2036 'భారత్' ఒలింపిక్స్..3 వేలమందికి నెలకు 50 వేలు..పెద్ద ప్లానే!
ఇప్పటికే ఈ క్రీడల షెడ్యూల్ విడుదలైంది. మరీ ఆసక్తికర విషయం ఏమంటే.. 2028 ఒలింపిక్స్‌లో ఆరు జట్లతో టి20 ఫార్మాట్‌లో క్రికెట్ రీఎంట్రీ ఇస్తుండడం.
By: Tupaki Desk | 20 July 2025 9:32 AM ISTటెన్నిస్ అయితే నాలుగైదు దేశాలవారిదే ఆధిపత్యం..క్రికెట్‌లో మహా అంటే పది దేశాల జట్లే పెద్దవి.. ఫుట్‌బాల్‌లో అయితే 20-30 దేశాల జట్లు బాగా ఆడతాయి.. మరి ఒలింపిక్స్...? మరే ఇతర క్రీడా పోటీలకు లేని విశిష్టత.. ప్రపంచమే ఓ దగ్గరకు చేరే ప్రత్యేకత.. అందుకే అవి విశ్వ క్రీడలు అయ్యాయి. ‘పాల్గొనడమే ప్రధానం’.. ఇదీ ఒలింపిక్స్ నినాదం. కానీ, ఇలాంటి పోటీలను నిర్వహించడమూ ప్రధామనే. ఇన్నాళ్లలో చూస్తే ఒలింపిక్స్ అత్యధికంగా యూరప్, అమెరికాలోనే ఎక్కువగా నిర్వహించారు. గత ఏడాది (2024) పారిస్‌లో జరిగాయి. వచ్చేసారి (2028) అమెరికాలోని లాస్ ఏజెంలెస్ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. ఇప్పటికే ఈ క్రీడల షెడ్యూల్ విడుదలైంది. మరీ ఆసక్తికర విషయం ఏమంటే.. 2028 ఒలింపిక్స్‌లో ఆరు జట్లతో టి20 ఫార్మాట్‌లో క్రికెట్ రీఎంట్రీ ఇస్తుండడం.
రూ.లక్షల కోట్లు నిర్వహణకే అయ్యే ఒలింపిక్స్‌కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వాలో చాలా సంవత్సరాలు ముందుగానే నిర్ణయిస్తారు. ఉదాహరణకు 2021లోనే 2032 ఒలింపిక్స్ నిర్వహణ నగరం ఖరారైంది. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక తదుపరి ఒలింపిక్స్ 2036లో. దీనికి ప్రత్యేకత ఏమంటే.. భారత్ ఆతిథ్య హక్కుల కోసం బిడ్ వేయడం. సౌదీ అరేబియా, ఇండోనేసియా, తుర్కియే, చిలీలతో మన దేశం పోటీపడుతోంది. 2036లో అహ్మదాబాద్ వేదికగా ఒలింపిక్స్ నిర్వహిస్తామని ఈ నెలలోనే బిడ్ సమర్పించింది భారత బృందం. పోటీపడుతున్న దేశాల పేర్లను చూసినా.. మనకే దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే జరిగితే.. స్వదేశంలో ఒలింపిక్స్ నిర్వహిస్తూ కనీసం పతకాలు సాధించకపోతే ఎలా..?
అందుకోసమే కేంద్ర ప్రభుత్వం పెద్ద ప్రణాళికే వేసింది. విశ్వ క్రీడల్లో టాప్-5లో నిలవాలని లక్ష్య పెట్టుకుంది. 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా మూడు వేల మంది క్రీడాకారులను ఎంపిక చేసి వీరికి నెలకు రూ.50 వేలు ఆర్థిక సాయం చేస్తోంది. ఈ వివరాలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. మోదీ ప్రభుత్వం క్రీడల బడ్జెట్‌ను ఐదు రెట్లు పెంచిందని.. 2036 ఒలింపిక్స్‌కు సన్నాహాలు సాగిస్తోందని చెప్పారు. కాగా, మరో 11 ఏళ్లలో జరిగే ఈ క్రీడల్లో పతకాలు తెచ్చేలా 3 వేల మంది వర్థమాన క్రీడాకారులను కేంద్రం ప్రోత్సహిస్తున్నట్లు అర్థమవుతోంది. వీరందరినీ తీర్చిదిద్ది టాప్-5 టార్గెట్ పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.
చాలాసార్లు ఒలింపిక్ పతకాల పట్టికలో అమెరికానే టాప్‌లో ఉంటుంది. సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు తప్ప ఇటీవలి కాలంలో అమెరికాకు ఎదురులేదు. అయితే, 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో మాత్రం అమెరికాకు ఆతిథ్య చైనా చెక్ పెట్టి టాప్‌లో నిలిచింది.
