Begin typing your search above and press return to search.

సూపర్ షమీ.. వరల్డ్ కప్ చరిత్రలోనే తొలిసారి

నాలుగేళ్ల క్రితం కివీస్ చేతిలో ఎదురైన దారుణ ఓటమి అవమానం వెంటాడుతున్న వేళ.. తాజాగా షమీ పుణ్యమా అని టీమిండియా అద్భుత విజయాన్ని సాధించింది

By:  Tupaki Desk   |   16 Nov 2023 4:02 AM GMT
సూపర్ షమీ.. వరల్డ్ కప్ చరిత్రలోనే తొలిసారి
X

కింద పడిన కెరటం పైకి లేవదన్న నానుడిలో తప్పుందని ఫ్రూవ్ చేశాడు షమీ. వ్యక్తిగత సమస్యలు విరుచుకుపడిన వేళ.. ఎంతటోడైనా కిందపడతాడు.. కోలుకోవటానికి నానా తిప్పలు పడతాడు. ఇది సరిపోదన్నట్లు టాలెంట్ ఉన్నా అవకాశం రాకపోవటానికి మించిన వేదన మరొకటి ఉండదు. ప్రపంచకప్ టోర్నీకి జట్టులోకి వచ్చినప్పటికి.. తుది జట్టులో పేరు లేని వేళ.. టోర్నీ మొదలైన తర్వాత ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన షమీ.. తానేమిటో చాటి చెప్పటమే కాదు.. షమీ లేకుంటే అన్న భావనకే భయం కలిగేలా చేశాడు.

నాలుగేళ్ల క్రితం కివీస్ చేతిలో ఎదురైన దారుణ ఓటమి అవమానం వెంటాడుతున్న వేళ.. తాజాగా షమీ పుణ్యమా అని టీమిండియా అద్భుత విజయాన్ని సాధించింది. ఈ ప్రపంచకప్ టోర్నీలో ఫైనల్ లోకి దూసుకెళ్లింది. ఆరంభ మ్యాచ్ నుంచి సెమీస్ వరకు ఒక్కటంటే ఒక్క ఓటమిని ఎరుగని టీమిండియా ఆదివారం జరిగే ఫైనల్ పోరుకు అర్హతను సాధించింది. గురువారం జరిగే రెండో సెమీ ఫైనల్ లో దక్షిణాఫ్రికా - ఆస్ట్రేలియా జట్లలో ఎవరు విజయం సాధిస్తే వారితో టీమిండియా తలపడనుంది.

తాజాగా అద్భుత విజయాన్ని సాధించిన సెమీస్ లో..బంతితో మేజిక్ చేశాడు మహ్మద్ షమీ. కివీస్ బ్యాట్స్ మెన్లు బ్యాట్లను ఝుళిపిస్తూ.. భయాన్ని కలిగిస్తున్న వేళ.. బంతితో ఎంట్రీ ఇచ్చిన షమీ.. సెమీ ఫైనల్ మ్యాచ్ ను షమీ ఫైనల్ మ్యాచ్ గా మార్చాడని చెప్పాలి. బంతితో ఏడు వికెట్లు సాధించి.. కివీస్ కీలు విరిచేసి.. తన ఒంటి చేత్తో భారత్ కు అద్భుత విజయాన్ని సొంతమయ్యేలా చేశాడు.

అంతేకాదు.. పలు రికార్డుల్నిబ్రేక్ చేశాడు. సెమీ ఫైనల్ లో ఏడు వికెట్లను సాధించటం ద్వారా కివీస్ జట్టు పతనాన్ని తన బంతితో లిఖించిన షమీ.. వరల్డ్ కప్ చరిత్రలో భారత్ తరఫున ఒక మ్యాచ్ లో ఇన్ని వికెట్లు తీయటం ఇదే తొలిసారి కావటం.. ఆ రికార్డు షమీ పేరున నమోదైంది.

అంతకు ముందు ఆశిష్ నెహ్రా 2003 వరల్డ్ కప్ లో ఆరు వికెట్లు తీయగా.. తాజాగా ఏడు వికెట్లను తీయటం ద్వారా షమీ సరికొత్త చరిత్రను లిఖించాడు. న్యూజిలాండ్ ఓపెనర్లు బాగా రాణిస్తున్న వేళ.. ఆరో ఓవర్లో బంతిని అందుకున్న షమీ.. తన తొలి ఓవర్ తొలి బంతికే కాన్వే వికెట్ ను తీసుకొని తన వికెట్ల ఖాతాను మొదలు పెట్టాడు. ఫీల్డింగ్ లో విలియమ్స్ క్యాచ్ ను మిస్ చేయటం ద్వారా గుర్రుగా ఉన్న ఫ్యాన్స్ కు.. ఆ తర్వాత అదే బంతితో ఫీస్ట్ లాంటి విజయాన్ని అందించాడు. తను చేసిన తప్పును క్రికెట్ అభిమానులంతా మరిచిపోయేలా చేశాడు.

క్యాచ్ మిస్ అయినంతనే షమీ మీద ఆన్ లైన్ లో పంచ్ లు పడిపోగా.. తర్వాత బంతితో మేజిక్ చేసి.. ఏడు వికెట్లను తీయటం ద్వారా తనను ట్రోల్ చేసే వారి చేతులకు పని లేకుండా చేశాడు. వారే ఆనందంతో నోటికి పని చెప్పేలా చేయటం గమనార్హం. కివీస్ స్కోర్ దూసుకెళుతూ.. సగటు క్రికెట్ ఫ్యాన్ కు ఆందోళన అంతకంతకూ పెరుగుతున్న వేళలో.. మరోసారి బంతిని అందుకున్న షమీ.. తాను ఎవరి క్యాచ్ ను మిస్ చేశాడో.. అదే విలయమ్స్ వికెట్ ను 33వ ఓవర్లో పడగొట్టాడు. అదే ఓవర్ లో టామ్ లాథమ్ ను డకౌట్ చేవాడు.

ఆ దెబ్బతో మ్యాచ్ ను కీలక మలుపు తిప్పాడు. ఆ తర్వాత నుంచి కివీస్ కు వరుస ఎదురుదెబ్బలు షమీ చేతిలో పడ్డాయి. టీమిండియాకు తలనొప్పిగా మారాడనుకున్న మిచెల్ వికెట్ ను సైతం తానే తీసుకున్న షమీ.. దాంతో ఐదో వికెట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అత్యధిక ఐదు వికెట్ల రికార్డును తన పేరుతో లిఖించుకున్నాడు. అక్కడితో ఆగని అతడు 49వ ఓవర్లో మరో రెండు వికెట్లను తీసుకోవటం ద్వారా.. మొత్తం ఏడు వికెట్లను తన ఖాతాలో రాసుకున్నాడు. టీమిండియా విజయాన్ని లిఖించేశాడు.

సెమీస్ లోనే కాదు.. లీగ్ మ్యాచ్ లోనూ కివీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు షమీ. లీగ్ దశలో జరిగిన ఐదో మ్యాచ్ లో షమీ.. ఆ టైంలోనూ ఐదు వికెట్లు పడగొట్టాడు. ఈ ఐదు వికెట్ల హాల్ తో ప్రపంచ కప్ టోర్నీలో నాలుగుసార్లు హైఫర్ సాధించిన బౌలర్ గా షమీ మరో రికార్డును తన పేరు మీద లిఖించుకున్నాడు. అంతేకాదు.. ప్రపంచ కప్ లో అత్యధికసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన బౌలర్ గా ప్రపంచ రికార్డును క్రియేట్ చేశాడు. షమీ ఇప్పటివరకు ఇలాంటి ఘనతను నాలుగు సార్లు ఐదు వికెట్ల ఘనత అందుకోగా.. ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ మూడుసార్లు ఈ ఫీట్ చేశారు.

విశేషం ఏమంటే.. షమీ ఈ ప్రపంచ కప్ టోర్నీలోనే ఐదు వికెట్ల ప్రదర్శనను మూడుసార్లు చేశారు. ఫైనల్ లో మరోసారి ఈ మేజిక్ రిపీట్ చేస్తే.. ఈ రికార్డు లెవల్ మరో స్థాయికి చేరటం ఖాయం. అంతేకాదు.. ప్రపంచకప్ లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్ గా షమీ రికార్డు క్రియేట్ చేశారు. 17 ఇన్నింగ్స్ లో అతడు ఈ ఘనతను అందుకున్నాడు. భారత్ తరఫున ప్రపంచ కప్ లో ఎక్కువ వికెట్లు సాధించిన బౌలర్ గా నిలిచారు.

షమీ ఇప్పటివరకు 54 వికెట్లు పడగొట్టగా.. అతని తర్వాత జహీర్ ఖాన్ 44, జవగళ్ శ్రీనాధ్ 44 వికెట్లలో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక.. జహీర్ ఖాన్ పేరుతో ఉన్న మరో రికార్డును సైతం షమీ బద్దలు కొట్టేశాడు. ఒక ప్రపంచ కప్ లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ గా నిలిచారు. షమీ 23 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా.. అంతకు ముందు ఈ రికార్డు జహీర్ ఖాన్ పేరుతో ఉండేది.2011 ప్రపంచకప్ లో జహీర్ 21 వికెట్లు తీయటం తెలిసిందే. తాజా మ్యాచ్ లో చేసిన అద్భుత ప్రదర్శనకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ను సొంతం చేసుకున్నాడు. కోట్లాది మంది భారతీయులకు.. క్రికెట్ ప్రేమికులకు మర్చిపోలేని అనుభూతిని అందించాడని చెప్పక తప్పదు.