భారత్ లో మూడు కీలక క్రికెట్ టోర్నీలు.. పాకిస్థాన్ జట్టు వస్తుందా?
ద్వైపాక్షిక సిరీస్ కోసం భారత్ లో పాకిస్థాన్ జట్టు పర్యటించక పుష్కర కాలం దాటిపోయింది..
By: Tupaki Desk | 25 April 2025 10:00 PM ISTద్వైపాక్షిక సిరీస్ కోసం భారత్ లో పాకిస్థాన్ జట్టు పర్యటించక పుష్కర కాలం దాటిపోయింది.. 2012 డిసెంబరు- 2013 జనవరిలో మూడు వన్డేలు, రెండు టి20లు ఆడేందుకు భారత్ కు వచ్చింది పాక్ జట్టు. వాస్తవానికి దీనికి నాలుగేళ్ల ముందే ముంబైపై ఉగ్రవాదుల దాడి జరిగింది. అప్పటికే ద్వైపాక్షిక సంబంధాలు క్షీణించినా అప్పటి యూపీఏ ప్రభుత్వం మాత్రం పాకిస్థాన్ జట్టు మన దేశంలో పర్యటించేందుకు అనుమతి ఇచ్చింది. భారత్ మాత్రం 2005/06లో పాకిస్థాన్ లో పర్యటించింది.
దాదాపు 20 ఏళ్ల నుంచి పాకిస్థాన్ గడ్డపై భారత ఆటగాళ్లు కాలు మోపిందే లేదు. ఇకమీదట కూడా ఆ పరిస్థితి లేదు. అయితే, పాకిస్థాన్ మాత్రం రెండు సార్లు భారత్ కు రాక తప్పలేదు.
2011లో భారత్ లో జరిగిన వన్డే ప్రపంచ కప్ లో పాల్గొన్నది పాకిస్థాన్ జట్టు. 2023లోనూ భారత్ కు వచ్చింది. టీమ్ ఇండియా మాత్రం వెళ్లింది లేదు. వాస్తవానికి చాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్ లో జరిగింది. భారత్ మాత్రం దుబాయ్ లో మ్యాచ్ లు ఆడింది.
మరిప్పుడు పెహల్గాం ఉగ్ర దాడి తర్వాత భారత్ పాకిస్థాన్ తో ద్వైపాక్షిక సిరీస్ లు ఆడే ఆలోచనలో లేదు. అంతేకాదు.. లీగ్ దశల్లోనూ ఐసీసీ టోర్నీల్లో ఆడే ఆలోచన లేదని తేల్చిచెప్పింది.
అయితే, భారత్ లో 2026లో టి20 ప్రపంచ కప్ ఉంది. ఇది ఐసీసీ టోర్నీ. మరోవైపు ఆసియా కప్ కూడా ఉంది. ఇది ఐసీసీ టోర్నీ కాదు. ఈ మ్యాచ్ లను తటస్థ వేదికపై నిర్వహించాలని బీసీసీఐ-ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) మొన్నటివరకు భావించాయి.
భారత్ లోనే మహిళల ప్రపంచ కప్ సెప్టెంబరు- అక్టోబరులో జరగాల్సి ఉంది. దీంట్లోనూ పాకిస్థాన్ పాల్గొనాల్సి ఉంది. మరిప్పుడు పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పరిస్థితులు మారాయి.
పాకిస్థానీలను భారత్ నుంచి వెళ్లిపోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అసలు ఆ దేశ పౌరులకు వీసాలు ఇచ్చే ఆలోచనలోనే లేదు. మరి ఈ నేపథ్యంలో క్రికెట్ లో ఏం జరుగుతుందో చూడాలి.
