Begin typing your search above and press return to search.

పండుగలు.. సెంటిమెంట్ మూడ్.. ప్రపంచ కప్.. రూ.20 వేల కోట్లు

150 మంది జనాభా ఉన్న భారత దేశంలో ఫెస్టివల్ మూడ్ మొదలైంది. ఆగస్టు నుంచి ప్రారంభమయ్యే ఈ మూడ్.. జనవరి వరకు కొనసాగుతుంది

By:  Tupaki Desk   |   6 Oct 2023 10:14 AM GMT
పండుగలు.. సెంటిమెంట్ మూడ్.. ప్రపంచ కప్.. రూ.20 వేల కోట్లు
X

150 మంది జనాభా ఉన్న భారత దేశంలో ఫెస్టివల్ మూడ్ మొదలైంది. ఆగస్టు నుంచి ప్రారంభమయ్యే ఈ మూడ్.. జనవరి వరకు కొనసాగుతుంది. ఈ మధ్యలోనే అన్ని మతాల పండుగలూ వస్తుంటాయి. మార్కెట్ వర్గాలు సైతం దీన్నే కొనుగోళ్ల సీజన్ గానూ భావిస్తుంటాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ప్రపంచ కప్ క్రికెట్ కూడా రావడంతో కొనుగోళ్లు రంజుగా సాగనున్నాయి. అదికూడా మామూలుగా కాదు రికార్డు స్థాయిలో జరగనున్నాయి.

భారత్ మార్కెట్ కళకళ

ఫుట్ బాల్ తర్వాత ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన క్రీడ క్రికెట్. అందులోనూ దానికి పెద్ద మార్కెట్ ఇండియా. అలాంటి దేశంలోనే ప్రపంచ కప్ జరుగుతుండడంతో చెప్పడానికి ఏముంది? ఇప్పుడదే జరుగుతోంది. ప్రపంచ కప్‌ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న భారత్ పై కాసుల వర్షం కురవనుంది. దేశంలోని అభిమానులే కాదు.. విదేశాల్లోని వారూ మైదానాలకు వస్తుంటారు. కాగా, ఈ నెల 5న మొదలైన ప్రపంచ కప్ నవంబరు 19 వరకు సాగనుంది. ఈ మధ్యలోనే దసరా, దీపావళి పండుగలూ రానుండడం విశేషం.

పండుగకు ఏదైనా వస్తువు కొనుక్కుందాం.. అనేది భారతీయుల సెంటిమెంట్. దీంతో సెంటిమెంటు ఆధారిత కొనుగోళ్లతో రిటైల్‌ రంగం కూడా రాణించనుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచ కప్‌ తో దేశ ఆర్థిక వ్యవస్థకు 2.4 బిలియన్‌ డాలర్లు లేదా రూ.20 వేల కోట్ల మేర జమవుతాయని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా అంచనా వేస్తోంది.

12 వేల కోట్లు టీవీ హక్కులు; స్పాన్సర్ షిప్ తోనే..

వరల్డ్ కప్ మ్యాచ్‌లు హైదరాబాద్‌ సహా 10 నగరాల్లో జరుగుతున్నాయి. అభిమానుల ప్రయాణాలు, బస నేపథ్యంలో ఆతిథ్య రంగం కూడా ప్రయోజనం పొందనుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. టీవీ, ఓటీటీ ల్లో భారత వీక్షకుల సంఖ్య 2019లో నమోదైన 55.2 కోట్లకు మించి ఈ సారి నమోదవుతుందని భావిస్తున్నారు. టీవీ హక్కులు, స్పాన్సర్‌ షిప్‌ల వల్లే తక్కువలో తక్కువగా రూ.10,500 కోట్ల నుంచి రూ.12,000 కోట్ల వరకు దక్కవచ్చని అంచనా.

విమాన టికెట్లు, హోటల్‌ గదుల అద్దెలు కూడా ఈ సమయంలో భారీగా పెరగనున్నాయి. ఆతిథ్యం ఇస్తున్న 10 నగరాల్లోని అసంఘటిత రంగంలో ధరలు సైతం పెరగొచ్చు. వీటికి తోడు పండగల సీజను ప్రభావమూ ఉంటుంది. టికెట్‌ విక్రయాలపై పన్ను వసూళ్లు; హోటళ్లు, రెస్టారెంట్లు-ఆహార డెలివరీ వంటి వాటిపై జీఎస్‌టీతో ప్రభుత్వ ఖజానా కూడా గలగలలాడవచ్చు.