Begin typing your search above and press return to search.

మెస్సీ మంత్రం: హైదరాబాద్‌కు ఫుట్‌బాల్‌ను పరిచయం చేసిన ఒక్క రాత్రి

ఈ రోజు మెస్సీ ఫోటో వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్న కుర్రాడే రేపు పొద్దున తన కొడుకు చేతికి బ్యాట్ కాకుండా కాళ్ళకు ఫుట్‌బాల్ బూట్లు తొడిగినా ఆశ్చర్యం లేదు!

By:  A.N.Kumar   |   18 July 2026 4:42 PM IST
మెస్సీ మంత్రం: హైదరాబాద్‌కు ఫుట్‌బాల్‌ను పరిచయం చేసిన ఒక్క రాత్రి
X

నిన్నమొన్నటి దాకా మన హైదరాబాద్ అంటే.. బిర్యానీ, ఐటీ కారిడార్, పోనీ మహా అయితే ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ మ్యాచ్‌లు. కానీ మొన్న ఆదివారం రాత్రి సీన్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.. గల్లీ గల్లీలో జెర్సీలు, పబ్బుల ముందు జనం క్యూలు.. ఏంట్రా బాబూ అంటే "ఫిఫా ఫైనల్ బాస్!" అని కాలర్ ఎగరేశారు.

నిజానికి మన నగరానికి ఫుట్‌బాల్‌కు ఉన్న సంబంధం ఎంత అంటే.. బాల్‌ను కాళ్లతో తన్నాలి అని తెలిసినంత మాత్రమే.. అలాంటిది ఈ ఒక్క రాత్రి హంగామా చూసి చాలామంది ముక్కున వేలేసుకున్నారు. "సడన్‌గా ఈ ఫుట్‌బాల్ ప్రేమ ఏంట్రా సామీ?" అని పెదవి విరిచారు. కానీ ఆగండి బాస్.. దీన్ని కేవలం 'సోషల్ మీడియా ఇన్ స్టా రీల్స్' హైప్ అని కొట్టేయలేం. దీని వెనుక పెద్ద స్కెచ్చే ఉంది!

క్రేజ్ ఎలా వస్తే ఏంటి.. మొత్తానికి టీవీలు ఆన్ చేశారుగా..

"అరేయ్, వాళ్లకు అఫ్-సైడ్ రూల్ కూడా తెలియదురా.. మెస్సీ కోసం చూస్తున్నారు అంతే!" అని కొందరు ఫుట్‌బాల్ పండితులు తెగ ఫీలైపోయారు. నిజమే కావచ్చు.. క్రేజ్ కేవలం ఒకే ఒక్కడి వల్ల వచ్చి ఉండొచ్చు. కానీ క్రికెట్ పిచ్చితో ఊగిపోయే నగరంలో లక్షల మంది అర్ధరాత్రి పూట నిద్రలు మానేసి వేరే ఆట కోసం రోడ్ల మీదకు వచ్చారంటే అది మామూలు విషయం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఏ క్రీడ అయినా ఇలా ఎవరో ఒక 'స్టార్' గాణ్ణి చూసే మొదలవుతుంది. ఈ రోజు మెస్సీ ఫోటో వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్న కుర్రాడే రేపు పొద్దున తన కొడుకు చేతికి బ్యాట్ కాకుండా కాళ్ళకు ఫుట్‌బాల్ బూట్లు తొడిగినా ఆశ్చర్యం లేదు!

స్క్రీన్ ముందు అరిచేవాడు అల్లాటప్పా కాదండోయ్

పబ్బుల్లో, కేఫ్‌లలో పెద్ద స్క్రీన్ల ముందు బీర్లు తాగుతూ కేకలు వేసే బ్యాచ్‌ను చూసి "వీళ్లంతా పార్ట్-టైమ్ ఫ్యాన్స్" అని ఈసడించుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. పచ్చి నిజం ఏంటంటే గ్రౌండ్‌లో ఆడే ప్లేయర్స్ కంటే ముందు గ్యాలరీలో లేదా స్క్రీన్ ముందు అరిచే ప్రేక్షకులు కావాలి. జనాలు చూస్తేనే కదా ఆట బతికేది. ఈ రోజు కేకలు వేస్తున్న ఈ యూత్ రేపటి తరం ఫుట్‌బాల్ ప్రేక్షకులకు పునాది.

లోపం జనాల్లో లేదు బాస్.. గ్రౌండ్లలో ఉంది

హైదరాబాద్‌లో ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్లబ్‌లు లేవు.. అకాడమీలు అసలే లేవు. ఎందుకంటే ఇక్కడ పెట్టుబడులన్నీ 'క్రికెట్' దేవుడికే సమర్పిస్తారు కాబట్టి.. క్రికెట్‌కు ఉన్నట్టు కోట్లాది రూపాయల స్పాన్సర్‌షిప్‌లు, స్టేడియంలు ఫుట్‌బాల్‌కు కూడా ఇస్తే కథ వేరేలా ఉంటుంది. ఇక్కడ సమస్య ఆడాలనే ఇంట్రెస్ట్ లేకపోవడం కాదు.. ఆడేందుకు సరైన గ్రౌండ్లు లేకపోవడం. అంటే.. మార్కెట్లో 'డిమాండ్' ఫుల్‌గా ఉంది కానీ 'సప్లై' చేసే నాథుడే లేడు!

ప్రభుత్వం వారు.. కాస్త క్రీగంటి చూపు చూడాలి!

మన ముఖ్యమంత్రి గారు కూడా ఈ మ్యాచ్ ప్రదర్శనలకు తెగ పర్మిషన్లు ఇచ్చేసి ఫుల్‌గా సపోర్ట్ చేశారు. కొందరు దీన్ని "సెంటిమెంట్ పాలిటిక్స్" అని విమర్శించొచ్చు గాక. కానీ పైస్థాయిలో ఇలాంటి ప్రోత్సాహం ఉంటేనే ఏదైనా కదులుతుంది. అయితే ఈ ఉత్సాహం కేవలం ఒక్క రాత్రి పబ్బుల పర్మిషన్లకే పరిమితం కాకుండా.. ప్రభుత్వ స్కూళ్లలో ఫుట్‌బాల్ కోర్టులు, జిల్లా స్థాయి టోర్నమెంట్లు, స్కాలర్‌షిప్‌లు ఇస్తే రాత మారుతుంది.

కోల్‌కతాకో, కేరళకో ఫుట్‌బాల్ అనేది రక్తం లోనే ఉందంటారు. మన హైదరాబాద్‌కు ఆ హిస్టరీ లేకపోవచ్చు. కానీ హిస్టరీ ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒకచోట మొదలవ్వాలిగా? మెస్సీ పుణ్యమా అని మొదలైన ఈ 'ఒక్క రాత్రి' హైప్‌ను ఒక బిజినెస్ అవకాశంగానో, క్రీడా సంస్కృతిగానో మార్చగలిగితే.. రేపు ఫుట్‌బాల్ మ్యాప్‌లో హైదరాబాద్ పేరు కూడా గట్టిగానే వినిపిస్తుంది. లేదంటే.. ఎప్పటిలాగే "సరే నెక్స్ట్ ఐపీఎల్ ఎప్పుడు బ్రో?" అనుకుంటూ కూర్చోవాల్సిందే!