Begin typing your search above and press return to search.

ఇమ్రాన్ కోసం ఏక‌మైన 14 మంది క్రికెట్ దిగ్గ‌జాలు.. పాక్ కు లేఖ‌

ఈ నేప‌థ్యంలోనే ఇమ్రాన్ తో క‌లిసి ఆడిన ప్ర‌పంచ దిగ్గ‌జాలైన క్రికెట‌ర్లు చ‌లించిపోయారు. ఇమ్రాన్ విష‌య‌మై తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తూ పాక్ ప్ర‌భుత్వానికి వివిధ దేశాల‌కు చెందిన 14 మంది క్రికెట‌ర్లు లేఖ రాశారు.

By:  Tupaki Political Desk   |   17 Feb 2026 5:08 PM IST
ఇమ్రాన్ కోసం ఏక‌మైన 14 మంది క్రికెట్ దిగ్గ‌జాలు.. పాక్ కు లేఖ‌
X

ఒక‌టి కాదు రెండు కాదు.. దాదాపు 800 రోజులుగా జైల్లో ఒంట‌రి జీవితం. 70 ఏళ్లకు పైబ‌డిన‌ వ‌య‌సులో బ‌య‌టి ప్ర‌పంచమే తెలియ‌దు. రోజురోజుకు క్షీణిస్తోన్న ఆరోగ్యం.. అస‌లు వైద్యం అన్న మాటే లేదు. ఆయ‌నను చూడాలంటూ కుటుంబ స‌భ్యుల ఆరాటం.. కానీ, క‌ఠిన‌మైన ప్ర‌భుత్వం క‌నిక‌రించింది లేదు.. మ‌రి ఆ దిగ్గ‌జ క్రికెట‌ర్ క‌మ్ రాజ‌కీయ నేత‌ను బ‌య‌ట‌కు తీసుకొచ్చేది ఎలా? త‌న జీవితం జైలు గోడ‌ల మ‌ధ్య ముగిసిపోవాల్సిందేనా? వారి దేశానికి వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ అందించి ప్ర‌పంచ క్రికెట్లో ఉన్నత స్థానంలో నిలిపిన గొప్ప నాయ‌కుడి క‌థకు ఇదేనా ముగింపు? ఇవీ పాకిస్థాన్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ విష‌యంలో ఇటీవ‌లి కాలంలో వ‌రుస‌గా వ‌చ్చిన ప్ర‌శ్న‌లు. కానీ, స‌మాధానాలు లేవు. ఈ నేప‌థ్యంలోనే ఇమ్రాన్ తో క‌లిసి ఆడిన ప్ర‌పంచ దిగ్గ‌జాలైన క్రికెట‌ర్లు చ‌లించిపోయారు. ఇమ్రాన్ విష‌య‌మై తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తూ పాక్ ప్ర‌భుత్వానికి వివిధ దేశాల‌కు చెందిన 14 మంది క్రికెట‌ర్లు లేఖ రాశారు. వీరిలో మ‌హిళా క్రికెట‌ర్లు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం.

ప‌ద‌వి కోల్పోయి

స‌రిగ్గా నాలుగేళ్ల కింద‌ట మొద‌లైన ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ర‌ష్యాను స‌మ‌ర్థించారు అప్ప‌టి పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్. ఇది అమెరికాకు కోపం తెప్పించింది. స‌హ‌జంగానే ఆ త‌ర్వాత ఆయ‌న ప‌ద‌విని కోల్పోయారు. అవినీతి ఆరోప‌ణ‌ల‌తో అనంత‌రం జైలు పాల‌య్యారు కూడా. రెండున్న‌రేళ్ల‌కు పైగా జైల్లో ఒంట‌రి జీవితం గ‌డుపుతున్న ఆయ‌న ఆరోగ్యం క్షీణించింది. కుడి కంటి చూపు 85 శాతం కోల్పోయిన‌ట్లు ఇమ్రాన్ న్యాయ‌వాదులు తెలిపారు. మూడు నెల‌లుగా త‌న‌కు స‌రైన వైద్యం అందించాల‌ని ఇమ్రాన్ కోరుతున్నా జైలు అధికారులు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని కూడా చెప్పారు. అటు ఈ మాజీ ప్ర‌ధాని కుటుంబ స‌భ్యులు కూడా కొద్ది రోజుల కింద‌ట త‌మ‌వాడి ఆరోగ్యంపై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

స‌హ‌చ‌ర ఆట‌గాడి కోసం..

ఇమ్రాన్ గొప్ప ఆల్ రౌండ‌ర్. త‌న త‌రంలో క‌లిసి ఆడిన దిగ్గ‌జాలు ఇమ్రాన్ గురించి ఆవేద‌న చెందుతున్నారు. వీరిలో భార‌త క్రికెట్ లో అత్యంత‌ ప్ర‌ముఖులైన సునీల్ గావ‌స్క‌ర్, క‌పిల్ దేవ్ కూడా ఉన్నారు. ఆస్ట్రేలియాకు చెందిన గ్రెస్ చాపెల్ స‌హా 14 మంది దిగ్గ‌జాలు మంగ‌ళ‌వారం పాక్ స‌ర్కారుకు లేఖ రాశారు. ఇమ్రాన్ ఆరోగ్యంపై ఆయ‌న సోద‌రి అలీమా ఖ‌నుమ్ వ్య‌క్తం చేసిన ఆందోళ‌న‌ను పేర్కొన్నారు. ఆమె ఆవేద‌న‌తో తాము ఏకీభ‌విస్తున్న‌ట్లు చెప్పారు.

లేఖ రాసింది వీరే..

గావ‌స్క‌ర్, క‌పిల్, క్లైవ్ లాయిడ్ (వెస్టిండీస్‌), డేవిడ్ గోవ‌ర్, నాజ‌ర్ హుస్సేన్, మైకేల్ అథ‌ర్ట‌న్ (ఇంగ్లండ్), స్టీవ్ వా, ఇయాన్ చాపెల్, గ్రెగ్ చాపెల్, అల‌న్ బోర్డ‌ర్ (ఆస్ట్రేలియా), మేకైల్ బ్ర‌య‌ర్లీ, జాన్ రైట్ (న్యూజిలాండ్)తో పాటు ఆసీస్ మ‌హిళ‌ల జ‌ట్టు మాజీ కెప్టెన్ బెలిండా క్లార్క్ ఉన్నారు. క్రికెట్లో పాకిస్థాన్ కు ఇమ్రాన్ అందించిన సేవ‌ల‌ను గుర్తిస్తూ.. ఆయన‌ నాయ‌క‌త్వాన్ని ప్ర‌స్తావిస్తూ.. పాక్ ప్ర‌ధాని ష‌హ‌బాజ్ ష‌రీఫ్ ఆలోచ‌న‌తో నిర్ణ‌యం తీసుకోవాల‌న్నారు.