మ్యాచ్ నిలిపివేయడం *చీకటి* నిర్ణయం.. అంపైర్లపై కామెంటేటర్ల ఫైర్
టార్గెట్ 374... ఓ దశలో స్కోరు 332/4. భారత్ పై ఐదో టెస్టుల ఇంగ్లండ్ దే గెలుపు అనే భావన... కానీ, టీమ్ఇండియా బౌలర్లు బలంగా పుంజుకొన్నారు.
By: Tupaki Desk | 4 Aug 2025 4:30 PM ISTటార్గెట్ 374... ఓ దశలో స్కోరు 332/4. భారత్ పై ఐదో టెస్టుల ఇంగ్లండ్ దే గెలుపు అనే భావన... కానీ, టీమ్ఇండియా బౌలర్లు బలంగా పుంజుకొన్నారు. పేసర్ ప్రసిద్ధ్ క్రిష్ణ.. వరుసగా జాకబ్ బెతెల్ (5), సెంచరీ వీరుడు జో రూట్ ను ఔట్ చేసి జట్టులో సంతోషం నింపాడు. దీంతో టీమ్ఇండియా మళ్లీ పోటీకి వచ్చింది. ఇక అక్కడినుంచి మొదలైంది మరో రకం ఆట. సిరాజ్, ప్రసిద్ధ్ కట్టుదిట్టమైన బంతులతో జేమీ స్మిత్, ఓవర్టన్ లను బెంబేలెత్తించారు. పరుగులు చేయడం చాలా కష్టమయింది. ఆ సమయంలో ప్రతి బంతికీ వికెట్ దక్కేలా కనిపించింది. ఇంకా 45 నిమిషాల ఆటనే మిగిలి ఉంది. ఈ సమయంలో పిచ్ పై కవర్స్ తీయలేమని గ్రౌండ్ స్టాఫ్ చెప్పడంతో అంపైర్లు నాలుగో రోజు ఆట ముగిసిందని ప్రకటించారు. దీనిపైనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
లెక్క నాలుగు.. తీయాల్సింది మూడే..!
ఇంగ్లండ్ ప్రస్తుతం 339/6 తో ఉంది. ఇంకా విజయానికి 35 పరుగులే కావాలి. అయితే, భారత బౌలర్ల దూకుడుతో ఈ కాస్త పరుగులే కొండలా కనిపించసాగాయి. ఎందుకంటే అంతకుముందు ఓవర్ కు నాలుగు లేదా ఐదు పరుగులు సాధించింది ఇంగ్లండ్. కానీ, రూట్ ఔటయ్యాక 20 బంతుల ఆట జరిగితే వచ్చింది 2 పరుగులే. అలాంటి సమయంలో వెలుతురు లేదని మ్యాచ్ ఆపేశారు. అనంతరం వర్షం కూడా మొదలైంది. దీంతో నాలుగో రోజు ఆటను ముందే ముగించేశారు.
వరుసగా ఐదో టెస్టు ఐదో రోజు...
ఇంగ్లండ్‌తో వరుసగా ఐదో టెస్టు కూడా ఐదో రోజు జరుగుతోంది. బహుశా ఇదొక విచిత్రమే. దీన్నిబట్టే సిరీస్ ఎంత హోరాహోరీగా సాగిందో తెలుస్తోంది. వాస్తవానికి ప్రస్తుత ఐదో టెస్టు నాలుగో రోజు ఆదివారమే ముగిసేదేమో..? కానీ ముందు వెలుతురు తర్వాత వానతో ఆగిపోయింది. శని, ఆదివారాలు సెలవు రోజులు కావడంతో ఓవల్ స్టేడియానికి భారీగా ప్రేక్షకులు తరలివచ్చారు. వీరంతా మ్యాచ్ ఆగిపోవడంతో నిరుత్సాహపడ్డారు. వెలుతురు మందగించాక.. వర్షం పడి ఆగిపోయినా.. వెలుతురు లేదని నిలిపివేశారు. దీనిపైనే కామెంటేటర్లు నాసిర్ హుస్సేన్ (ఇంగ్లండ్), దినేశ్ కార్తీక్ (భారత్) అసహనం వ్యక్తం చేశారు. సోమవారం వర్కింగే డే అని.. ప్రేక్షకులకు ప్రత్యక్షంగా మ్యాచ్ చూసే చాన్స్ లేకుండా చూశారని పేర్కొన్నారు.
-కొద్దిసేపు వర్షం పడి ఆట ఆగిందని.. వెలుతురు లేదని మ్యాచ్ ను నిలిపేయడం సరికాదని దినేశ్ అన్నాడు. ఇంకా సమయం పొడిగించి ఉంటే బాగుండేదని తెలిపాడు. ఈ ఆప్షన్ టీమ్ లకే ఇస్తే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. స్టేడియానికి 20 వేల మంది వచ్చారని.. వీరందరికీ మరుసటి రోజు టికెట్ కొనుక్కుని వచ్చే ఇబ్బంది తప్పదని... ఇలాంటి సమయంలో కాస్త కామన్ సెన్స్ ఉపయోగించాల్సి ఉందన్నాడు. ఇక మరో అరగంట అయినా అదనంగా కేటాయించాల్సిందని, చేయాల్సిన పరుగులు 35 కాకుండా 10 మాత్రమే ఉంటే ఏం చేసేవారని నాసిర్ హుస్సేన్ ప్రశ్నించాడు. అందుకే....దీనిని చీకటి నిర్ణయంగా అభివర్ణిస్తున్నారు.
