ఇది రైవల్రీ ఎంతమాత్రం కాదు... టీమిండియా దండయాత్ర
దశాబ్దాలు గడుస్తున్నా.. తరాలు మారుతున్నా.. ప్రపంచ కప్‌లో 'భారత జెండా' రెపరెపలాడుతూనే ఉంది. పాక్ మీద గెలుపు బావుటా ఎగురవేస్తూనే ఉన్నాం.
By: A.N.Kumar | 16 Feb 2026 12:36 PM ISTక్రికెట్ ప్రపంచంలో ఎన్నో దేశాల మధ్య పోటీ ఉండవచ్చు.. కానీ భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే అది కేవలం 22 గజాల పిచ్‌పై జరిగే పోరు కాదు.. అది కోట్లాది మంది భారతీయుల ఆత్మగౌరవం, భావోద్వేగం. ముఖ్యంగా ఐసీసీ వరల్డ్ కప్ వేదికగా ఈ రెండు జట్లు తలపడితే.. రికార్డులన్నీ ఒకే వైపు మొగ్గు చూపుతున్నాయి. దశాబ్దాలు గడుస్తున్నా.. తరాలు మారుతున్నా.. ప్రపంచ కప్‌లో 'భారత జెండా' రెపరెపలాడుతూనే ఉంది. పాక్ మీద గెలుపు బావుటా ఎగురవేస్తూనే ఉన్నాం.
చారిత్రక ఆధిపత్యం.. 1992 నుంచి నేటి వరకు
1992లో సిడ్నీ వేదికగా మొదలైన ఈ విజయయాత్ర నేటికీ అప్రతిహతంగా కొనసాగుతోంది. ఆనాడు పాకిస్తాన్ ట్రోఫీ గెలిచినప్పటికీ భారత్ చేతిలో ఓటమిని మాత్రం తప్పించుకోలేకపోయింది. 1996లో ప్రసాద్ వేసిన పదునైన బంతులు, 2003లో సచిన్ టెండూల్కర్ ఆడిన విశ్వరూపం.. 2011 సెమీఫైనల్ ఉత్కంఠ.. ఇలా ప్రతి సందర్భంలోనూ టీమిండియా తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది.
ఒక్క షాక్.. మళ్ళీ పాత కథే!
2021 టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ సాధించిన ఒక్క విజయం ఆ జట్టులో ఏదో మార్పు వస్తుందని భావించేలా చేసింది. కానీ అది కేవలం ఒక 'యాక్సిడెంట్' మాత్రమేనని భారత్ తర్వాతి మ్యాచ్‌ల్లో నిరూపించింది. 2022లో మెల్‌బోర్న్ వేదికగా విరాట్ కోహ్లీ ఆడిన ఆ అద్భుత ఇన్నింగ్స్ మొదలుకొని.. ఇటీవలి 2026 మ్యాచ్‌ల వరకు భారత్ మళ్ళీ తన పాత ఆధిపత్యాన్ని పునరావృతం చేసింది.
ప్రతిభ ఒక్కటే సరిపోదు.. మానసిక ధైర్యం ముఖ్యం
పాకిస్తాన్ జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ భారత్‌తో పోలిస్తే వారు ఎక్కడ విఫలమవుతున్నారంటే దీనికి సమాధానం ఒత్తిడి. టీమిండియా బలం ఏంటంటే.. క్లిష్ట పరిస్థితుల్లో కూడా సంయమనం కోల్పోకుండా జట్టుగా సమిష్టి ప్రదర్శన ఇవ్వడం... పాక్ బలహీనత ఏంటంటే భారీ అంచనాల మధ్య ఒత్తిడికి చిత్తై, కీలక సమయాల్లో తడబడటం... బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా ఏ విభాగంలో చూసినా భారత్ చూపిస్తున్న సమతూకం ముందు పాక్ బౌలర్ల వేగం పని చేయడం లేదు.
అంకెల్లో ఆధిపత్యం
ప్రపంచ కప్ చరిత్రలో (వన్డే & టీ20 కలిపి) ఇప్పటివరకు జరిగిన 17 ముఖాముఖి పోరుల్లో భారత్ 16 సార్లు జయకేతనం ఎగురవేసింది. పాకిస్తాన్ కేవలం ఒకే ఒక్క విజయం దగ్గరే ఆగిపోయింది. ఈ 16-1 గణాంకం చూస్తుంటే పాకిస్తాన్‌కు టీమిండియాను కొట్టే 'దమ్ము' ఉందా? అనే ప్రశ్నకు సమాధానం స్పష్టంగా కనిపిస్తోంది.
వరల్డ్ కప్ వేదికపై భారత్ కేవలం క్రికెట్ ఆడదు.. తన ఆధిపత్యాన్ని శాసిస్తుంది. చరిత్ర పుటలు తిరగేసినా భవిష్యత్తు వైపు చూసినా.. ఈ 'మహా సంగ్రామం'లో భారత్ ఒక అజేయ శక్తిగా నిలుస్తోంది. పాకిస్తాన్ తన వ్యూహాలను మార్చుకోవచ్చేమో కానీ భారత్ సృష్టించిన ఈ 'వరల్డ్ కప్ రికార్డు'ను చెరపడం మాత్రం ప్రస్తుతానికి అసాధ్యమనే చెప్పాలి.
