కప్పులు కొట్టలేరు..వాటిని కొట్టేయండి..పాక్ పై మాజీ స్టార్ సెటైర్
తర్వాత దానిని ఏసీసీ ప్రధాన కార్యాలయంలో ఉంచినట్లుగానూ కథనాలు వచ్చాయి. ఏదైతేనేం..? టి20 ప్రపంచకప్ ముగిశాక కూడా టీమ్ఇండియా చేతికి ఆసియాకప్ మాత్రం అందలేదు.
By: Tupaki Political Desk | 16 March 2026 5:00 PM IST2025 సెప్టెంబరు 29.. అంటే, దాదాపు ఆరు నెలలు...! హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ సూపర్ ఇన్నింగ్స్ తో టీమ్ఇండియా ఆసియా కప్ గెలిచింది. కానీ, ఇంతవరకు టైటిల్ మన చేతికి రాలేదు. పెహల్గాం ఉగ్రదాడికి నిరసనగా... ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చైర్మన్ పదవిలో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీసీ) చైర్మన్ మొహిసిన్ నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకోవడానికి టీమ్ఇండియా నిరాకరించింది. అసలు ఈ టోర్నీలో ఫైనల్ సహా మూడు మ్యాచ్ లలో పాకిస్థాన్ తో తలపడినా ఆ జట్టు ఆటగాళ్లకు భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. టాస్ సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అసలు పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాను పట్టించుకోలేదు. దీంతో పాక్ చాలా కుతంత్రాలు పన్నింది. కానీ, ఇవేమీ నడవలేదు. చివరకు ఆసియా కప్ ట్రోఫీని తీసుకుని హోటల్ కు వెళ్లిపోయాడు నఖ్వీ. తర్వాత దానిని ఏసీసీ ప్రధాన కార్యాలయంలో ఉంచినట్లుగానూ కథనాలు వచ్చాయి. ఏదైతేనేం..? టి20 ప్రపంచకప్ ముగిశాక కూడా టీమ్ఇండియా చేతికి ఆసియాకప్ మాత్రం అందలేదు.
ఆరు నెలల్లో నాలుగు పరాజయాలు
ఆసియాకప్ కోపాన్ని మనసులో పెట్టుకున్న పాకిస్థాన్ టి20 ప్రపంచ కప్ లో బంగ్లాదేశ్ ను ఎగదోశాయి. హిందువులపై దాడుల కారణంగా ఆ దేశ ఆటగాడిని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి తప్పించగా, దానిని సాకుగా చూపుతూ టి20 ప్రపంచ కప్ లో భారత్ లో ఆడాల్సిన మ్యాచ్ లను శ్రీలంకకు తరలించాలని కోరింది. ఇది సాధ్యం కాదని తేలడంతో టోర్నీ నుంచే వైదొలగింది. దీనివెనుక పాకిస్థాన్ ఉందని తెలుస్తోంది. భారత్ తో శ్రీలంకలో జరగాల్సిన టి20 ప్రపంచ కప్ మ్యాచ్ ను బాయ్ కాట్ చేస్తామంటూ బెదిరించిన పాక్ చివరకు తోక ముడిచింది. కాగా, గత ఆరు నెలల్లో పాకిస్థాన్ టీమ్ ఇండియా చేతిలో నాలుగు మ్యాచ్ లలో ఓడింది. ఆసియాకప్ లో మూడుసార్లు, టి20 ప్రపంచ కప్ లో ఒకసారి పరాజయం పాలైంది. అంతేకాదు, ఈ ఆరు నెలల కాలంలో క్రికెట్ లో ఆ జట్టు మరింత దిగజారింది.
బంగ్లాను ఎగదోసి.. బంగ్లా చేతిలోనే పరాభవం
టి20 ప్రపంచ కప్ ను బాయ్ కాట్ చేసేలా బంగ్లాను ఎగదోసిన పాక్ కు.. అదే బంగ్లా చేతిలో తాజాగా పరాభవం ఎదురైంది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్ ను బంగ్లా 2-1 తేడాతో నెగ్గింది. ఆదివారం చివరి వన్డేలో బంగ్లా 290 పరుగులు చేయగా పాక్ 277కే పరిమితం అయింది. దీంతో సిరీస్ ను కోల్పోయింది. గత బుధవారం జరిగిన తొలి వన్డేలో పాక్ కేవలం 114 పరుగులకే ఆలౌటైంది. రెండో వన్డేలో డీఎల్ఎస్ పద్ధతిలో 128 పరుగుల తేడాతో నెగ్గింది. బంగ్లా చేతిలోనూ వన్డే సిరీస్ ఓడిపోయిన నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ కమ్రాన్ అక్మల్ తీవ్రంగా స్పందించాడు. మ్యాచ్ లను గెలవడం ఇక పాకిస్థాన్ వల్ల కాదని.. ఐసీసీ ట్రోఫీలను కొట్టేయాలంటూ సెటైర్ వేశాడు. ఆసియా కప్ ఉదంతాన్ని పరిగణనలోకి తీసుకునే అతడు ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవుతుంది. ఇప్పుడు నెదర్లాండ్స్ కూడా పాక్ ను ఓడించి టెస్టు హోదా పొందుతుందని ఎద్దేవా చేశాడు.
