Begin typing your search above and press return to search.

మోతమోగించిన మాక్స్ వెల్... స్థిరత్వంచూపించిన వార్నర్!

తాజాగా భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ కు వచ్చిన ఆస్ట్రేలియా మొదట్లో తడబడింది. ఇది ఆస్ట్రేలియా టీమేనా అనే అనుమానం కలిగించేస్థాయిలో కంగారుపడింది

By:  Tupaki Desk   |   26 Oct 2023 4:45 AM GMT
మోతమోగించిన మాక్స్ వెల్... స్థిరత్వంచూపించిన వార్నర్!
X

తాజాగా భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ కు వచ్చిన ఆస్ట్రేలియా మొదట్లో తడబడింది. ఇది ఆస్ట్రేలియా టీమేనా అనే అనుమానం కలిగించేస్థాయిలో కంగారుపడింది. ఇలా తొలి రెండు మ్యాచ్‌ ల్లో ఓటమిపాలవ్వడంతో సెమీఫైనల్‌ అవకాశాలపైనే ప్రశ్నలు తలెత్తిన పరిస్థితి. ఆఫ్టర్ ఎ స్మాల్ గ్యాప్ బాస్ ఈజ్ బ్యాక్ అన్నట్లుగా తిరిగి ఫాం లోకి వచ్చింది ఆసిస్. ఫలితంగా... విజయాల హ్యాట్రిక్‌ కొట్టింది. రన్‌ రేట్‌ నూ గణనీయంగా మెరుగుపర్చుకుంది. పాజిటివ్ రన్ రేట్ తో పాయింట్ల పట్టికలో నాలుగోస్థానంలో కొనసాగుతుంది!

ఆసిస్ ఈజ్ బ్యాక్! తాజాగా నెదర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో గెలిచిన ఆస్ట్రేలియా హ్యాట్రిక్ విజయాలు అందుకుంది! అయితే ఈ మ్యాచ్ మరీ వార్ వన్ సైడ్ అన్నట్లుగా సాగిపోయింది!! ఏ దశలోనూ నెదర్లాండ్ పైచేయి సాధించలేకపోయింది. మ్యాక్స్‌ వెల్‌ మోత, మరోసారి తగ్గేదేలే అన్నట్లుగా సాగిన వార్నర్ ఫెర్మార్మెన్స్ తో పసికూన మైనస్ డిగ్రీ టెంపరేచర్ లో వణికినట్లు వణికిపోయింది! నెదర్లాండ్ బౌలర్లు వేయడం, వీరు కొట్టడం.. వారు వెయ్యడం, వీరు కొట్టడం.. బంతి పులిసిపోయిందంటే నమ్మాల్సిన పరిస్థితి!

అవును... తాజాగా నెదర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో గెలవడంతో ప్రపంచకప్‌ లో ఆస్ట్రేలియాకు వరుసగా మూడో విజయం అందుకుంది. ఈ మ్యాచ్ తో లొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్స్ లో మిచెల్‌ మార్ష్‌ (9) తక్కువస్కోర్ కే వెనుదిరిగినా... వార్నర్‌ మాత్రం అదే స్థిరత్వంతో ఆడాడు. మరోసారి సెంచరీ (104: 93 బంతుల్లో 11×4, 3×6) కొట్టాడు. దీంతో... ఈసారి "తగ్గేదే లే" అని మైదానంలో ప్రేక్షకులు అనడం గమనార్హం!

ఇదే సమయంలో మిడిల్ ఆర్డర్స్ లో స్మిత్‌ (71: 68 బంతుల్లో 9×4, 1×6), లబుషేన్‌ (62: 47 బంతుల్లో 7×4, 2×6) రాణించారు. అయితే ఈ సమయంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మ్యాక్స్ వెల్ గురించి. ఈ మ్యాచ్ లో మ్యాక్స్‌ వెల్‌ (106: 44 బంతుల్లో 9×4, 8×6) ప్రపంచకప్‌ చరిత్రలోనే వేగవంతమైన సెంచరీ బాదాడు. బంతి పడటం ఆలస్యం... కెమెరాలన్నీ బౌండరీ లైన్ వైపు తిరిగిపోయేవి!

ఈ దారుణమైన ఊచకోత ఫలితంగా ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోరు సాధించింది. నెదర్లాండ్ ముందు 400 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అనంతరం బ్యాటింగ్ కి దిగిన నెదర్లాండ్ బ్యాటర్లలో ఆరుగురు సింగిల్ డిజిట్ పరుగులకే అవుటయ్యారు. విరం జీత్‌ సింగ్‌ (25) టాప్‌ స్కోరర్‌. దీంతో... 21 ఓవర్లలో 90 పరుగులకే కుప్పకూలింది. ఆసిస్ బౌలర్లలో జంపా (4/8), మిచెల్‌ మార్ష్‌ (2/19) డచ్ బ్యాటర్స్ ని కంగారెత్తించేశారు.

ఇక ఈ మ్యాచ్ లో రికార్డుల విషయానికొస్తే... మ్యాక్స్‌ వెల్‌ 40 బంతుల్లోనే సెంచరీ చేయడంతో... ప్రపంచకప్‌ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన శతకాన్ని సాధించాడు. గతంలో... మార్క్రమ్‌ పేరిట ఈ రికార్డ్ ఉండేది. 2023లో శ్రీలంకపై 49 బంతుల్లో అతడు సెంచరీ చేశాడు! ఇక తాజా సెంచరీతో వార్నర్ పేరిట మరో రికార్డ్ నమోదైంది. వన్డే ప్రపంచకప్ మ్యాచ్ లలో వార్నర్‌ కు ఇది 6 వ శతకం కాగా... అత్యధిక ప్రపంచకప్‌ శతకాలు సాధించిన ఆసీస్‌ బ్యాటర్‌ గా అతడు నిలిచాడు.

ఇక నెదర్లాండ్స్‌ బౌలర్‌ డి లీడ్‌ 10 ఓవర్లలో 115 పరుగులు ఇవ్వడం కూడా రికార్డే! ఈ దారుణమైన రికార్డు ఇప్పటివరకు ఆసీస్‌ బౌలర్‌ మిక్‌ లూయిస్‌ పేరుమీద ఉండెది. 2006లో దక్షిణాఫ్రికాపై ఇతడు పదిఓవర్లు బౌలింగ్ చేసి 113 పరుగులు సమర్పించుకున్నాడు. ఇప్పుడు లీడ్ ఆ రికార్డును బద్దలు కొట్టాడు! ఇవ్వడం మొదలుపెడితే తనకంటే బాగా ఎవరూ ఇవ్వలేరని సాటిచెప్పాడు!