టీమిండియాకు హ్యాట్సాఫ్.. పాకిస్థాన్ దిగ్భ్రాంతి
ఆసియా కప్‌లో భారత్–పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పటిలాగే హైటెన్షన్ వాతావరణంలో జరిగింది.
By: Tupaki Desk | 15 Sept 2025 12:08 PM ISTఆసియా కప్‌లో భారత్–పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పటిలాగే హైటెన్షన్ వాతావరణంలో జరిగింది. అయితే ఈసారి కేవలం ఆట మాత్రమే కాదు… ఆటకు ముందు, ఆట తర్వాత జరిగిన పరిణామాలే హాట్‌టాపిక్‌గా మారాయి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు పాకిస్థాన్ ప్లేయర్లతో కరచాలనం (హ్యాండ్‌షేక్) చేయకపోవడం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
షోయబ్ అక్తర్ స్పందన
టీమిండియా అద్భుత విజయంపై పాక్ మాజీ స్పీడ్‌స్టర్ షోయబ్ అక్తర్ ప్రశంసల వర్షం కురిపించాడు. “నాకు మాటలు రావడం లేదు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని అనుకున్నా. కానీ ఇది బాధాకరం. అయినప్పటికీ టీమిండియా చూపిన ప్రతిభకు హ్యాట్సాఫ్. అయితే రాజకీయాలను క్రీడల్లోకి తేవద్దు. కరచాలనం జరిగి ఉంటే బాగుండేది. ఇది క్రీడ, గొడవలను మరిచిపోవాలి’’ అంటూ అక్తర్ వ్యాఖ్యానించాడు.
ఏసీసీ ఎదుట పాక్ నిరసన?
భారత ఆటగాళ్లు షేక్‌హ్యాండ్ చేయకపోవడంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) ఎదుట అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు, ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌తో ఆడకూడదని టీమిండియా అభిమానులు డిమాండ్ చేసినా, ఐసీసీ–ఏసీసీ నియమాలను గౌరవిస్తూ భారత జట్టు మ్యాచ్‌లో పాల్గొంది. “మేం కేవలం క్రికెట్ ఆడటానికే వచ్చాం’’ అంటూ సూర్యకుమార్ యాదవ్ కూడా స్పష్టం చేశాడు.
పాక్ బ్యాటింగ్‌పై అక్రమ్ ఆగ్రహం
మరోవైపు, మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాటింగ్ విఫలమైందని ఆ దేశ మాజీ కెప్టెన్ వసీమ్ అక్రమ్ తీవ్రంగా విమర్శించాడు. “కుల్‌దీప్ యాదవ్ బౌలింగ్‌ను అస్సలు రీడ్ చేయలేదు. ప్రతి రెండో బంతిని స్వీప్ కొట్టాలని ప్రయత్నించారు. ఇది వారి నిర్లక్ష్యం. సునీల్ గావస్కర్ కూడా ముందే చెప్పినట్లే… బంతి పిచ్ తాకే వరకూ గమనించకపోతే కుల్‌దీప్‌ను ఎదుర్కోవడం అసాధ్యం’’ అని వ్యాఖ్యానించాడు.
టీమిండియా కేవలం మైదానంలోనే కాకుండా, మైదానం బయట కూడా గట్టి సందేశం ఇచ్చినట్లు అభిమానులు భావిస్తున్నారు. ఉగ్రవాదంపై వ్యతిరేకతను చూపుతూ కరచాలనం నిరాకరించిన నిర్ణయాన్ని చాలామంది ప్రశంసిస్తున్నారు. మరోవైపు, క్రికెట్‌ను రాజకీయాలతో ముడిపెట్టొద్దని షోయబ్ అక్తర్ పిలుపు ఇవ్వడం కూడా చర్చనీయాంశమైంది. ఏది ఏమైనా… ఆసియా కప్‌లో భారత్ విజయం, పాక్ వైఫల్యం రెండు దేశాల్లోనూ పెద్ద చర్చకు కారణమయ్యాయి.
