Begin typing your search above and press return to search.

అరెరె.. క్రికెట్ ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్.. టీమ్ ఇండియా చేజారె..?

టెస్టులకు అంటూ ప్రత్యేకంగా ప్రపంచ కప్ నిర్వహించడం కష్టం కాబట్టి.. ఆయా దేశాలు ఆడే సిరీస్ లనే డబ్ల్యూటీసీ సైకిల్ కింద లెక్కిస్తూ పాయింట్లు ఇచ్చి టాప్ 2లోని జట్లకు ఫైనల్స్ నిర్వహిస్తున్నారు.

By:  Tupaki Desk   |   14 Jun 2025 4:33 PM IST
అరెరె.. క్రికెట్ ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్.. టీమ్ ఇండియా చేజారె..?
X

ప్రపంచ క్రికెట్ లో బలమైన జట్టు అయిన టీమ్ ఇండియా ఇప్పటివరకు రెండు వన్డే ప్రపంచ కప్ లు గెలిచింది.. రెండు టి20 ప్రపంచ కప్ లు గెలిచింది.. మూడుసార్లు చాంపియన్స్ ట్రోఫీని నెగ్గింది.. ఇవన్నీ పరిమిత ఓవర్ల ఫార్మాట్ లు. మరి క్రికెట్ సంప్రదాయ ఫార్మాట్ అయిన టెస్టుల్లో ప్రపంచ చాంపియన్ సంగతి? వన్డేలు, టి20లకు ప్రపంచ కప్ లు ఉన్నట్లుగానే టెస్టులకూ ప్రపంచ విజేత ట్యాగ్ ఉండాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిందే ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ). టెస్టులకు అంటూ ప్రత్యేకంగా ప్రపంచ కప్ నిర్వహించడం కష్టం కాబట్టి.. ఆయా దేశాలు ఆడే సిరీస్ లనే డబ్ల్యూటీసీ సైకిల్ కింద లెక్కిస్తూ పాయింట్లు ఇచ్చి టాప్ 2లోని జట్లకు ఫైనల్స్ నిర్వహిస్తున్నారు.

-2019-21 డబ్ల్యూటీసీ సైకిల్ లో భారత్, న్యూజిలాండ్ టాప్ 2లో వచ్చాయి. దీంతో ఆ రెండు జట్ల మధ్య క్రికెట్ మక్కా లార్డ్స్ మైదానంలో ఫైనల్ నిర్వహించారు. 2019 వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్లో టీమ్ ఇండియాను దెబ్బకొట్టిన న్యూజిలాండ్.. డబ్ల్యూటీసీ ఫైనల్ లోనూ ఓడించి.. చాంపియన్ గద (విజేతకు ఇచ్చే ట్రోఫీ)ను ఎత్తుకెళ్లిపోయింది.

-2021-23 డబ్ల్యూటీసీ సైకిల్ లో టీమ్ ఇండియా అద్భుతంగా ఆడి ఫైనల్ కు చేరింది. ఆస్ట్రేలియాతో లార్డ్స్ లో ఫైనల్లో సగం మ్యాచ్ వరకు పోటీ ఇచ్చిన జట్టు ఆ తర్వాత చేతులెత్తేసింది. దీంతోపాటు 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో సెంచరీతో టీమ్ ఇండియాను దెబ్బకొట్టిన ఆస్ట్రేలియా బ్యాట్స్ మన్ ట్రావిస్ హెడ్ డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ సెంచరీతో చెలరేగి మరోసారి భారత్ కు గదను దూరం చేశాడు.

-ఇక 2023-25 డబ్ల్యూటీసీ సైకిల్ లో టీమ్ ఇండియా మొదటినుంచి టాప్ లో ఉంది. ఓ దశలో ఫైనల్ బెర్తు దాదాపు ఖాయం అయింది. కానీ, స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగిన మూడు టెస్టుల సిరీస్ లో ఎన్నడూ లేనివిధంగా క్లీన్ స్వీప్ కావడం పెద్ద దెబ్బకొట్టింది. ఆపై ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టెస్టుల బోర్డర్-గావస్కర్ సిరీస్ లో 1-3తో ఓడిపోవడంతో దారులు మూసుకుపోయాయి. న్యూజిలాండ్ వంటి జట్టును స్వదేశంలో 3-0తో ఓడించే సామర్థ్యం టీమ్ ఇండియా సొంతం. కానీ, తుది ఫలితం రివర్స్ కావడం భారీ దెబ్బకొట్టింది.

-ఇక వరుసగా ఏడు టెస్టులు గెలిచిన దక్షిణాఫ్రికా అనూహ్యంగా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తును కొట్టేసింది. ఇప్పడు ఆస్ట్రేలియాను ఫైనల్లో ఓడించి గద అందుకుంటోంది. ఒకవేళ టీమ్ ఇండియా గనుక ఫైనల్ కు చేరి ఉంటే ఆస్ట్రేలియాను ఓడించేదేమో? తొలిసారిగా ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ నూ గెలుచుకునేదేమో? కానీ, విధి మరోలా ఉంది. దక్షిణాఫ్రికాను చరిత్రలో తొలిసారి ప్రపంచ చాంపియన్ ను చేస్తోంది.