భారత్-పాక్ క్రికెట్.. ’లెజెండరీ‘ మలుపులు..సోషల్ మీడియా గెలుపు
భారత్-పాక్ క్రికెట్ అంటే ఎక్కడైనా ఎప్పుడైనా క్రేజ్ మామూలుగా ఉండదు.. కానీ, అప్పట్లో ముంబై ఉగ్రదాడి.. ఇటీవలి పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పరిస్థితులు మారిపోయాయి.
By: Tupaki Desk | 20 July 2025 4:42 PM ISTభారత్-పాక్ క్రికెట్ అంటే ఎక్కడైనా ఎప్పుడైనా క్రేజ్ మామూలుగా ఉండదు.. కానీ, అప్పట్లో ముంబై ఉగ్రదాడి.. ఇటీవలి పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పరిస్థితులు మారిపోయాయి. పెహల్గాంలో పర్యటకులను టార్గెట్ చేసి మరీ చంపడంతో పాకిస్థాన్ తో క్రికెట్లో అన్ని స్థాయిల సంబంధాలను తెంచుకుంటున్నట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఇండియా ప్రకటించింది. ఐసీసీ టోర్నీల్లో నాకౌట్ మ్యాచ్ ల దశ నుంచే పాక్ తో ఆడతామని కూడా తెలిపింది. కానీ, ఈ మధ్యలో వరల్డ్ చాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్-25) అంటూ టోర్నీ పెట్టి రెండు దేశాల రిటైర్డ్ క్రికెటర్లతో మ్యాచ్ నిర్వహణ చేపట్టడం తీవ్ర వివాదానికి దారితీసింది. పెహల్గాం దాడి జరిగి మూడు నెలలు కూడా కాలేదు. అంతలోనే భారత్ వైఖరి మారిందా? అంటూ శివసేన (ఉద్ధవ్ థాక్రే) ఎంపీ ఒకరు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. దీనికితోడు సోషల్ మీడియా కూడా తగులుకుంది.
ఈ దెబ్బకే ఇంగ్లండ్ లోని బర్మింగ్ హామ్ ఎడ్జ్ బాస్టన్ మైదానంలో ఆదివారం జరగాల్సిన డబ్ల్యూసీఎల్ భారత్-పాక్ మ్యాచ్ రద్దయింది. ఈ టోర్నీలో టీమ్ ఇండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ భారత జట్టుకు కెప్టెన్. సురేశ్ రైనా, యూసుఫ్ పఠాన్, హర్బజన్, శిఖర్ ధావన్ సహా పలువురు మాజీలు సభ్యులు. తొలి మ్యాచ్ పాక్ తోనే ఉంది. అయితే, పెహల్గాం ఉదంతాన్ని మర్చిపోయి అప్పుడే పాక్ తో మ్యాచ్ ఆడతారా? ఇదేనా మీ దేశభక్తి అంటూ నెటిజన్లు మండిపడ్డారు. చివరకు భారత మాజీలు మ్యాచ్ ఆడేందుకు నిరాకరించారు.
మరి ఆసియా కప్..? టి20 ప్రపంచకప్?
వచ్చే సెప్టెంబరులో ఆసియా కప్ జరగాల్సి ఉంది. ఆపై కొన్ని నెలలకు టి20 ప్రపంచ కప్ కూడా ఉంది. మరి అప్పుడేం చేస్తారు..? అసలు పాకిస్థాన్ ను ఆహ్వానిస్తారా? అనే ప్రశ్న వస్తోంది. ఈ రెండు టోర్నీల విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే, ఆసియా కప్ ఆతిథ్య హక్కులు మన దగ్గరే ఉన్నాయి. టోర్నీ విషయమై బంగ్లాదేశ్ లో వచ్చే వారం సమావేశానికి భారత్ వెళ్లడం లేదు. ఈ టోర్నీని యూఏఈలో నిర్వహించాలని భావిస్తున్నారు. కానీ, భారత్ పాల్గొనడంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇక 2026 టి20 ప్రపంచ కప్ నకు పాక్ ను ఆహ్వానించడం అనేది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
