Begin typing your search above and press return to search.

హైదరాబాద్ వర్సెస్ చెన్నై... దెబ్బతిన్న సింహాల బలాబలాలివే!

ఇందులో భాగంగా... ఇటీవలి మ్యాచ్‌ లలో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌ చేతిలో ఓడిపోగా, గుజరాత్ టైటాన్స్ చేతిలో సన్ రైజర్స్ ఓడిపోయింది.

By:  Tupaki Desk   |   5 April 2024 4:18 AM GMT
హైదరాబాద్  వర్సెస్  చెన్నై... దెబ్బతిన్న సింహాల బలాబలాలివే!
X

ఐపీఎల్ 17లో భాగంగా... ఏప్రిల్ 5న హైదరాబాద్‌ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్‌ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్ లో ఇరు జట్లకు ఇది నాలుగో మ్యాచ్ కాగా... ఇప్పటివరకూ ఆడిన మ్యాచ్ లలో చెన్నై రెండు మ్యాచ్ లలో గెలవగా.. హైదరాబాద్ రెండు మ్యాచ్ లలో ఓటమిపాలైంది.

ఇందులో భాగంగా... ఇటీవలి మ్యాచ్‌ లలో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌ చేతిలో ఓడిపోగా, గుజరాత్ టైటాన్స్ చేతిలో సన్ రైజర్స్ ఓడిపోయింది. దీంతో... రెండు గాయపడిన సింహాలూ తలపడినట్లుగా ఈ మ్యాచ్ ఉండే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇక పాయింట్ల పట్టికలో చెన్నై 3 ప్లేస్ లో ఉండగా.. హైదరాబాద్ 7 ప్లేస్ లో ఉంది.

ఇక ఈ సీజన్ లో హైదరాబాద్ ప్రయాణం విషయానికొస్తే... మార్చి 23న టోర్నమెంట్‌ లోని వారి మొదటి మ్యాచ్‌ లో కోల్‌ కతా నైట్ రైడర్స్ పై 4 పరుగుల తేడాతో ఓడిపోగా... తర్వాత మార్చి 27న ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో రికార్డ్ స్కోర్ చేసి 31 పరుగుల తేడాతో గెలిచింది. అనంతరం గుజరాత్ టైటాన్స్ పై మార్చి 31 న 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

ఈ టీం లో ట్రావిస్ హెడ్, క్లాసెన్, అభిషేక్ శర్మ రూపంలో భారీ హిట్టర్లు ఉండగా.. వారు నిలబడితే లెక్క వేరుగా ఉంటుంది. ఇదే క్రమంలో... భువనేశ్వర్ కుమార్, పాట్ కమిన్స్ నేతృత్వంలో పేస్ అటాక్ బలంగా కనిపిస్తోంది. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్‌ గా మయాంక్ మార్కండే మాత్రమే ఉండటంతో స్పిన్ విభాగంలో కాస్త లోటు కనిపిస్తోంది.

ఇక చెన్నై సూపర్ కింగ్స్ విషయానికొస్తే... మార్చి 22న 6 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని ఓడించగా.. మార్చి 26న గుజరాత్ పై 63 పరుగుల తేడాతో గెలిచింది. అయితే.. మార్చి 31న ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇలా ఈ రెండు టీం లు తమ చివరి మ్యాచ్ లలో ఓడిపోయిన కసిలో ఈసారి బరిలోకి దిగబోతున్నాయి.

చెన్నై టీం లో రచిన్ రవీంద్ర నిలకడగా ఆరంభాలు ఇస్తుండగా, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పరుగులు చేయడంలో కాస్త ఇబ్బంది పడుతున్నాడు. బౌలింగ్ ప్రదర్శనలో మతీషా పతిరనా అద్భుతమైన ఫామ్‌ ను ప్రదర్శించగా.. ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఈ సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన వారిలో ఒకడుగా ఉన్నాడు.

హెడ్ టు హెడ్ రిపోర్ట్స్:

హైదరాబాద్, చెన్నై జట్లు ఇప్పటి వరకు 19 ఐపీఎల్ మ్యాచ్‌ లు ఆడగా... వాటిలో చెన్నై సూపర్ కింగ్స్ 14 మ్యాచ్ లలో గెలిచింది. సన్ రైజర్స్ కేవలం 5 మ్యాచ్ లలోనే విజయం సాధించింది. ఇక చెన్నైపై ఇప్పటివరకు హైదరాబాద్ అత్యధిక స్కోరు 192 పరుగులు కాగా... హైదరాబాద్ పై చెన్నై అత్యధిక స్కోరు 223.

ఉప్పల్ లో సన్ రైజర్స్ రికార్డ్:

ఇక ఇదే మైదానంలో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు రికార్డ్ స్కోర్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 277 పరుగులు చేసింది. ఆ మ్యాచ్ లో క్లాసెన్ (34 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్ లతో 80), అభిషేక్ శర్మ (23 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్ లతో 63), ట్రావిస్ హెడ్ (24 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్ లతో 62) కీలక స్కోరర్లుగా నిలిచారు.