ఆసియా కప్ లో భారత్-పాక్.. రూ.1400 కోట్ల మీడియా డీల్.. రద్దయితే?
కానీ, ఇంతలోనే ఆసియా కప్ (టి20 ఫార్మాట్) వచ్చింది. అసలు ఇది ఐసీసీ టోర్నీ కూడా కాదు. అయినా, భారత్ -పాకిస్థాన్ తలపడతాయని కథనాలు వస్తున్నాయి.
By: Tupaki Desk | 16 Aug 2025 1:14 AM ISTసరిగ్గా నాలుగు నెలల కిందట జరిగిన పెహల్గాం ఉగ్రదాడి భారత్-పాక్ సంబంధాలను అత్యంత దారుణ స్థితికి దిగజార్చింది. దీని తర్వాత పాకిస్థాన్ తో ఎలాంటి ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగించబోమని భారత్ తీవ్రస్థాయి హెచ్చరికలు పంపింది. చివరకు క్రికెట్ లోనూ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టోర్నీల్లో మాత్రమే అదీ నాకౌట్ దశ నుంచి మాత్రమే ఆడతామని భారత్ ప్రకటించింది. కానీ, ఇంతలోనే ఆసియా కప్ (టి20 ఫార్మాట్) వచ్చింది. అసలు ఇది ఐసీసీ టోర్నీ కూడా కాదు. అయినా, భారత్ -పాకిస్థాన్ తలపడతాయని కథనాలు వస్తున్నాయి.
అంతలోనే ఏమారింది..?
క్రికెట్ ను డబ్బు ప్రభావితం చేస్తోందా? అంటే... కాదని చెప్పలేం. అయితే, అత్యంత ధనిక బోర్డు అయిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కి అంత అవసరం ఏముంది..? ఈ ప్రశ్న ఎందుకంటే... నాలుగు నెలలు కూడా కాకుండానే, పాకిస్థాన్ తో క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు ప్రయత్నాలు జరుగుతుండడమే.
ఆసియా కప్ లో ఆడడం అవసరమా?
వచ్చే నెల 9 నుంచి మొదలుకానున్న ఆసియా కప్ లో భారత్ సహా 8 జట్లు తలపడుతున్నాయి. ఇందులో భారత్ పాల్గొంటుంది అనే కథనాలు వస్తున్నాయి. అదే జరిగితే పాకిస్థాన్ తో మూడుసార్లు తలపడాల్సి ఉంటుంది. లీగ్, నాకౌట్, ఫైనల్స్ లో ఆడాల్సి వస్తుంది. దీంతోనే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అసలు ఐసీసీ టోర్నీ కాకున్నా ఇందులో పాకిస్థాన్ తో ఆడకపోతే ఏం పోతుందని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
డబ్బుకు లోకం దాసోహమా...?
భారత్-పాక్ మ్యాచ్ లకు కారణం.. డబ్బు అని తెలుస్తోంది. మీడియా నివేదికల ప్రకారం బలమైన ఆర్థిక కారణాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఆసియా కప్ మీడియా హక్కుల విలువ రూ.1,400 కోట్లు అట. భారత్-పాక్ గరిష్ఠంగా మూడుసార్లు తలపడే చాన్స్ ఉంది. అందుకే ఇంత భారీ రేటు పెట్టారు. ఈ ప్రకారం.. టాప్ జట్లన్నీ టోర్నీలో ఆడితే భారీగా డబ్బులు పొందుతాయి. ఒకవేళ భారత్ ఆడకుంటే టోర్నీనే కళ తప్పుతుంది. ఈ ప్రకారం చూసినా భారత్-పాక్ మ్యాచ్ లు జరగడం చాలా ముఖ్యం. అందుకే ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ లు జరిగేలా బలమైన ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
