సమీప భవిష్యత్ లో పాకిస్థాన్ తో క్రికెట్ ఉండదు.. బీసీసీఐ సంచలనం
ఎప్పుడో 2012-13లో జరిగింది భారత్-పాకిస్థాన్ మధ్య ముఖాముఖి క్రికెట్ సిరీస్.. అప్పటికి నాలుగేళ్ల ముందే ముంబై దాడులతో పాకిస్థాన్ తో సంబంధాలు క్షీణించాయి.
By: Tupaki Desk | 24 April 2025 3:06 PM ISTఎప్పుడో 2012-13లో జరిగింది భారత్-పాకిస్థాన్ మధ్య ముఖాముఖి క్రికెట్ సిరీస్.. అప్పటికి నాలుగేళ్ల ముందే ముంబై దాడులతో పాకిస్థాన్ తో సంబంధాలు క్షీణించాయి. కానీ, క్రికెట్ విషయంలో నాటి యూపీఏ ప్రభుత్వం మాత్రం తీవ్ర నిర్ణయాలు తీసుకోలేదు. కాస్త ఉదారంగా వ్యవహరించడంతో 2012-13లో భారత్-పాక్ ద్వైపాక్షిక సిరీస్ జరిగింది.
కానీ, ఆ తర్వాత రెండు దేశాల జట్లు తిరిగి ముఖాముఖి క్రికెట్ లో తలపడనే లేదు. అప్పుడప్పుడు ఈ మాట వినిపించినా ముందడుగు పడలేదు. చివరకు 2014లో మోదీ ప్రభుత్వం వచ్చాక అసలు చాన్సే లేకుండా పోయింది.
రెండు నెలల కిందట జరిగిన చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇచ్చింది. కానీ, ఆ టోర్నీకి భారత్ వెళ్లనే లేదు. దుబాయ్ లో మ్యాచ్ లు ఆడి అక్కడే టైటిల్ కొట్టింది.
ఇప్పుడు పెహల్గాం దాడి తర్వాత పరిస్థితులు ఇక చెప్పనలవి కానట్లుగా మారాయి. దీంతో సమీప భవిష్యత్ లో భారత్-పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరగడం కష్టమే అని స్పష్టమైంది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కూడా ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకుంది.
భారత్-పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ అనే మాట ఉండబోదని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తేల్చి చెప్పారు. ప్రస్తుతం భారత్-పాక్ కేవలం ఐసీసీ టోర్నీల (అంటే ప్రపంచ కప్ లు, చాంపియన్స్ ట్రోఫీ)లో మాత్రమే ఎదురుబొదురు ఆడుతున్నాయి. పహెల్గామ్ దాడి తర్వాత అసలు ద్వైపాక్షిక సిరీస్ లే ఉండబోవని స్పష్టం అవుతోంది.
