ఒక డిమెరిట్ పాయింట్.. 15 శాతం ఫీజు కోత.. సిరాజ్ పై ఐసీసీ కొరడా
ఇంగ్లండ్-భారత్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ లో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య మాటమాట పెరుగుతోంది.
By: Tupaki Desk | 14 July 2025 11:00 PM ISTఇంగ్లండ్-భారత్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ లో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య మాటమాట పెరుగుతోంది. ఔటైతే సంబరాలు హద్దులు మీరుతున్నాయి. అప్పీళ్ల సందర్భంగా వాదప్రతివాదాలు శ్రుతిమించుతున్నాయి. సమయం వేస్ట్ చేసి లబ్ధి పొందడంలో విమర్శలు వస్తన్నాయి. తొలి టెస్టులో వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్.. బంతి ఆకారంపై అంపైర్ పట్ల నిరసన వ్యక్తం చేశాడు. ఆ తర్వాత చర్యలను ఎదుర్కొన్నాడు. తాజాగా హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ కు చుక్కెదురైంది.
ఇండ్లండ్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా ఓపెనర్ బెన్ డకౌట్ ఔట్ పట్ల సిరాజ్ దూకుడు చూపాడు. బ్యాట్స్ మన్ కేసి చూస్తూ కసిగా సంబరాలు జరుపుకొన్నాడు. దీంతో ఐసీసీ.. సిరాజ్ కు మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించింది. ఒక డిమెరిట్ పాయింట్ ను జత చేర్చింది.
24 నెలల వ్యవధిలో సిరాజ్ కు రెండోసారి పొరపాటు చేయడంతో ఐసీసీ చర్యలకు దిగింది. ఇప్పటికే ఒక డిమెరిట్ పాయింట్ అతడి ఖాతాలో ఉంది. మరో పాయింట్ కూడా పడడంతో సిరాజ్ సస్పెన్షన్ పాయింట్లకు దగ్గరయ్యాడు. 4 పాయింట్లకు చేరితే మ్యాచ్ ఆడకుండా నిషేధం ఎదుర్కొంటాడు.
సిరాజ్ ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.5ను ఉల్లంఘించాడని ఐసీసీ పేర్కొంది. కాగా, ఇంగ్లండ్ తో ప్రతిష్ఠాత్మక లార్డ్స్ టెస్టులో టీమ్ ఇండియా పరాజయం దిశగా వెళ్తోంది. 193 పరుగులు టార్గెట్ లో 112 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (17 నాటౌట్) పోరాడుతున్నాడు. ఈ రోజు ప్రారంభం నుంచే ఇంగ్లండ్ పై చేయి సాధించింది. పంత్ (9)ను ఆర్చర్ బౌల్డ్ చేయగా.. ఓపెనర్ రాహుల్ (39)ని ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్ ఔట్ చేశాడు. తెలుగు ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (13) కాసేపు పోరాడినా.. ఓక్స్ బౌలింగ్ లంచ్ కు ముందు ఔటయ్యాడు. దీంతో చేతిలో 2 వికెట్లే ఉండగా.. 81 పరుగులు చేయాల్సిన క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటోంది భారత్.
