Begin typing your search above and press return to search.

రిఫ‌రీ పైక్రాఫ్ట్ పై బ్యాన్ ను అడ్డుకున్న ఒంటిచేత్తో ఇండియ‌న్ సీఈవో

పైక్రాఫ్ట్ ను రిఫ‌రీగా కొన‌సాగిస్తున్నందుకు బుధ‌వారం యూఏఈతో మ్యాచ్ ను బాయ్ కాట్ చేస్తామంటూ.. పాక్ బెదిరించింది. అదే చేసి ఉంటే ఆసియా క‌ప్ నుంచి ఔట్ అయ్యేది.

By:  Tupaki Desk   |   19 Sept 2025 6:00 AM IST
రిఫ‌రీ పైక్రాఫ్ట్ పై బ్యాన్ ను అడ్డుకున్న ఒంటిచేత్తో ఇండియ‌న్ సీఈవో
X

అది యుద్ధ‌మే కానీ.. క్రికెట్ పోటీలే కానీ.. ప్ర‌పంచ వేదిక‌లే కానీ.. పాకిస్థాన్ కు ఇండియా చేతిలో ఎక్క‌డైనా ఓట‌మేన‌ని మ‌రోసారి రుజువైంది. తాజాగా ఆసియా క‌ప్ లోనూ మ‌న జ‌ట్టు చేతిలో పాకిస్థాన్ ప‌రాభ‌వం పాలైంది. కానీ, దానిని క‌ప్పిపుచ్చుకునేందుకా? అన్న‌ట్లు రిఫ‌రీ వివాదాన్ని రేపింది. భార‌త ఆట‌గాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వ‌కుండా ఉండేందుకు రిఫ‌రీ ఆండీ పైక్రాఫ్ట్ కార‌ణం అనే వింత వాద‌న‌ను తెర‌పైకి తెచ్చింది. అత‌డిని ఆసియా క‌ప్ నుంచి పంపించేయాల‌ని మంకు ప‌ట్టు ప‌ట్టింది. కానీ, అస‌లేం జ‌రిగిందో తెలిసిన అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మాత్రం పైక్రాఫ్ట్ ను త‌ప్పించేదే లేదు అని తేల్చింది. దీనివెనుక కూడా ఓ భార‌తీయుడి పాత్ర ఉండడం విశేషం.

బాయ్ కాట్ నుంచి మైదానానికి

పైక్రాఫ్ట్ ను రిఫ‌రీగా కొన‌సాగిస్తున్నందుకు బుధ‌వారం యూఏఈతో మ్యాచ్ ను బాయ్ కాట్ చేస్తామంటూ.. పాక్ బెదిరించింది. అదే చేసి ఉంటే ఆసియా క‌ప్ నుంచి ఔట్ అయ్యేది. మ‌ళ్లీ పైక్రాఫ్ట్ సారీ చెప్పాడంటూ, మైదానంలోకి వ‌చ్చింది. ఆ సారీ అబ‌ద్ధం అనేది తెలుస్తోంది. బంతి ఇప్పుడు ఐసీసీ కోర్టులో ఉంది.

అత‌డే లేకుంటే...

పాకిస్థాన్ డిమాండ్ మేర‌కు పైక్రాఫ్ట్ ను త‌ప్పించేవారేమో..? అయితే, ఓ వ్య‌క్తి అడ్డుప‌డ్డాడు. అత‌డు భార‌తీయుడైన ఐసీసీ సీఈవో సంజోగ్ గుప్తా. పైక్రాఫ్ట్ పై చ‌ర్య‌ల‌ను సంజోగ్ ఒంటిచేత్తో అడ్డుకున్న‌ట్లు మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల‌ స‌మాచారం ప్ర‌కారం.. అంత‌ర్గ‌త విచార‌ణ చేప‌ట్టిన ఐసీసీ వివాదంలో పైక్రాఫ్ట్ త‌ప్పు ఏమీ లేద‌ని తేల్చింది. అత‌డు నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించ‌లేద‌నే అంచ‌నాకు వ‌చ్చింది. ఇదంతా సంజోగ్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లోనే జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. అందుక‌నే పైక్రాఫ్ట్ చ‌ర్య‌ల నుంచి బ‌య‌ట‌ప‌డ్డార‌ని అంటున్నారు.

సంజోగ్ కొన్ని నెలల కింద‌ట‌నే ఐసీసీ సీఈవో అయ్యాడు. మీడియా రంగంలో రెండు ద‌శాబ్దాల‌కు పైగా అనుభ‌వం ఉన్న‌వాడు. త‌న వ్యూహ చ‌తుర‌త‌కు మంచి పేరుంది. భార‌త్ లో స్పోర్ట్స్ బ్రాడ్ కాస్టింగ్ లో సంజోగ్ పాత్ర గురించి గొప్ప‌గా చెబుతుంటారు.