ప‌రుగులు అన్న‌మాట‌. ఫ‌లితంగా ద‌క్షిణాఫ్రికా గెలిచేందుకు అవ‌కాశం చిక్కింది. కీల‌క ఆల్ రౌండ‌ర్ అయిన జ‌డేజాను బ్యాటింగ్ ఆర్డ‌ర్ లో సుంద‌ర్ త‌ర్వాత పంప‌డ‌మే కాక‌.. బౌలింగ్ లో ఏడు ఓవ‌ర్లు మాత్ర‌మే వేయించారు. అప్ప‌టికీ అత‌డు 41 ప‌రుగులే ఇచ్చినా కోటాలోని మిగ‌తా 3 ఓవ‌ర్లు వేయించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. బ్యాటింగ్ లో ప్ర‌మోట్ చేసిన‌ సుంద‌ర్ తో 4 ఓవ‌ర్లు వేయించ‌గా అత‌డు 28 ప‌రుగులు ఇచ్చాడు.

ఆ క్యాచ్ జార‌విడిచి..

ఫీల్డింగ్ లోనూ టీమ్ ఇండియా త‌ప్పులు చేసింది. జైశ్వాలో బౌండ‌రీ లైన్ వ‌ద్ద మార్క్ ర‌మ్ క్యాచ్ ను జార‌విడిచాడు. అప్ప‌టికి అత‌డి స్కోరు 53 మాత్ర‌మే. చివ‌ర‌కు 98 బంతుల్లో 110 ప‌రుగులు చేసిన మార్క్ ర‌మ్ త‌న జ‌ట్టుకు గెలుపు బాట‌ వేశాడు. బేబీ ఏబీ డివిలియ‌ర్స్ గా పిలుచుకునే బ్రెవిస్ 34 బంతుల్లోనే 54 ప‌రుగులు చేశాడు. ఇందులో 5 సిక్స్ లు ఉన్నాయి. వ‌న్డే వండ‌ర్ గా భావిస్తున్న మాథ్యూ బ్రిట్జ్కే 64 బంతుల్లో 68 ప‌రుగుల‌తో ఓవైపు గోడ‌క‌ట్ట‌గా.. కెప్టెన్ బ‌వుమా 48 బంతుల్లో 46 ప‌రుగులు చేసి ద‌క్షిణాఫ్రికా సాధించాల్సిన ర‌న్ రేట్ పెర‌గ‌కుండా చూశాడు. ఇక కీల‌క స‌మ‌యంలో జ‌డేజా వంటి ఫీల్డ‌ర్ కూడా మిస్ ఫీల్డ్ చేయ‌డంతో బంతి ఫోర్ వెళ్లింది.

విశాఖ‌లో త‌ప్పులు దిద్దుకుంటేనే

ఈ నెల 6న విశాఖప‌ట్నంలో జ‌రిగే మ్యాచ్ లో భార‌త్ ప‌లు త‌ప్పులు దిద్దుకోవాల్సి ఉంది. ఓపెన‌ర్ జైశ్వాల్ పూర్తిగా నిరాశ‌ప‌రుస్తున్నాడు. అత‌డి బ‌దులు రుతురాజ్ ను ఓపెనింగ్ కు పంపి.. వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ పంత్ ను తుది జ‌ట్టులో తీసుకుంటే మేలు. బౌలింగ్ లోనూ ప్ర‌సిద్ధ్ స్థానంలో తెలుగు ఆల్ రౌండ‌ర్, విశాఖ లోకల్ బాయ్ నితీశ్ కుమార్ రెడ్డిని ఆడించ‌డం ఉత్త‌మం.