Begin typing your search above and press return to search.

ఆపరేషన్ సిందూర్ తర్వాత.. భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్.. ఎప్పుడు? ఎక్కడ?

క్రికెట్ లో మరే రెండు జట్లు తలపడినా రానంత ఊపు.. భావోద్వేగం.. భారత్-పాక్ మ్యాచ్ కు ఉంటుంది.. ఈ రెండు జట్లు ఏదైనా టోర్నీలో ఒక్క మ్యాచ్ లో తలపడినా చాలు మొత్తం టోర్నీకే హైలైట్ అవుతుంది

By:  Tupaki Desk   |   2 July 2025 1:00 PM IST
ఆపరేషన్ సిందూర్ తర్వాత.. భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్.. ఎప్పుడు? ఎక్కడ?
X

క్రికెట్ లో మరే రెండు జట్లు తలపడినా రానంత ఊపు.. భావోద్వేగం.. భారత్-పాక్ మ్యాచ్ కు ఉంటుంది.. ఈ రెండు జట్లు ఏదైనా టోర్నీలో ఒక్క మ్యాచ్ లో తలపడినా చాలు మొత్తం టోర్నీకే హైలైట్ అవుతుంది. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయి.. బ్లాక్ లోనూ రెట్టింపును మించి రేటు పెట్టి కొనుక్కుంటారు.. ప్రపంచంలో ఎక్కడ ఉన్న భారత్, పాక్ జాతీయులతో పాటు ఇతర దేశాల వారూ ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ను ఎంజాయ్ చేస్తారనడంలో సందేహం లేదు.

అయితే, ఉగ్రవాదానికి పాక్ ఊతం ఇస్తున్నందుకు ఆ దేశంతో ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలను తెంచుకుంది భారత్. కేవలం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టోర్నీల్లో మాత్రమే రెండు దేశాల జట్లు తలపడుతున్నాయి. ఏప్రిల్ లో పెహల్గాం దాడి తర్వాత పరిస్థితులు మరింత దిగజారాయి. ఈ నేపథ్యంలో పాక్ తో ఐసీసీ టోర్నీల్లోనూ లీగ్ దశలో తలపడేది లేదని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నిర్ణయించింది. ఇలాంటి సమయంలో రెండు జట్ల మధ్య మళ్లీ మ్యాచ్ ఎప్పుడు అనేది సందిగ్ధంగా మారింది.

సెప్టెంబరులో ఆసియా కప్ జరగనుంది. ఇది యూఏఈలో జరుగుతుంది. సెప్టెంబరు 5 నుంచి టి20 ఫార్మాట్లో ఈ టోర్నీ మొదలవనుంది. సెప్టెంబరు 7న భారత్-పాక్ మ్యాచ్ నిర్వహించనున్నారు. పెహల్గామ్ ఉగ్రదాడి తదనంతరం ఆపరేషన్ సిందూర్ తో ఇరు దేశాల సంబంధాలు అత్యంత బలహీన స్థాయికి పడిపోయాయి. మళ్లీ రెండు దేశాల మధ్య క్రికెట్ జరుగుతుందా? అనే పరిస్థితులు తలెత్తాయి. కానీ, అవన్నీ పక్కకు వెళ్లి కేవలం నాలుగు నెలల్లోనే క్రికెట్ మ్యాచ్ జరుగుతుండడం గమనార్హం. అయితే, ఇది ఐసీసీ టోర్నీనా? కాదా? అనేది చూడాలి. నాకౌట్ దశ నుంచి మాత్రమే పాకిస్థాన్ తో ఆడతామన్న ప్రతిపాదన ఏమైంది అనేది కూడా చూడాలి.

దౌత్యపరంగా, ఆర్థికంగా పాకిస్థాన్ అనే శత్రువును అన్నివిధాల దెబ్బకొడుతున్న భారత్.. క్రికెట్ లో మాత్రం అనవసర మినహాయింపులు ఇవ్వడం సరికాదు. అయితే, ఆసియా కప్ గురించి ఇప్పటివరకు వచ్చినవి ఊహాగానాలే. అధికారిక ప్రకటనతోనే ఓ అంచనాకు రాగలం.